
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు నానాటికీ క్షీణిస్తున్నాయి. భారత్ నుంచి పాకిస్తాన్‌ను ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేయకుండా నిషేధం విధించే సంకేతాలు కనిపిస్తున్నాయి. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఫార్మా ఉత్పత్తుల వివరాలు ఇవ్వాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ పరిధిలోని డిపార్టుమెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్(డీఓపీ) కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖకు చెందిన ఎగుమతుల సంస్థ ‘ఫార్మెక్సిల్’ను ఆదేశించింది.
ఇక్కడి నుంచి పాకిస్తాన్‌కు వెళ్లే ఔషధాలు, ఫార్మా స్యూటికల్స్ జాబితా రూపొందించాలని పేర్కొంది. ఈ వివరాలు చాలా అత్యవసరమని స్పష్టంచేసింది. ఇండియా నుంచి ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా దేశాలు ఫార్మా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇందులో పాకిస్తాన్ 38వ స్థానంలో ఉంది. ప్రధానంగా ఇండియా నుంచి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్(ఏపీఐ) పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటోంది. భారత్‌నుంచి దిగుమతులు ఆగిపోతే ఔషధాల ధరలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది.