‘ఈసారి 400కు పైగా సీట్లు’ అనేది ఊరికే అన్న మాట కాదు.. నిజం అయి తీరుతుంది అంటున్నారు బీజేపీ న్యూఢిల్లీ అభ్యర్థి, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్. ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్ కూటమి "స్వప్రయోజనం"పై ఆధారపడి ఉందని, తమ పార్టీ అవకాశాలపై ఆ కూటమి ఎలాంటి ప్రభావం చూపబోదని అన్నారామె. ఢీల్లీలోని ఏడు పార్లమెంట్ స్థానాలనూ మరోసారి బీజేపీ గెలుచుకుంటుందన్నారు.
ఢిల్లీలోని అత్యంత పిన్న వయస్కురాలైన బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బన్సూరి స్వరాజ్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "అబ్కీ బార్ 400 పార్ (ఈసారి 400కు పైగా సీట్లు)" అనేది కేవలం నినాదం మాత్రమే కాదని, అది ఒక సంకల్పమని అన్నారు. అంకితభావంతో ఉన్న బీజేపీ కార్యకర్తల సహాయం, ప్రజల మద్దతుతో వాస్తవం అయి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్నీ చెప్పినట్లే చేసింది. ఆర్టికల్ 370ని తొలగించడం, రామమందిర నిర్మాణం, రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల చట్టం తీసుకురావడం వంటి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని బన్సూరి స్వరాజ్ అన్నారు.
ఢిల్లీలో బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఇద్దరు మహిళా అభ్యర్థుల్లో బన్సూరి స్వరాజ్ ఒకరు. దేశ రాజధాని ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాల్లో వరుసగా మూడోసారి క్లీన్‌స్వీప్ చేసేందుకు బీజేపీ పోటీపడుతోంది. కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీ లోక్‌సభ స్థానంలో పోటీ చేస్తోంది. ఆ స్థానం నుంచి సోమనాథ్ భారతిని బరిలోకి దింపింది.
న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న తనకు ప్రజల నుండి ఎంతో అభిమానం లభిస్తోందని బన్సూరి స్వరాజ్ తెలిపారు. వేదికపై కూర్చొని ప్రసంగాలు చేయడం తనకు ఇష్టం ఉండదని, ప్రజల మధ్యకు వెళ్లి వారితో మాట్లాడటమే తనకు ఇష్టమని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment