పఠాన్కోట్ ఘటనపై విచారణకు పాక్ జేఐటీ
ఇస్లామాబాద్: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాది దాడి ఘటనపై విచారణకు పాకిస్తాన్ సంయుక్త దర్యాప్తు బృందాన్ని (జేఐటీ)ని నియమించింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం వచ్చే నెలలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌ను సందర్శించనుంది. ఈ దాడికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వారం తర్వాత పాక్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.
పాక్ బృందం భారత ప్రభుత్వ అనుమతి తీసుకుని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో సాక్ష్యాలను సేకరించి సొంతంగా దర్యాప్తు చేయనుంది. విచారణ బృందంలో పంజాబ్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (సీటీడీ) ఎడిషనల్ ఐజీ మహ్మద్ తాహీర్ రాయ్‌ను కన్వీనర్‌గా నియమించింది. లాహోర్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఇంటెలిజన్స్ బ్యూరో మహ్మద్ అజిమ్ అర్షద్, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజన్స్(ఐఎస్‌ఐ) లెఫ్టినెంట్ కల్నల్ తన్వీర్ అహ్మద్, మిలిటరీ ఇంటెలిజన్స్ లెఫ్టినెంట్ కల్నల్ ఇర్ఫాన్ మీర్జా, గుజ్జరన్‌వాలా సీటీడీ ఇన్వేస్టిగేషన్ ఆఫీసర్ షాహిద్ తన్వీర్ సభ్యులుగా ఉంటారు. ఈ ఘటనపై భారత్ ఇచ్చిన ఆధారాల మేరకు ప్రాథమిక దర్యాప్తు చేయడానికి ఇంతకుముందు ఆరుగురు సభ్యులతో కూడిన స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీం(సిట్)ను పాక్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ కేసును సిట్ నుంచి జేఐటీకి బదిలీ చేస్తున్నటు పాకిస్తాన్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. జనవరి 2న పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి పాల్పడ్డ నలుగురు ఉగ్రవాదులు పాకిస్తాన్ భూభాగం నుంచే భారత్‌కు వచ్చినట్లు భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ ఆధారాలను పాక్ ప్రభుత్వానికి అందచేశారు. ఈ దాడికి సంబంధించి ఫిబ్రవరి18న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పాక్.. ఈ దాడికి సూత్రధారిగా భావిస్తున్న జైష్ ఏ మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ పేరును నమోదు చేయలేదు.