India - Pakistan
-
శత్రుదుర్భేద్యం.. తూర్పు నౌకాదళం
సాక్షి, విశాఖపట్నం : పాకిస్తాన్.. దాయాది దేశం పేరు వింటేనే పౌరుషం పొంగుకొస్తుంది. అలాంటిది.. శత్రు దేశమైన పాకిస్తాన్‌తో యుద్ధం జరిగితే.. అందులో మన త్రివర్ణ పతాకం రెపరెపలాడితే.. ఆ చిరస్మరణీయ విజయానికి మన విశాఖే వేదికైతే.. ఇంకెంత గర్వంగా ఉంటుందో కదూ! ఈ విజయానికి గుర్తుగానే.. అప్పట్నుంచి ఏటా డిసెంబర్ 4న భారత నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈసారి జరిగే ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కాగా, 75 ఏళ్లలో భారత నౌకాదళం.. ప్రపంచంలోనే అతిపెద్ద దళాల్లో ఒకటిగా సమర్థమైన నౌకాదళ శక్తిగా మారగా.. దేశంలోనే ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం ఆవిర్భవించింది. అంతేకాదు.. ఈ నౌకాదళ దినోత్సవం నిర్వహించుకోడానికీ కేంద్ర బిందువు కూడా విశాఖపట్నమే కావడం మరో విశేషం. పెరిగిన నౌకా సంపత్తి.. తీర ప్రాంత రక్షణకు వెన్నెముకగా ఉన్న ఈఎన్సీ (ఈస్ట్ నేవల్ కమాండ్).. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో ఇండియన్ నేవీ.. ఎప్పటికప్పుడు నౌకా సంపత్తిని పెంచుకుంటూ శత్రుదుర్భేద్యంగా మారుతోంది. తూర్పు నౌకాదళం పరిధిలో 40 వరకూ యుద్ధ నౌకలు, సబ్మెరైన్లున్నాయి. ఇక్కడి నౌకల పేర్లన్నీ ఐఎన్‌ఎస్‌తో మొదలవుతాయి. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్. వీటిల్లో విభిన్న తరగతుల యుద్ధ నౌకలున్నాయి. అలాగే, సబ్మెరైన్లు కూడా. ఇదీ నేవీ డే కథ.. భారత్-పాక్ మధ్య 1971 డిసెంబర్ 3 సాయంత్రం మొదలైన యుద్ధం డిసెంబర్ 16న పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. బంగ్లాదేశ్ విమోచన అంశం ఈ యుద్ధకాండకు ప్రధాన కారణం. తూర్పు పాక్ (బంగ్లాదేశ్)కు భారత్ మద్దతు ప్రకటించడంతో.. పాకిస్థాన్ మన దేశంపై దాడులకు పాల్పడింది. కరాచీ ఓడరేవుపై భారత్ చేసిన దాడితో పాక్ నావికాదళం చతికిలపడింది. అంతేకాక.. పాక్ జలాంతర్గామి ఘాజీని విశాఖ తీరం సమీపంలోనే సాగర గర్భంలోనే కుప్పకూల్చారు. దీంతో.. పాక్ నావికాదళం 80 శాతం నష్టపోయింది. అనంతరం.. బంగాళాఖాతంలోని జల ప్రాంతాలన్నింటినీ ఇండియన్ నేవీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. డిసెంబర్ 16న పాకిస్తాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించడంతో.. భారత్ కాల్పుల విరమణ ప్రకటించింది. డిసెంబర్ 16న యుద్ధం ముగిసినా.. డిసెంబర్ 4న కరాచీలోని అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం ధ్వంసం కారణంగానే ఆ రోజును భారత నౌకాదళ దినోత్సవంగా ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. దీనికి గుర్తుగానే విశాఖ సముద్ర తీరాన విక్టరీ ఎట్ సీృ1971 స్థూపాన్నీ నిర్మించారు. నేడే విశాఖలో ‘నేవీ డే’ పాకిస్తాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో భారత్ విజయానికి ప్రతీకగా ఏటా నిర్వహించే నౌకాదళ దినోత్సవం బుధవారం విశాఖలో వైభవంగా జరగనుంది. పాక్ ఓటమిలో తూర్పు నావికాదళం కీలకపాత్ర పోషించడంతో ఏటా ఈ ఉత్సవాన్ని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా నగరంలోని ఆర్కే బీచ్ వద్ద నౌకాదళ సిబ్బంది చేసే విన్యాసాలు అందరినీ అబ్బురపరుస్తాయి. యుద్ధంలో మరణించిన అమరవీరులకు నేవీ డేలో భాగంగా ఉ.7 గంటలకు నావికా దళ అధికారులు విక్టరీ ఎట్ సీ వద్దకు వచ్చి నివాళులర్పిస్తారు. మ.3.30 గంటల నుంచి యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్స్, హెలికాప్టర్లతో నేవీ సిబ్బంది సాహస విన్యాసాలను ప్రదర్శిస్తారు. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్ వార్ మెమోరియల్ సందర్శన అనంతరం నేవీ హౌస్‌లో ఉన్నతాధికారులు, అతిథులకు తేనీటి విందు ఇస్తారు. ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్ నౌకాదళ దినోత్సవానికి ఈసారి ముఖ్య అతి«థిగా సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఆయన మ.3.10గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుని 3.40గంటలకు సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌కు వెళ్తారు. సా.4 గంటలకు ఆర్కే బీచ్‌కు బయల్దేరుతారు. 5.30గంటల వరకు అక్కడ విన్యాసాలను తిలకిస్తారు. అనంతరం నేవీ హౌస్‌లో ‘ఎట్ హోం’ పేరిట నిర్వహించే తేనీటి విందులో సీఎం పాల్గొంటారని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ వెల్లడించారు. -
‘మధ్యవర్తిత్వం చేయడానికి నేను సిద్ధమే’
వాషింగ్టన్: గతంతో పోలిస్తే గడిచిన రెండు వారాలుగా భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం చేయడానికి ఇప్పటికి తాను సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ మరో సారి పేర్కొన్నాడు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కశ్మీర్ అంశంలో భారత్-పాక్ మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో గత నెలలో భారత ప్రభుత్వం కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కశ్మీర్ విభజన అనంతరం నేను ఇరు దేశాల ప్రధానులతో మాట్లాడాను. సంయమనం పాటిస్తూ.. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించాను. గత రెండు వారాల నుంచి ఇరు దేశాల మధ్య పరిస్థితులు కాస్త చల్లబడ్డాయి. భారత్-పాక్ కోరుకుంటే కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం చేయడానికి ఇప్పటికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇక దీని గురించి వారే ఆలోచించుకోవాలి’ అని తెలిపారు. గతంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భేటీతో సందర్భంగా ట్రంప్ ఇరు దేశాల ప్రధానుల అంగీకరిస్తే.. కశ్మీర్ అంశంలో తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. ట్రంప్ వ్యాఖ్యలు మన దేశంలో తీవ్ర దుమారం రేపాయి. భారత్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. కశ్మీర్ మా దేశ అంతర్గత వ్యవహారమని.. మేమే పరిష్కరించుకుంటామని స్పష్టం చేసింది. ఈ పరిణామాల అనంతరం కశ్మీర్ పునర్వ్యస్థీకరణ జరిగిన సంగతి తెలిసిందే. -
పాక్‌తో ఆడమంటారా వద్దా?
న్యూఢిల్లీ : పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడటంపై స్పష్టతనివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరింది. 2012 అనంతరం ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే రెండు దేశాల మధ్య 2014లో కుదిరిన ఒప్పందాన్ని బీసీసీఐ గౌరవించడం లేదని, తమకు 7 కోట్ల డాలర్లు నష్టపరిహారంగా ఇప్పించాలని కోరుతూ పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు (పీసీబీ) ఐసీసీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. బీసీసీఐ మాత్రం భారత ప్రభుత్వం అనుమతిస్తేనే ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగుతాయని చెబుతూ వస్తోంది. బీసీసీఐ ఎఫ్‌టీపీని గౌరవించడం లేదంటూ పీసీబీ ఐసీసీ వివాద పరిష్కార కమిటీని ఆశ్రయించింది. ఈ ఒప్పందం ప్రకారం తటస్థ వేదికలో పాక్‌తో టీమిండియా కనీసం రెండు సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. ముగ్గురు సభ్యుల కమిటీ పాక్ బోర్డు వేసిన పిటిషన్‌పై విచారణ జరపనుంది. ఈ విషయంలో కమిటీ నిర్ణయమే ఫైనల్ అని ఇప్పటికే ఐసీసీ స్పష్టంచేసింది. అక్టోబర్ 1 నుంచి 3 మధ్య దుబాయ్‌లో ఈ విచారణ జరగనుంది. ఈ విచారణలో భాగంగా ఐసీసీ వివాదాల పరిష్కార బోర్డు ఎదుట తమ వాదనలు వినిపించే ముందు దీనిపై ప్రభుత్వ విధానమేంటో తెలుసుకోవాలని బీసీసీఐ భావించింది. ఈ మేరకు కేంద్రానికి మెయిల్ పంపించిందని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు.‘ ఇది బోర్డు తరపున సాధారణంగా జరిగే ప్రక్రియే. ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో ప్రభుత్వ అనుమతి తీసుకోవడం మా బాధ్యత. మా పని అడగటం వరకే. అనుమతి ఇవ్వాలా వద్దా అన్నది ప్రభుత్వం ఇష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో ద్వైపాక్షిక సిరీస్ కష్టమేనని మాకూ తెలుసు. అయితే ఇదే సమాచారం ప్రభుత్వం నుంచి వస్తే మాకు ఉపయోగపడుతుంది’ అని ఆ అధికారి పేర్కొన్నారు. -
చర్చలు వాయిదా
* విదేశాంగ కార్యదర్శుల భేటీపై భారత్-పాక్ ఉమ్మడి నిర్ణయం * గతానికి భిన్నంగా సమన్వయంతో సాగుతున్న దాయాది దేశాలు * జైషే సభ్యుల అరెస్టు కీలక, సానుకూల చర్యగా భారత్ ఆహ్వానం * పాక్ దర్యాప్తు బృందం పఠాన్‌కోట్ సందర్శించేందుకు అంగీకారం న్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్ల మధ్య శుక్రవారం జరగాల్సిన విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలను స్వల్ప కాలం పాటు వాయిదా వేయాలని ఇరు దేశాలూ ఉమ్మడిగా అంగీకరించాయి. చర్చల ప్రక్రియను పఠాన్‌కోట్ ఉగ్రదాడి పట్టాలు తప్పించరాదని సమన్వయంతో ముందుకు కదిలాయి. దాడిపై దర్యాప్తు కోసం పాక్ ప్రత్యేక దర్యాప్తు బృందం పఠాన్‌కోట్‌ను సందర్శించేందుకు భారత్ అనుమతించింది. వట్టి ప్రకటనలు సరిపోవు... భారత్ - పాక్‌లు ద్వైపాక్షిక సంబంధాల విషయంలో గతానికి భిన్నంగా ఇప్పుడు తమ వ్యూహాలపై సమన్వయంతో పనిచేస్తుండటం విశేషం. భారత్‌లో ఉగ్రదాడుల విషయంలో పాక్ శక్తుల పాత్రను గతంలో నిరాకరించిన పాక్.. ఇప్పుడు జైషే నేతలు, సభ్యులను అరెస్ట్ చేసింది. జైషే చీఫ్ మసూద్‌ను అరెస్ట్ చేసినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని తేలినప్పటికీ.. ఆ సంస్థ ఉగ్రవాదులను అరెస్ట్ చేయటం సానుకూలమైన, కీలకమైన చర్యగా భారత్ ఆహ్వానించింది. వట్టి ప్రకటనలు సరిపోవని తాము కోరుకుంటున్నామని ఉద్ఘాటించింది. అలాగే.. భారత్ కూడా ఇరు దేశాల మధ్య చర్చలను రద్దు చేసుకోలేదు. జైషే చీఫ్ అరెస్టుకు, చర్చలకు ముడిపెట్టలేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ పాక్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌధరితో చర్చల నిమిత్తం గురువారం ఇస్లామాబాద్ చేరుకోవాల్సి ఉంది. అయితే.. వారిద్దరూ గురువారం ఫోన్లో మాట్లాడుకుని చర్చలను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయించారు. చర్చల వాయిదా విషయాన్ని తొలుత పాక్ విదేశాంగ శాఖ ఇస్లామాబాద్‌లో ప్రకటించగా.. ఆ తర్వాత భారత విదేశాంగ శాఖ ఢిల్లీలో వెల్లడించింది. మళ్లీ చర్చలు నిర్వహించే తేదీని ఖరారు చేసేందుకు సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఇరు దేశాలూ పేర్కొన్నాయి. పాక్ సిట్‌కు పూర్తి సహకారం పఠాన్‌కోట్ దాడిపై దర్యాప్తు చేయటం కోసం పాక్ సిట్ పర్యటనకు భారత్ అంగీకరించటంతో పాటు.. దాడికి పాల్పడ్డ వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు సిట్ దర్యాప్తుకు అవసరమైన సాయమంతా అందిస్తామని పేర్కొంది. పఠాన్‌కోట్ దాడితో సంబంధమున్న ఉగ్రవాద శక్తులపై దర్యాప్తులో గణనీయమైన పురోగతి సాధించినట్లు పాక్ ప్రభుత్వం బుధవారం చేసిన జైషే సభ్యుల అరెస్టు ప్రకటన తెలియజేస్తోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వికాశ్స్వరూప్ గురువారం మీడియాతో పేర్కొన్నారు. పఠాన్‌కోట్‌పై దర్యాప్తు కోసం సిట్‌ను పంపించాలని పాక్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తాము గుర్తించామని చెప్పారు. ఆ సంస్థ దర్యాప్తుకు భారత దర్యాప్తు సంస్థలు పూర్తిగా సహకరిస్తాయన్నారు. జైషేపై పాక్ కేసు పెట్టిందా లేదా! జైషే సభ్యులను అరెస్ట్ చేసినట్లు పాక్ ప్రకటించిన నేపథ్యంలో పఠాన్‌కోట్ దాడికి సంబంధించి ఆ సంస్థపై పాక్ ఏదైనా కేసు నమోదు చేసిందా లేదా అనే అంశంపై తమకు సమాచారం లేదని కేంద్ర హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. అరెస్టుల విషయం ప్రకటించిన పాక్ సర్కారు ఏ చట్టం కింద ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించి, జైషే సభ్యులను అరెస్ట్ చేసిందనేది కూడా వెల్లడించాలని వ్యాఖ్యానించాయి. కాగా.. పఠాన్‌కోట్ ఘటనపై పాక్ తీరుకు నిరసనగా ఢిల్లీలోని పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ కార్యాలయంపై హిందూసేన కార్యకర్తలు దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. -
భారత్, పాక్ సరిహద్దు సమావేశం
-
‘కశ్మీర్’ లేనిదే చర్చల్లేవ్
ఎన్ఎస్ఏ స్థాయి చర్చలు రద్దుచేసుకున్న పాకిస్తాన్ కశ్మీర్ అంశమే అత్యంత కీలకం.. అది లేకుండా చర్చలు జరిపి నిష్ర్పయోజనం హురియత్ నేతలను పాక్ ఎన్ఎస్ఏ కలవరాదనటం సరికాదని అభ్యంతరం భారత్ విధించిన రెండు షరతుల ప్రాతిపదికన చర్చలు అసాధ్యం: పాక్ ప్రకటన షరతులేం విధించలేదు.. సిమ్లా, ఉఫా ఒప్పందాలను పాటించాలన్నాం: భారత్ ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్ఎస్ఏ) చర్చలు జరుగుతాయా? లేదా? అన్న ఉత్కంఠకు శనివారం నాటకీయ పరిణామాల నడుమ పాక్ తెరదించింది. సోమవారం జరగాల్సిన ఈ చర్చలను పాక్ రద్దు చేసుకుంది. పాక్ ఎన్ఎస్ఏ ఢిల్లీలో కశ్మీర్ వేర్పాటువాదులను కలవరాదని, చర్చల్లో ఉగ్రవాదం మినహా మరే అంశాన్నీ లేవనెత్తరాదని భారత్ స్పష్టంచేసిన అనంతరం.. ఆ దేశం తన నిర్ణయాన్ని ప్రకటించింది. కశ్మీర్ అంశం లేనిదే చర్చలకు అర్థం లేదని.. భారత్ పేర్కొన్న ‘మందస్తు షరతుల’ ప్రాతిపదికన ఈ చర్చలు సాధ్యం కాదని పేర్కొంది. చర్చలను పాక్ రద్దు చేసుకోవటం దురదృష్టకరమని భారత్ అభివర్ణించింది. ఆ దేశం పేర్కొన్నట్లు తాను ఎటువంటి ముందస్తు షరతులూ పెట్టలేదని స్పష్టంచేసింది. ఇప్పటికే పాక్ అంగీకరించిన సిమ్లా, ఉఫా ఒప్పందాల స్ఫూర్తిని గౌరవించాలని మాత్రమే తాము ఉద్ఘాటించామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వికాశ్స్వరూప్ ట్విటర్లో వ్యాఖ్యానించారు. తొలుత శనివారం ఉదయం పాక్ ఎన్ఎస్ఏ సర్తాజ్‌అజీజ్ ఇస్లామాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఎటువంటి ముందస్తు షరతులూ పెట్టకపోతే భారత్‌తో నిర్ణయించిన తేదీన ఎన్ఎస్ఏ స్థాయి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కీలకమైన కశ్మీర్ అంశంపై చర్చ లేనిదే.. భారత్‌తో ఎలాంటి గంభీరమైన మంతనాలూ సాధ్యం కాదన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ నాయకులను కలవరాదన్న సాకుతో భారత్ ఈ చర్చలను రద్దుచేస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొన్ని గంటలకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. హురియత్ నేతలతో భేటీ కాబోమని, చర్చల్లో కశ్మీర్ అంశం ప్రస్తావించబోమని పాక్ హామీ ఇస్తేనే చర్చలకు రావాలని స్పష్టంచేశారు. అనంతరం శనివారం రాత్రి పొద్దుపోయాక.. చర్చలు సాధ్యం కాదని పాక్ ప్రకటించింది. సుష్మా పేర్కొన్న అంశాలను తాము జాగ్రత్తగా విశ్లేషించామని.. మంత్రి విధించిన రెండు షరతుల ప్రాతిపదికమీద నిర్వహించేట్లయితే ప్రతిపాదిత ఎన్ఎస్ఏ చర్చలకు ఏ ప్రయోజనమూ ఉండదన్న నిర్ధారణకు వచ్చామని ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్ఎస్ఏ స్థాయి చర్చల ఉద్దేశం కేవలం ఉగ్రవాదం అంశం మాత్రమే అయితే.. అది శాంతియుత పరిస్థితులను మెరుగుపరచకపోగా.. పరస్పర ఆరోపణల వాతావరణాన్ని మరింతగా దిగజార్చుతుందని అభిప్రాయపడింది. అందుకే.. ఉగ్రవాద సంబంధిత అంశాలతో పాటు.. కశ్మీర్, సియాచిన్, సర్ క్రీక్ సహా అన్ని అంశాలపై చర్చలకు విధివిధానాలపైనా సంప్రదింపులు జరపాలని తాము సూచించామని పేర్కొంది. హురియత్ నేతలను కలవరాదని భారత్ పేర్కొనటాన్ని ప్రస్తావిస్తూ.. గత ఇరవై ఏళ్లుగా పాక్ నేతలు ఎప్పుడు భారత్‌కు వచ్చినా వారు హురియత్ నేతలను కలవటం జరుగుతోందని చెప్పింది. దానిని మార్చుతూ ఇప్పుడు భారత్ షరతు విధించటం సరికాదని పేర్కొంది. కాబట్టి ఈ చర్చలు జరగటం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. కశ్మీర్ లేనిదే చర్చలు సాధ్యం కాదు పాక్ ఎన్ఎస్ఏ అజీజ్ ఆదివారం ఢిల్లీ రావాల్సి ఉన్న సర్తాజ్ అజీజ్ శనివారం ఇస్లామాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ‘భారత్‌తో అన్ని అంశాలనూ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ ఆకాంక్షిస్తోంది. కానీ.. మూలమైన కశ్మీర్ అంశంపై చర్చ లేనిదే.. భారత్‌తో ఎలాంటి గంభీరమైన మంతనాలూ సాధ్యం కాదు. సోమవారం నాటి చర్చల కోసం - ఉగ్రవాదం, ఉఫాలో తీసుకున్న నిర్ణయంలో ప్రగతి, కశ్మీర్ సహా ఇతర అంశాలన్నిటితో పాక్ 3 సూత్రాల అజెండాను సిద్ధం చేసింది’ అని పేర్కొన్నారు. ► ఉఫాలో అంగీకరించిన అజెండాను పాక్ వక్రీకరిస్తోందన్న భారత ఆరోపణలో వాస్తవం లేదన్నారు. ‘‘చర్చలకు కొత్త షరతులు విధిస్తోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ చేసిన ప్రకటన.. ఎటువంటి ముందస్తు షరతులూ లేకుండా ఎన్ఎస్ఏ స్థాయి చర్చలకు పాక్ సిద్ధమని భారత దౌత్యకార్యాలయానికి అందించిన నోట్లోని చివరి వాక్యాన్ని పూర్తిగా విస్మరించింది. నిజానికి పాక్ దౌత్యాధికారి ఆదివారం ఇవ్వనున్న ఆహ్వాన విందుకు హాజరయ్యే అతిథుల జాబితాను నిర్ణయించే హక్కును తీసుకోవటం ద్వారా.. హురియత్ నేతలను పాక్ కలవరాదని కొత్త షరతులు విధించింది భారతే’’ అని సర్తాజ్ విమర్శించారు. ►తమ దేశంలో లేడని పాక్ నిరాకరిస్తున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాక్‌లోనే ఉన్నాడని పేర్కొంటూ భారత ఎన్ఎస్ఏ అజిత్‌దోవల్ ఒక డోసియర్‌ను సర్తాజ్కు ఇవ్వనున్నారంటూ భారత మీడియాలో వచ్చిన వార్తల గురించి ప్రస్తావించగా.. ‘‘ఎన్ఎస్ఏ చర్చల సందర్భంగా దోవల్ ఇవ్వనున్న డోసియర్ విషయంలో పాక్ ఆందోళనగా ఉందని.. కాబట్టి చర్చల నుంచి వైదొలగటానికి ప్రయత్నిస్తోందని భారత మీడియాలో ఒక ముఖ్య కథనం ప్రచారమవుతోంది. భారత్‌కు చెందిన రా పాక్‌లో కార్యకలాపాలపై నేను మూడు డోసియర్లు తీసుకెళ్లనున్నాను. ఢిల్లీలో భారత ఎన్ఎస్ఏకు వీటిని అందించటానికి నాకు అవకాశం లభించకపోతే.. వచ్చే నెలలో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హజరయేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు ఆయన వస్తే.. అక్కడ అందిస్తాను. ఆ తర్వాత వీటిని సమితి సెక్రటరీ జనరల్‌కూ అందిస్తాను’’ అంటూ పలు పత్రాలు చూపించారు. ► ఈ చర్చల్లో ఎలాంటి ఫలితమైనా వస్తుందని తాను ఆశించటం లేదన్నారు. కానీ.. ఉద్రిక్తతను తగ్గించటం, భవిష్యత్ చర్చలకు దిశానిర్దేశం చేయటం కనీస అజెండాగా ఉందన్నారు. ఎన్ఎస్ఏ స్థాయి చర్చలను భారత్ దాదాపుగా రద్దు చేసిందంటూ.. దీనిపట్ల తాను అసంతృప్తికి గురయ్యానని పేర్కొన్నారు. ఒకవేళ రద్దుచేస్తున్నట్లయితే చర్చలు జరుపుతామని ఇచ్చిన హామీ నుంచి భారత్ వెనుదిరగటం ఇది రెండోసారి అవుతుందన్నారు. ‘‘గత ఏడాది విదేశీ కార్యదర్శుల స్థాయి సమావేశాన్ని.. ఢిల్లీలో పాక్ దౌత్యాధికారి హురియత్ నేతలను కలిసినందుకు నిరసనగా భారత్ రద్దు చేసింది. ఇప్పుడు ఈ రెండో సమావేశాన్ని కూడా రద్దు చేసినట్లయితే దానికీ అదే కారణమవుతుంది. ఆదివారం ఢిల్లీలో నిర్వహించనన్ను రిసెప్షన్‌కు కశ్మీరీ నేతలను ఆహ్వానించటం.. వివిధ భారత రాజకీయ, వాణిజ్య ప్రముఖులను కలిసేందుకు ఏర్పాటు చేసిన సమావేశం’’ అని పేర్కొన్నారు. ►ఉఫా సమావేశానికి వ్యతిరేకంగా భారత్ వ్యవహరిస్తోందని.. పైగా ఉఫాలో అంగీకరించిన అజెండాను పాక్ వక్రీకరిస్తోందని ఆరోపిస్తోందని.. చర్చలకు కొత్త షరతులు విధిస్తోందని ఆయన విమర్శించా రు. ‘అత్యంత ముఖ్యమైన విషయమేమిటో అందరికీ తెలుసు.. అది కశ్మీర్’ అని అన్నారు. కశ్మీర్‌ను పక్కనపెట్టి పాక్‌తో తన నిబంధనల మేరకు వ్యవహరించాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందని.. ఇది పాక్‌కు ఆమోదనీయం కాదని వ్యాఖ్యానించారు. హురియత్ నేతలను అరెస్టు చేయటం తమను చాలా బాధకు గురిచేసిందంటూ.. ఆ అరెస్టులు వారి ప్రాధమిక హక్కులను ఉల్లంఘించటమేనన్నారు. ►భారత్ మీడియా ద్వారా దౌత్యం నడుపుతోందని.. పాక్ సైన్యం చర్చలకు అనుకూలంగా లేదన్న అభిప్రాయాన్ని కలిగిస్తోందని విమర్శించారు. శాంతి పరిరక్షణలో, అభివృద్ధిని ప్రోత్సహించటంలో ఉమ్మడి బాధ్యత ఉందని, అన్ని అంశాలపైనా చర్చకు ఇరు దేశాలూ సిద్ధంగా ఉన్నాయనేది ఉఫా ప్రకటనలో ముఖ్యమైన భాగమని.. అందులో కశ్మీర్ అనేది తప్పనిసరిగా ఒక అంశమన్నారు. ఆ రెండు అంశాలపై హామీ ఇవ్వాలి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ న్యూఢిల్లీ: భారత్ - పాక్ ఎన్ఎస్ఏ స్థాయి చర్చల్లో కశ్మీర్ అంశంపైనా చర్చించాలని, వేర్పాటువాదులకూ ఆ చర్చలకు చోటివ్వాలని పాకిస్తాన్ పట్టుపట్టేట్లయితే ఆ చర్చలు జరగవని భారత్ స్పష్టంచేసింది. ఈ రెండు అంశాలపైనా పాక్ శనివారం రాత్రిలోగా విస్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందుకు పాక్ అంగీకరించకపోతే ‘‘చర్చలు జరగవు’’ అని తేల్చిచెప్పింది. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సోమవారం జరగాల్సి ఉన్న ఎన్ఎస్ఏల చర్చలకు తాను ఎలాంటి ముందస్తు షరతులూ విధించటం లేదని పేర్కొన్నారు. సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలూ ఒప్పుకున్న సిమ్లా ఒప్పందం స్ఫూర్తిని, ఎన్ఎస్ఏలు కేవలం ఉగ్రవాదం అంశంపై చర్చించేందుకు మాత్రమే సమావేశమవుతారని ఇటీవల ఉఫాలో ఇరు దేశాల ప్రధానమంత్రులు వచ్చిన అంగీకారాన్ని మాత్రమే తాను ప్రస్తావిస్తున్నానని పదేపదే ఉద్ఘాటించారు. ►పాక్‌లోని బాగా తెలిసిన శక్తులు చర్చలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ.. భారత రాజకీయ నాయకత్వం ఒత్తిడిని తట్టుకోగలిగినప్పటికీ.. పాక్ నాయకత్వం ఆ శక్తుల ఒత్తిడిని తట్టుకోలేదని వ్యాఖ్యానించారు. ‘‘చర్చల నుంచి పారిపోతున్నది పాకిస్తానే. భారత్ కాదు. హురియత్ నేతలను దూరంగా పెట్టి.. ఉగ్రవాదం మినహా మరే అంశాలూ లేవనెత్తకపోతే.. ఆయనను చర్చలకు ఆహ్వానిస్తాం. ఉగ్రవాదంపై చర్చ ముందు.. కశ్మీర్‌పై తర్వాత చర్చించవచ్చు’’ అని పేర్కొన్నారు. ►‘‘ఇరు పక్షాలూ మూడు సమావేశాలు నిర్వహించాలని ఉఫాలో ఇరువురు ప్రధానమంత్రులు నిర్ణయించారు. ఉగ్రవాదంపై ఎన్ఎస్ఏలు, శాంతి పరిరక్షణపై సరిహద్దు బలగాలు, కాల్పుల విరమణ ఉల్లంఘనలపై డెరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ చర్చించాలని అంగీకారానికి వచ్చారు. కానీ.. షరీఫ్ పాక్‌లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఈ సమావేశాలపై ముందుకు వెళ్లకుండా ఉండేందుకు భూమిక సిద్ధం చేశారు. మాపైనా తక్కువ ఒత్తిడి లేదు. గురుదాస్‌పూర్, ఉధంపూర్లలో రెండు ఉగ్రవాద దాడులతో పాటు 91 కాల్పుల విరమణ ఉల్లంఘనలు ఉన్నాయి. కానీ, ఈ చర్చలు ఉగ్రవాదంపై ఉన్నందున ముందుకు వెళ్లాలనే మేం నిర్ణయించాం. ఎన్ఎస్ఏ చర్చలకు భారత్ ప్రతిపాదించిన తేదీల విషయంలోనూ వారి స్పందనలో చాలా జాప్యంచేశారు. చర్చల కోసం తేదీని ప్రతిపాదిస్తూ మేం జూలై 23న లేఖ పంపించాం. వారి జవాబు 22 రోజుల తర్వాత ఆగస్టు 14వ తేదీన వచ్చింది. సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని సరిహద్దు బలగాల సమావేశం కోసం కూడా పాక్ సెప్టెంబర్ 6ను సూచించింది. ఎన్ఎస్ఏ చర్చలు జరగరాదన్నది మనసులో పెట్టుకునే ఆ తేదీని ప్రతిపాదించింది.’ ►మిత్రత్వం కోసం ఒక చర్య తీసుకున్నపుడు అది నెరవేరకపోతే అసంతృప్తికి లోనవటం మామూలేనని సుష్మా చెప్పారు. ఒకవేళ చర్చలు జరగకపోయినా కూడా అది ఇరు దేశాల సంబంధాలకు ముగింపు కాబోదన్నారు. భారత్ - పాక్ సంబంధాలు గతుకుల మయంగా ఉన్న రహదారి వంటిది. ఎదురుదెబ్బలు ఉంటాయి. పంక్చర్లు అవుతాయి. అయినా మళ్లీ రోడ్డెక్కుతాం. దౌత్యంలో ఎన్నడూ ఫుల్స్టాప్ ఉండదు. సమగ్ర చర్చల్లో కానీ పునరుద్ధరించిన చర్చల్లో కానీ ఎన్ఎస్ఏ చర్చలు భాగం కాదు. ► {పస్తుత వాతావరణంలో చర్చలు అర్థరహితమన్న సర్తార్ అజీజ్ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ఈ చర్చలు పూర్తి ఫలితాలు ఇస్తాయని భారత్ ఎన్నడూ చెప్పలేదని.. కానీ చర్చల నుంచి ఎల్లప్పుడూ కొంత ఫలితం వస్తుందని.. ఆ ఆశతోనే చర్చలు నిర్వహించటం జరుగుతుందని సుష్మా స్పందించారు. వారు చర్చల కోసం ఢిల్లీ రాకూడదని ఒక నిర్ణయానికి వచ్చినందునే అజీజ్ అలా చెప్తున్నారని విశ్లేషించారు. ►పాక్‌లో ఉగ్రవాద ఘటనల్లో భారత్‌కు చెందిన రా (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) పాత్రపై ఆరోపణలు చేస్తూ ‘డోసియర్’ అంటూ అజీజ్ పలు పత్రాలను ప్రదర్శించటం గురించి ప్రశ్నించగా.. ‘‘వారి (పాక్) ఉగ్రవాద కార్యకలాపాల గురించి కేవలం డోసియర్లు ఇవ్వటమే కాదు.. సజీవంగా ఉన్న ఉగ్రవాదిని భారత్ చూపుతుంది’’ అని ఆమె తిప్పికొట్టారు. ఉదంపూర్‌లో ఉగ్రదాడి సందర్భంగా పోలీసులకు చిక్కిన నవేద్యాకూబ్ విషయాన్ని ఆమె పరోక్షంగా ప్రస్తావించారు. కీలకమైన కశ్మీర్ అంశంపై చర్చ లేనిదే.. భారత్‌తో ఎలాంటి గంభీరమైన మంతనాలూ సాధ్యం కాదు. సోమవారం నాటి చర్చల కోసం - ఉగ్రవాదం, ఉఫాలో తీసుకున్న నిర్ణయంలో ప్రగతి, కశ్మీర్ సహా ఇతర అంశాలన్నిటితో పాక్ మూడు సూత్రాల అజెండాను సిద్ధం చేసింది. - పాక్ ఎన్ఎస్ఏ సర్తాజ్ అజీజ్ చర్చల నుంచి పారిపోతున్నది పాకిస్తానే. భారత్ కాదు. హురియత్ నేతలను దూరంగా పెట్టి.. ఉగ్రవాదం మినహా మరే అంశాలూ లేవనెత్తకపోతే.. ఆయనను చర్చలకు ఆహ్వానిస్తాం. ఉగ్రవాదంపై చర్చ ముందు.. కశ్మీర్‌పై తర్వాత చర్చించవచ్చు - భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ -
పాక్‌తో సిరీస్‌కు సోనోవాల్ మద్దతు
కోల్‌కతా : భారత్, పాకిస్తాన్ క్రికెట్ సిరీస్‌కు కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ మద్దతు పలికారు. ఇరు దేశాల మధ్య క్రీడలు స్నేహ సంబంధాలను పెంపొందిస్తాయని అన్నారు. ‘ఓ క్రీడా మంత్రిగా నా ప్రధాన ఉద్దేశం క్రీడల అభివృద్ధికి తోడ్పటమే. పాక్‌తో సంబంధాలు మరింత మెరుగుపరుచుకునేందుకు ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్ జరిగితేనే బావుంటుంది. అయితే పరిష్కారం కావాల్సిన సమస్యలు కూడా ఉన్నాయి’ అని మంత్రి అన్నారు. -
రొమాన్స్‌కు నా భార్య ఓకే
రొమాన్స్‌కు నా భార్య ఓకే అంటున్నారు సంగీత దర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని. మీరేదో ఊహించుకోకండి. తెరపై హీరోయిన్‌తో రొమాన్స్‌కు తన భార్య ఎలాంటి ఆంక్షలూ విధించలేదని విజయ్ ఆంటోని వ్యాఖ్యానించారు. సంగీత దర్శకుడుగా ఉన్నత స్థాయికి చేరుకున్న ఈయన ఇప్పుడు హీరోగానూ తనకంటూ గుర్తింపు పొందారు. తొలి చిత్రం నాన్, మలి చిత్రం సలీం విజయం సాధించడంతో మూడో ప్రయత్నంగా చేస్తున్న చిత్రం ఇండియా - పాకిస్తాన్. ఈ చిత్రాన్ని తన విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. నూతన నటి సుష్మా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో పశుపతి, ఎంఎస్.భాస్కర్, జగన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యువ దర్శకుడు ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దీనా సంగీతం అందించారు. చిత్రం మే ఎనిమిదో తేదీన తెరపైకి రానుంది. సలీం చిత్రాన్ని విడుదల చేసిన శ్రీ గ్రీన్ ప్రొడెక్షన్ సంస్థ అధినేత ఏఎస్ శరవణన్ ఈ చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నారు. ఇండియా - పాకిస్తాన్లో ఏది విజయం సాధిస్తుందన్న ప్రశ్నకు ప్రేమే జయిస్తుందన్న సందేశం ఇస్తున్నట్లు విజయ్ ఆంటోని చెప్పారు. ఇది కుటుంబ సమేతంగా చూసి ఆనందించే రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలిపారు. -
పాక్ కాల్పులు నిరసిస్తూ ఏబీవీపీ మానవహారం
చిత్రదుర్గం : భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైనికులు తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడటాన్ని నిరసిస్తూ శనివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ చేశారు. నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చారు. అక్కడ మానవహారం నిర్మించి సుమారు పావుగంట సేపు రాస్తారోకో చేసి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళనకు నాయకత్వం వహించిన ఏబీవీపీ రాష్ట్ర సహ కార్యదర్శి పవన్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడుతూ పాకిస్థాన్ సైనికులు, తీవ్రవాదులు భారత్‌లోకి చొరబడుతున్నారని, దీనిని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వెంటనే పాకిస్థాన్ కాల్పులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ కాల్పులకు కేంద్ర ప్రభుత్వం, బీఎస్ఎఫ్ బలగాలు కూడా తగిన సమాధానమిచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా సహ సంచాలకుడు యువరాజ్, నగర ఉపాధ్యక్షుడు బీ.ప్రసాద్, జిల్లా విద్యార్థిని ప్రముఖ్ జయశ్రీ, విద్యార్థులు అక్షయ్, ధరణి, విష్ణు, చంద్రశేఖర్, చం దన, అంబిక, సౌందర్య పాల్గొన్నారు. బళ్లారి అర్బన్ : జమ్ముకాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో భారత పౌరులకు, భద్రతా దళాలకు తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శనివారం స్థానిక మున్సిపల్ కళాశాల నుంచి రాయల్ సర్కిల్ మీదుగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ జిల్లా కార్యాలయానికి చేరుకుని జిల్లా అధికారికి వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ నగర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ దేశ సరిహద్దులో కేంద్ర ప్రభుత్వం మెతక వైఖరి అవలంభించకుండా పాకిస్థాన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా సంచాలకుడు మహిపాల్‌రెడ్డి, రవిగౌడ, తాలూకా సంచాలకుడు గోవిందరెడ్డి, కేదార్‌రెడ్డి, అరుణ పాటిల్, మారుతి, రమేశ్, మంజునాథ్, ఉదయ్ పాల్గొన్నారు.