వాషింగ్టన్: గతంతో పోలిస్తే గడిచిన రెండు వారాలుగా భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం చేయడానికి ఇప్పటికి తాను సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ మరో సారి పేర్కొన్నాడు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కశ్మీర్ అంశంలో భారత్-పాక్ మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో గత నెలలో భారత ప్రభుత్వం కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కశ్మీర్ విభజన అనంతరం నేను ఇరు దేశాల ప్రధానులతో మాట్లాడాను. సంయమనం పాటిస్తూ.. చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించాను. గత రెండు వారాల నుంచి ఇరు దేశాల మధ్య పరిస్థితులు కాస్త చల్లబడ్డాయి. భారత్-పాక్ కోరుకుంటే కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం చేయడానికి ఇప్పటికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇక దీని గురించి వారే ఆలోచించుకోవాలి’ అని తెలిపారు.
గతంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భేటీతో సందర్భంగా ట్రంప్ ఇరు దేశాల ప్రధానుల అంగీకరిస్తే.. కశ్మీర్ అంశంలో తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. ట్రంప్ వ్యాఖ్యలు మన దేశంలో తీవ్ర దుమారం రేపాయి. భారత్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. కశ్మీర్ మా దేశ అంతర్గత వ్యవహారమని.. మేమే పరిష్కరించుకుంటామని స్పష్టం చేసింది. ఈ పరిణామాల అనంతరం కశ్మీర్ పునర్వ్యస్థీకరణ జరిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment