భారత్-పాక్ మ్యాచ్ (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడటంపై స్పష్టతనివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరింది. 2012 అనంతరం ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే రెండు దేశాల మధ్య 2014లో కుదిరిన ఒప్పందాన్ని బీసీసీఐ గౌరవించడం లేదని, తమకు 7 కోట్ల డాలర్లు నష్టపరిహారంగా ఇప్పించాలని కోరుతూ పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు (పీసీబీ) ఐసీసీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. బీసీసీఐ మాత్రం భారత ప్రభుత్వం అనుమతిస్తేనే ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగుతాయని చెబుతూ వస్తోంది.
బీసీసీఐ ఎఫ్‌టీపీని గౌరవించడం లేదంటూ పీసీబీ ఐసీసీ వివాద పరిష్కార కమిటీని ఆశ్రయించింది. ఈ ఒప్పందం ప్రకారం తటస్థ వేదికలో పాక్‌తో టీమిండియా కనీసం రెండు సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. ముగ్గురు సభ్యుల కమిటీ పాక్ బోర్డు వేసిన పిటిషన్‌పై విచారణ జరపనుంది. ఈ విషయంలో కమిటీ నిర్ణయమే ఫైనల్ అని ఇప్పటికే ఐసీసీ స్పష్టంచేసింది. అక్టోబర్ 1 నుంచి 3 మధ్య దుబాయ్‌లో ఈ విచారణ జరగనుంది.
ఈ విచారణలో భాగంగా ఐసీసీ వివాదాల పరిష్కార బోర్డు ఎదుట తమ వాదనలు వినిపించే ముందు దీనిపై ప్రభుత్వ విధానమేంటో తెలుసుకోవాలని బీసీసీఐ భావించింది. ఈ మేరకు కేంద్రానికి మెయిల్ పంపించిందని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు.‘ ఇది బోర్డు తరపున సాధారణంగా జరిగే ప్రక్రియే. ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో ప్రభుత్వ అనుమతి తీసుకోవడం మా బాధ్యత. మా పని అడగటం వరకే. అనుమతి ఇవ్వాలా వద్దా అన్నది ప్రభుత్వం ఇష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో ద్వైపాక్షిక సిరీస్ కష్టమేనని మాకూ తెలుసు. అయితే ఇదే సమాచారం ప్రభుత్వం నుంచి వస్తే మాకు ఉపయోగపడుతుంది’ అని ఆ అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment