‘కశ్మీర్’ లేనిదే చర్చల్లేవ్ | Pakistan calls off NSA-level talks, says conditions set by India unacceptable | Sakshi
Sakshi News home page

‘కశ్మీర్’ లేనిదే చర్చల్లేవ్

Published Sun, Aug 23 2015 2:34 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

‘కశ్మీర్’ లేనిదే చర్చల్లేవ్

‘కశ్మీర్’ లేనిదే చర్చల్లేవ్

ఎన్‌ఎస్‌ఏ స్థాయి చర్చలు రద్దుచేసుకున్న పాకిస్తాన్
కశ్మీర్ అంశమే అత్యంత కీలకం.. అది లేకుండా చర్చలు జరిపి నిష్ర్పయోజనం
హురియత్ నేతలను పాక్ ఎన్‌ఎస్‌ఏ కలవరాదనటం సరికాదని అభ్యంతరం
భారత్ విధించిన రెండు షరతుల ప్రాతిపదికన చర్చలు అసాధ్యం: పాక్ ప్రకటన
షరతులేం విధించలేదు.. సిమ్లా, ఉఫా ఒప్పందాలను పాటించాలన్నాం: భారత్

 
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ:  భారత్ - పాకిస్తాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్‌ఎస్‌ఏ) చర్చలు జరుగుతాయా? లేదా? అన్న ఉత్కంఠకు శనివారం నాటకీయ పరిణామాల నడుమ పాక్ తెరదించింది. సోమవారం జరగాల్సిన ఈ చర్చలను పాక్ రద్దు చేసుకుంది. పాక్ ఎన్‌ఎస్‌ఏ ఢిల్లీలో కశ్మీర్ వేర్పాటువాదులను కలవరాదని, చర్చల్లో ఉగ్రవాదం మినహా మరే అంశాన్నీ లేవనెత్తరాదని భారత్ స్పష్టంచేసిన అనంతరం.. ఆ దేశం తన నిర్ణయాన్ని ప్రకటించింది. కశ్మీర్ అంశం లేనిదే చర్చలకు అర్థం లేదని.. భారత్ పేర్కొన్న ‘మందస్తు షరతుల’ ప్రాతిపదికన ఈ చర్చలు సాధ్యం కాదని పేర్కొంది. చర్చలను పాక్ రద్దు చేసుకోవటం దురదృష్టకరమని భారత్ అభివర్ణించింది. ఆ దేశం పేర్కొన్నట్లు తాను ఎటువంటి ముందస్తు షరతులూ పెట్టలేదని స్పష్టంచేసింది. ఇప్పటికే పాక్ అంగీకరించిన సిమ్లా, ఉఫా ఒప్పందాల స్ఫూర్తిని గౌరవించాలని మాత్రమే తాము ఉద్ఘాటించామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వికాశ్‌స్వరూప్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

తొలుత శనివారం ఉదయం పాక్ ఎన్‌ఎస్‌ఏ సర్తాజ్‌అజీజ్ ఇస్లామాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఎటువంటి ముందస్తు షరతులూ పెట్టకపోతే భారత్‌తో నిర్ణయించిన తేదీన ఎన్‌ఎస్‌ఏ స్థాయి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కీలకమైన కశ్మీర్ అంశంపై చర్చ లేనిదే.. భారత్‌తో ఎలాంటి గంభీరమైన మంతనాలూ సాధ్యం కాదన్నారు. హురియత్ కాన్ఫరెన్స్ నాయకులను కలవరాదన్న సాకుతో భారత్ ఈ చర్చలను రద్దుచేస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొన్ని గంటలకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. హురియత్ నేతలతో భేటీ కాబోమని, చర్చల్లో కశ్మీర్ అంశం ప్రస్తావించబోమని పాక్ హామీ ఇస్తేనే చర్చలకు రావాలని స్పష్టంచేశారు. అనంతరం శనివారం రాత్రి పొద్దుపోయాక.. చర్చలు సాధ్యం కాదని పాక్ ప్రకటించింది. సుష్మా పేర్కొన్న అంశాలను తాము జాగ్రత్తగా విశ్లేషించామని.. మంత్రి విధించిన రెండు షరతుల ప్రాతిపదికమీద నిర్వహించేట్లయితే ప్రతిపాదిత ఎన్‌ఎస్‌ఏ చర్చలకు ఏ ప్రయోజనమూ ఉండదన్న నిర్ధారణకు వచ్చామని ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్‌ఎస్‌ఏ స్థాయి చర్చల ఉద్దేశం కేవలం ఉగ్రవాదం అంశం మాత్రమే అయితే.. అది శాంతియుత పరిస్థితులను మెరుగుపరచకపోగా.. పరస్పర ఆరోపణల వాతావరణాన్ని మరింతగా దిగజార్చుతుందని అభిప్రాయపడింది. అందుకే.. ఉగ్రవాద సంబంధిత అంశాలతో పాటు.. కశ్మీర్, సియాచిన్, సర్ క్రీక్ సహా అన్ని అంశాలపై చర్చలకు విధివిధానాలపైనా సంప్రదింపులు జరపాలని తాము సూచించామని పేర్కొంది. హురియత్ నేతలను కలవరాదని భారత్ పేర్కొనటాన్ని ప్రస్తావిస్తూ.. గత ఇరవై ఏళ్లుగా పాక్ నేతలు ఎప్పుడు భారత్‌కు వచ్చినా వారు హురియత్ నేతలను కలవటం జరుగుతోందని చెప్పింది. దానిని మార్చుతూ ఇప్పుడు భారత్ షరతు విధించటం సరికాదని పేర్కొంది. కాబట్టి ఈ చర్చలు జరగటం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.
 
కశ్మీర్ లేనిదే చర్చలు సాధ్యం కాదు
పాక్ ఎన్‌ఎస్‌ఏ అజీజ్
ఆదివారం ఢిల్లీ రావాల్సి ఉన్న సర్తాజ్ అజీజ్ శనివారం ఇస్లామాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ‘భారత్‌తో అన్ని అంశాలనూ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పాక్ ఆకాంక్షిస్తోంది. కానీ.. మూలమైన కశ్మీర్ అంశంపై చర్చ లేనిదే.. భారత్‌తో ఎలాంటి గంభీరమైన మంతనాలూ సాధ్యం కాదు. సోమవారం నాటి చర్చల కోసం - ఉగ్రవాదం, ఉఫాలో తీసుకున్న నిర్ణయంలో ప్రగతి, కశ్మీర్ సహా ఇతర అంశాలన్నిటితో పాక్ 3 సూత్రాల అజెండాను సిద్ధం చేసింది’ అని పేర్కొన్నారు.

► ఉఫాలో అంగీకరించిన అజెండాను పాక్ వక్రీకరిస్తోందన్న భారత ఆరోపణలో వాస్తవం లేదన్నారు. ‘‘చర్చలకు కొత్త షరతులు విధిస్తోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ చేసిన ప్రకటన.. ఎటువంటి ముందస్తు షరతులూ లేకుండా ఎన్‌ఎస్‌ఏ స్థాయి చర్చలకు పాక్ సిద్ధమని భారత దౌత్యకార్యాలయానికి అందించిన నోట్‌లోని చివరి వాక్యాన్ని పూర్తిగా విస్మరించింది. నిజానికి పాక్ దౌత్యాధికారి ఆదివారం ఇవ్వనున్న ఆహ్వాన విందుకు హాజరయ్యే అతిథుల జాబితాను నిర్ణయించే హక్కును తీసుకోవటం ద్వారా.. హురియత్ నేతలను పాక్ కలవరాదని కొత్త షరతులు విధించింది భారతే’’ అని సర్తాజ్ విమర్శించారు.  

►తమ దేశంలో లేడని పాక్ నిరాకరిస్తున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాక్‌లోనే ఉన్నాడని పేర్కొంటూ భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్‌దోవల్ ఒక డోసియర్‌ను సర్తాజ్‌కు ఇవ్వనున్నారంటూ భారత మీడియాలో వచ్చిన వార్తల గురించి ప్రస్తావించగా.. ‘‘ఎన్‌ఎస్‌ఏ చర్చల సందర్భంగా దోవల్ ఇవ్వనున్న డోసియర్ విషయంలో పాక్ ఆందోళనగా ఉందని.. కాబట్టి చర్చల నుంచి వైదొలగటానికి ప్రయత్నిస్తోందని భారత మీడియాలో ఒక ముఖ్య కథనం ప్రచారమవుతోంది. భారత్‌కు చెందిన రా పాక్‌లో కార్యకలాపాలపై నేను మూడు డోసియర్లు తీసుకెళ్లనున్నాను. ఢిల్లీలో భారత ఎన్‌ఎస్‌ఏకు వీటిని అందించటానికి నాకు అవకాశం లభించకపోతే.. వచ్చే నెలలో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హజరయేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు ఆయన వస్తే.. అక్కడ అందిస్తాను. ఆ తర్వాత వీటిని సమితి సెక్రటరీ జనరల్‌కూ అందిస్తాను’’ అంటూ పలు పత్రాలు చూపించారు.

► ఈ చర్చల్లో ఎలాంటి ఫలితమైనా వస్తుందని తాను ఆశించటం లేదన్నారు. కానీ.. ఉద్రిక్తతను తగ్గించటం, భవిష్యత్ చర్చలకు దిశానిర్దేశం చేయటం కనీస అజెండాగా ఉందన్నారు. ఎన్‌ఎస్‌ఏ స్థాయి చర్చలను భారత్ దాదాపుగా రద్దు చేసిందంటూ.. దీనిపట్ల తాను అసంతృప్తికి గురయ్యానని పేర్కొన్నారు. ఒకవేళ రద్దుచేస్తున్నట్లయితే చర్చలు జరుపుతామని ఇచ్చిన హామీ నుంచి భారత్ వెనుదిరగటం ఇది రెండోసారి అవుతుందన్నారు. ‘‘గత ఏడాది విదేశీ కార్యదర్శుల స్థాయి సమావేశాన్ని.. ఢిల్లీలో పాక్ దౌత్యాధికారి హురియత్  నేతలను కలిసినందుకు నిరసనగా భారత్ రద్దు చేసింది. ఇప్పుడు ఈ రెండో సమావేశాన్ని కూడా రద్దు చేసినట్లయితే దానికీ అదే కారణమవుతుంది. ఆదివారం ఢిల్లీలో నిర్వహించనన్ను రిసెప్షన్‌కు కశ్మీరీ నేతలను ఆహ్వానించటం.. వివిధ భారత రాజకీయ, వాణిజ్య ప్రముఖులను కలిసేందుకు ఏర్పాటు చేసిన సమావేశం’’ అని పేర్కొన్నారు.  

►ఉఫా సమావేశానికి వ్యతిరేకంగా భారత్ వ్యవహరిస్తోందని.. పైగా ఉఫాలో అంగీకరించిన అజెండాను పాక్ వక్రీకరిస్తోందని ఆరోపిస్తోందని.. చర్చలకు కొత్త షరతులు విధిస్తోందని ఆయన విమర్శించా రు. ‘అత్యంత ముఖ్యమైన విషయమేమిటో అందరికీ తెలుసు.. అది కశ్మీర్’ అని అన్నారు. కశ్మీర్‌ను పక్కనపెట్టి పాక్‌తో తన నిబంధనల మేరకు వ్యవహరించాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందని.. ఇది పాక్‌కు ఆమోదనీయం కాదని వ్యాఖ్యానించారు. హురియత్ నేతలను అరెస్టు చేయటం తమను చాలా బాధకు గురిచేసిందంటూ.. ఆ అరెస్టులు వారి ప్రాధమిక హక్కులను ఉల్లంఘించటమేనన్నారు.

►భారత్ మీడియా ద్వారా దౌత్యం నడుపుతోందని.. పాక్ సైన్యం చర్చలకు అనుకూలంగా లేదన్న అభిప్రాయాన్ని కలిగిస్తోందని విమర్శించారు. శాంతి పరిరక్షణలో, అభివృద్ధిని ప్రోత్సహించటంలో ఉమ్మడి బాధ్యత ఉందని, అన్ని అంశాలపైనా చర్చకు ఇరు దేశాలూ సిద్ధంగా ఉన్నాయనేది ఉఫా ప్రకటనలో ముఖ్యమైన భాగమని.. అందులో కశ్మీర్ అనేది తప్పనిసరిగా ఒక అంశమన్నారు.
 
ఆ రెండు అంశాలపై హామీ ఇవ్వాలి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: భారత్ - పాక్ ఎన్‌ఎస్‌ఏ స్థాయి చర్చల్లో కశ్మీర్ అంశంపైనా చర్చించాలని, వేర్పాటువాదులకూ ఆ చర్చలకు చోటివ్వాలని పాకిస్తాన్ పట్టుపట్టేట్లయితే ఆ చర్చలు జరగవని భారత్ స్పష్టంచేసింది. ఈ రెండు అంశాలపైనా పాక్ శనివారం రాత్రిలోగా విస్పష్టమైన హామీ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందుకు పాక్ అంగీకరించకపోతే ‘‘చర్చలు జరగవు’’ అని తేల్చిచెప్పింది. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సోమవారం జరగాల్సి ఉన్న ఎన్‌ఎస్‌ఏల చర్చలకు తాను ఎలాంటి ముందస్తు షరతులూ విధించటం లేదని పేర్కొన్నారు. సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలూ ఒప్పుకున్న సిమ్లా ఒప్పందం స్ఫూర్తిని, ఎన్‌ఎస్‌ఏలు కేవలం ఉగ్రవాదం అంశంపై చర్చించేందుకు మాత్రమే సమావేశమవుతారని ఇటీవల ఉఫాలో ఇరు దేశాల ప్రధానమంత్రులు వచ్చిన అంగీకారాన్ని మాత్రమే తాను ప్రస్తావిస్తున్నానని పదేపదే ఉద్ఘాటించారు.

►పాక్‌లోని బాగా తెలిసిన శక్తులు చర్చలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ.. భారత రాజకీయ నాయకత్వం ఒత్తిడిని తట్టుకోగలిగినప్పటికీ.. పాక్ నాయకత్వం ఆ శక్తుల ఒత్తిడిని తట్టుకోలేదని వ్యాఖ్యానించారు. ‘‘చర్చల నుంచి పారిపోతున్నది పాకిస్తానే. భారత్ కాదు. హురియత్ నేతలను దూరంగా పెట్టి.. ఉగ్రవాదం మినహా మరే అంశాలూ లేవనెత్తకపోతే.. ఆయనను చర్చలకు ఆహ్వానిస్తాం. ఉగ్రవాదంపై చర్చ ముందు.. కశ్మీర్‌పై తర్వాత చర్చించవచ్చు’’ అని పేర్కొన్నారు.

►‘‘ఇరు పక్షాలూ మూడు సమావేశాలు నిర్వహించాలని ఉఫాలో ఇరువురు ప్రధానమంత్రులు నిర్ణయించారు. ఉగ్రవాదంపై ఎన్‌ఎస్‌ఏలు, శాంతి పరిరక్షణపై సరిహద్దు బలగాలు, కాల్పుల విరమణ ఉల్లంఘనలపై డెరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ చర్చించాలని అంగీకారానికి వచ్చారు. కానీ.. షరీఫ్ పాక్‌లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఈ సమావేశాలపై ముందుకు వెళ్లకుండా ఉండేందుకు భూమిక సిద్ధం చేశారు. మాపైనా తక్కువ ఒత్తిడి లేదు. గురుదాస్‌పూర్, ఉధంపూర్‌లలో రెండు ఉగ్రవాద దాడులతో పాటు 91 కాల్పుల విరమణ ఉల్లంఘనలు ఉన్నాయి. కానీ, ఈ చర్చలు ఉగ్రవాదంపై ఉన్నందున ముందుకు వెళ్లాలనే మేం నిర్ణయించాం. ఎన్‌ఎస్‌ఏ చర్చలకు భారత్ ప్రతిపాదించిన తేదీల విషయంలోనూ వారి స్పందనలో చాలా జాప్యంచేశారు. చర్చల కోసం తేదీని ప్రతిపాదిస్తూ మేం జూలై 23న లేఖ పంపించాం. వారి జవాబు 22 రోజుల తర్వాత ఆగస్టు 14వ తేదీన వచ్చింది. సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని సరిహద్దు బలగాల సమావేశం కోసం కూడా పాక్ సెప్టెంబర్ 6ను సూచించింది. ఎన్‌ఎస్‌ఏ చర్చలు జరగరాదన్నది మనసులో పెట్టుకునే ఆ తేదీని ప్రతిపాదించింది.’  

►మిత్రత్వం కోసం ఒక చర్య తీసుకున్నపుడు అది నెరవేరకపోతే అసంతృప్తికి లోనవటం మామూలేనని సుష్మా చెప్పారు. ఒకవేళ చర్చలు జరగకపోయినా కూడా అది ఇరు దేశాల సంబంధాలకు ముగింపు కాబోదన్నారు. భారత్ - పాక్ సంబంధాలు గతుకుల మయంగా ఉన్న రహదారి వంటిది. ఎదురుదెబ్బలు ఉంటాయి. పంక్చర్లు అవుతాయి. అయినా మళ్లీ రోడ్డెక్కుతాం. దౌత్యంలో ఎన్నడూ ఫుల్‌స్టాప్ ఉండదు. సమగ్ర చర్చల్లో కానీ పునరుద్ధరించిన చర్చల్లో కానీ ఎన్‌ఎస్‌ఏ చర్చలు భాగం కాదు.  

► {పస్తుత వాతావరణంలో చర్చలు అర్థరహితమన్న సర్తార్ అజీజ్ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ఈ చర్చలు పూర్తి ఫలితాలు ఇస్తాయని భారత్ ఎన్నడూ చెప్పలేదని.. కానీ చర్చల నుంచి ఎల్లప్పుడూ కొంత ఫలితం వస్తుందని.. ఆ ఆశతోనే చర్చలు నిర్వహించటం జరుగుతుందని సుష్మా స్పందించారు. వారు చర్చల కోసం ఢిల్లీ రాకూడదని ఒక నిర్ణయానికి వచ్చినందునే అజీజ్ అలా చెప్తున్నారని విశ్లేషించారు.

►పాక్‌లో ఉగ్రవాద ఘటనల్లో భారత్‌కు చెందిన రా (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) పాత్రపై ఆరోపణలు చేస్తూ ‘డోసియర్’ అంటూ అజీజ్ పలు పత్రాలను ప్రదర్శించటం గురించి ప్రశ్నించగా.. ‘‘వారి (పాక్) ఉగ్రవాద కార్యకలాపాల గురించి కేవలం డోసియర్‌లు ఇవ్వటమే కాదు.. సజీవంగా ఉన్న ఉగ్రవాదిని భారత్ చూపుతుంది’’ అని ఆమె తిప్పికొట్టారు. ఉదంపూర్‌లో ఉగ్రదాడి సందర్భంగా పోలీసులకు చిక్కిన నవేద్‌యాకూబ్ విషయాన్ని ఆమె పరోక్షంగా ప్రస్తావించారు.
 
కీలకమైన కశ్మీర్ అంశంపై చర్చ లేనిదే.. భారత్‌తో ఎలాంటి గంభీరమైన మంతనాలూ సాధ్యం కాదు. సోమవారం నాటి చర్చల కోసం - ఉగ్రవాదం, ఉఫాలో తీసుకున్న నిర్ణయంలో ప్రగతి, కశ్మీర్ సహా ఇతర అంశాలన్నిటితో పాక్ మూడు సూత్రాల అజెండాను సిద్ధం చేసింది.    - పాక్ ఎన్‌ఎస్‌ఏ సర్తాజ్ అజీజ్
 
చర్చల నుంచి పారిపోతున్నది పాకిస్తానే. భారత్ కాదు. హురియత్ నేతలను దూరంగా పెట్టి.. ఉగ్రవాదం మినహా మరే అంశాలూ లేవనెత్తకపోతే.. ఆయనను చర్చలకు ఆహ్వానిస్తాం. ఉగ్రవాదంపై చర్చ ముందు.. కశ్మీర్‌పై తర్వాత చర్చించవచ్చు
 - భారత విదేశాంగ మంత్రి  సుష్మా స్వరాజ్  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement