కరాచీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇటీవల తెరపైకి తీసుకొచ్చిన నాలుగు రోజుల టెస్టు క్రికెట్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చేరిపోయాడు. ఈ విధానాన్ని వద్దంటూనే దానికి ఆమోద ముద్ర పడాలంటే ముందుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఒప్పుకుని తీరాల్సిందేనని తేల్చిచెప్పాడు. అసలు బీసీసీఐ ఒప్పుకోలేని పక్షంలో దాన్ని ఐసీసీ అమలు చేయడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయదన్నాడు. ఈ విషయంలో బీసీసీఐ ఒప్పుకునే ప్రసక్తే ఉండదని అక్తర్ అభిప్రాయపడ్డాడు.
సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ.. ఐసీసీ నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనను తిరస్కరించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. సంప్రదాయ టెస్టు క్రికెట్‌ను చంపాలని గంగూలీ ఎప్పటికీ అనుకోడని అన్నాడు. ఐసీసీ ప్రతిపాదనకు ఏ ఒక్కరూ సానుకూలంగా స్పందించడం లేదని, ఇదొక చెత్త నిర్ణయమని విమర్శించాడు. గంగూలీ ఒక క్రికెట్ మేధావి అని, దీనికి అతన్ని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రీన్ సిగ్నల్ లభించదన్నాడు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, గౌతం గంభీర్, మెక్‌గ్రాత్, రికీ పాంటింగ్‌లు నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఇక పాకిస్తాన్ నుంచి కూడా క్రికెట్ పెద్దలు దీనిపై పెదవి విప్పాలని అక్తర్ కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment