చర్చలు వాయిదా
* విదేశాంగ కార్యదర్శుల భేటీపై భారత్-పాక్ ఉమ్మడి నిర్ణయం
* గతానికి భిన్నంగా సమన్వయంతో సాగుతున్న దాయాది దేశాలు
* జైషే సభ్యుల అరెస్టు కీలక, సానుకూల చర్యగా భారత్ ఆహ్వానం
* పాక్ దర్యాప్తు బృందం పఠాన్‌కోట్ సందర్శించేందుకు అంగీకారం
న్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్‌ల మధ్య శుక్రవారం జరగాల్సిన విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలను స్వల్ప కాలం పాటు వాయిదా వేయాలని ఇరు దేశాలూ ఉమ్మడిగా అంగీకరించాయి. చర్చల ప్రక్రియను పఠాన్‌కోట్ ఉగ్రదాడి పట్టాలు తప్పించరాదని సమన్వయంతో ముందుకు కదిలాయి. దాడిపై దర్యాప్తు కోసం పాక్ ప్రత్యేక దర్యాప్తు బృందం పఠాన్‌కోట్‌ను సందర్శించేందుకు భారత్ అనుమతించింది.
వట్టి ప్రకటనలు సరిపోవు...
భారత్ - పాక్‌లు ద్వైపాక్షిక సంబంధాల విషయంలో గతానికి భిన్నంగా ఇప్పుడు తమ వ్యూహాలపై సమన్వయంతో పనిచేస్తుండటం విశేషం. భారత్‌లో ఉగ్రదాడుల విషయంలో పాక్ శక్తుల పాత్రను గతంలో నిరాకరించిన పాక్.. ఇప్పుడు జైషే నేతలు, సభ్యులను అరెస్ట్ చేసింది. జైషే చీఫ్ మసూద్‌ను అరెస్ట్ చేసినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని తేలినప్పటికీ.. ఆ సంస్థ ఉగ్రవాదులను అరెస్ట్ చేయటం సానుకూలమైన, కీలకమైన చర్యగా భారత్ ఆహ్వానించింది. వట్టి ప్రకటనలు సరిపోవని తాము కోరుకుంటున్నామని ఉద్ఘాటించింది.
అలాగే.. భారత్ కూడా ఇరు దేశాల మధ్య చర్చలను రద్దు చేసుకోలేదు. జైషే చీఫ్ అరెస్టుకు, చర్చలకు ముడిపెట్టలేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ పాక్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌధరితో చర్చల నిమిత్తం గురువారం ఇస్లామాబాద్ చేరుకోవాల్సి ఉంది. అయితే.. వారిద్దరూ గురువారం ఫోన్‌లో మాట్లాడుకుని చర్చలను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయించారు. చర్చల వాయిదా విషయాన్ని తొలుత పాక్ విదేశాంగ శాఖ ఇస్లామాబాద్‌లో ప్రకటించగా.. ఆ తర్వాత భారత విదేశాంగ శాఖ ఢిల్లీలో వెల్లడించింది. మళ్లీ చర్చలు నిర్వహించే తేదీని ఖరారు చేసేందుకు సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఇరు దేశాలూ పేర్కొన్నాయి.
పాక్ సిట్‌కు పూర్తి సహకారం
పఠాన్‌కోట్ దాడిపై దర్యాప్తు చేయటం కోసం పాక్ సిట్ పర్యటనకు భారత్ అంగీకరించటంతో పాటు.. దాడికి పాల్పడ్డ వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు సిట్ దర్యాప్తుకు అవసరమైన సాయమంతా అందిస్తామని పేర్కొంది. పఠాన్‌కోట్ దాడితో సంబంధమున్న ఉగ్రవాద శక్తులపై దర్యాప్తులో గణనీయమైన పురోగతి సాధించినట్లు పాక్ ప్రభుత్వం బుధవారం చేసిన జైషే సభ్యుల అరెస్టు ప్రకటన తెలియజేస్తోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వికాశ్‌స్వరూప్ గురువారం మీడియాతో పేర్కొన్నారు. పఠాన్‌కోట్‌పై దర్యాప్తు కోసం సిట్‌ను పంపించాలని పాక్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తాము గుర్తించామని చెప్పారు. ఆ సంస్థ దర్యాప్తుకు భారత దర్యాప్తు సంస్థలు పూర్తిగా సహకరిస్తాయన్నారు.
జైషేపై పాక్ కేసు పెట్టిందా లేదా!
జైషే సభ్యులను అరెస్ట్ చేసినట్లు పాక్ ప్రకటించిన నేపథ్యంలో పఠాన్‌కోట్ దాడికి సంబంధించి ఆ సంస్థపై పాక్ ఏదైనా కేసు నమోదు చేసిందా లేదా అనే అంశంపై తమకు సమాచారం లేదని కేంద్ర హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. అరెస్టుల విషయం ప్రకటించిన పాక్ సర్కారు ఏ చట్టం కింద ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించి, జైషే సభ్యులను అరెస్ట్ చేసిందనేది కూడా వెల్లడించాలని వ్యాఖ్యానించాయి. కాగా.. పఠాన్‌కోట్ ఘటనపై పాక్ తీరుకు నిరసనగా ఢిల్లీలోని పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ కార్యాలయంపై హిందూసేన కార్యకర్తలు దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.