బాసురీ స్వరాజ్‌.. డాటరాఫ్‌ సుష్మ | Lok sabha elections 2024: Bansuri Swaraj, BJP candidate from New Delhi | Sakshi
Sakshi News home page

బాసురీ స్వరాజ్‌.. డాటరాఫ్‌ సుష్మ

Published Sat, Apr 20 2024 4:38 AM | Last Updated on Sat, Apr 20 2024 4:38 AM

Lok sabha elections 2024: Bansuri Swaraj, BJP candidate from New Delhi - Sakshi

బాసురీ స్వరాజ్‌. సక్సస్‌ఫుల్‌ సుప్రీంకోర్టు లాయర్‌. అయినా సరే, అక్షరాలా అమ్మకూచి. సుష్మా స్వరాజ్‌ అంతటి గొప్ప వ్యక్తికి కూతురు కావడం తన అదృష్టమంటారు. తల్లితో కలిసున్న ఫొటోలను తరచూ షేర్‌ చేస్తుంటారు. విద్యార్థి సంఘ నేతగా రాజకీయ ఓనమాలు నేర్చుకున్న బాసురి బీజేపీ లీగల్‌ సెల్‌ కన్వినర్‌గా న్యాయవాద వృత్తిలోనూ రాజకీయాలను కొనసాగించారు. ఈసారి న్యూఢిల్లీ స్థానం నుంచి లోక్‌సభ బరిలో దిగి ఎన్నికల అరంగేట్రమూ చేస్తున్నారు...

వారసత్వ రాజకీయాలను విమర్శించే బీజేపీ కూడా ఆ తాను ముక్కేనని ఇటీవల విపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. బాçసురీకి టికెటివ్వడాన్ని కూడా ఇందుకు ఉదాహరణగా చూపుతున్నాయి. కానీ తన తల్లి ప్రజాప్రతినిధిగా చేసినంత మాత్రాన తనవి వారసత్వ రాజకీయాలు కావంటారు బాసురీ. ‘‘రావడమే సీఎం, పీఎం వంటి ఉన్నత పదవులతోనో పార్టీ అధినేతగానో రాజకీయాల్లో అడుగు పెడితే వారసత్వ రాజకీయం అవుతుంది. కానీ నాలా కార్యకర్త నుంచి మొదలైతే కాదు’’ అంటూ తిప్పికొడుతున్నారు.

‘‘నా రాజకీయ ప్రస్థానం పార్టీ కార్యకర్తగానే మొదలైంది. న్యాయవాదిగా కోర్టులో అడుగుపెట్టే ముందే అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) కార్యకర్తగా పార్టీ కోసం పనిచేశా. ఇప్పుడు పార్టీ నాకో అవకాశమిచి్చంది. ఇప్పుడూ అందరిలాగే కష్టపడుతున్నా’’ అని చెప్పుకొచ్చారు. న్యూఢిల్లీ సిటింగ్‌ ఎంపీ, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీని పక్కనపెట్టి మరీ బాసురీకి అవకాశమిచి్చంది బీజేపీ. దీనిపై మీనాక్షి బాగా అసంతృప్తితో ఉన్నారన్న వార్తలను బాసురీ కొట్టిపడేశారు. ఆమె ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయన్నారు.

హై ప్రొఫైల్‌ కేసులతో...
బాసురీ 1984 జనవరి 3న జని్మంచారు. లండన్‌లోని వారి్వక్‌ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌ సాహిత్యంలో డిగ్రీ చదివారు. బీపీపీ లా స్కూల్‌లో న్యాయశా్రస్తాన్ని అభ్యసించారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోని సెంట్‌ కేథరీన్స్‌ కాలేజీలో మాస్టర్స్‌ పూర్తి చేశారు. అనంతరం న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 2007 నుంచి ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా ఉన్నారు. నాలుగేళ్ల కిందట ఢిల్లీ బీజేపీ లీగల్‌ సెల్‌ కో–కన్వినర్‌గా బాధ్యతలు చేపట్టారు.

అదే సమయంలో హరియాణా అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌గానూ నియమితులయ్యారు. కాంట్రాక్టులు, రియల్‌ ఎస్టేట్, పన్నులు, అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వాలు, నేరాల కేసులను వాదించారు. ఆమె క్లయింట్స్‌ హై ప్రొఫైల్‌ వాళ్లే కావడంతో న్యాయవాద రంగంలో అతికొద్ది కాలంలోనే కీర్తి సంపాదించారు. మీడియా ముందు అంతగా కనిపించని బాసురీ.. ఐపీఎల్‌ వివాదంలో లలిత్‌ మోడీ న్యాయవాద బృందంలో ఒకరిగా తొలిసారి వార్తల్లోకెక్కారు. గతేడాది ఆప్‌ ప్రభుత్వంపై విమర్శలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారామె.

తల్లికి స్వయంగా అంత్యక్రియలు...
సుష్మా స్వరాజ్‌ 2019లో కన్నమూశారు. ఆమె అంత్యక్రియలను స్వయంగా నిర్వహించి బాసురీ అప్పట్లో వార్తల్లోకెక్కారు. మహిళలను చైతన్యవంతులను చేసే దిశగా ఆమె ప్రసంగాలు చేస్తుంటారు. ఆ క్రమంలో 2021లో తనకు దక్కిన ‘తేజస్విని’ అవార్డును తల్లికి అంకితమిచ్చారు. ప్రతి విషయంలోనూ గురువుగా మారి తనకు అమూల్యమైన జీవిత విలువలను నేరి్పందంటూ తల్లిని గుర్తు తెచ్చుకుని కన్నీళ్ల పర్యంతమయ్యారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement