లాహోర్: పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ప్రధాని, ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రన్‌ఖాన్ ఫొటోలను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తొలగించిన సంగతి తెలిసిందే. ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఫొటోను తొలగిస్తూ సదరు కమిటీ నిర్ణయం తీసుకుంది. మరొకవైపు మొహాలి క్రికెట్ స్టేడియంలో ఉన్న 15 మంది పాకిస్తాన్ క్రికెటర్ల ఫొటోలను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) తొలగించింది. అదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) పోటీలను భారత్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని డీస్పోర్ట్ చానల్ నిలిపివేసింది. కాగా, ఇప్పటివరకూ పీఎస్ఎల్‌కు అధికారిక ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న ఐఎంజీ రిలయన్స్ సైతం ఇకపై ఆ లీగ్ తో ఎటువంటి భాగస్వామ్యాన్ని కొనసాగించబోమని పేర్కొంది.
ఈ నేపథ్యంలో స్పందించిన పీసీబీ.. ఈ విషయాల్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దృష్టికి తీసుకెళతామని పేర్కొంది. ‘ ఇది చాలా దురదృష్లకరం. పాకిస్తాన్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను సీసీఐ తొలగించడం చాలా బాధాకరం. దాంతోపాటు మా దేశానికి చెందిన క్రికెటర్ల ఫొటోలను కొన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్‌లు తొలగించిన విషయం మా దృష్టికి వచ్చింది. భారత్‌లో పీఎస్‌ఎల్ మ‍్యాచ్‌లను కూడా నిలిపివేశారు. ఇక్కడ రాజకీయాలు, క్రీడలు వేర్వేరు అనే విషయం గ్రహించాలి. ప్రధానంగా క్రికెట్ అనేది దేశాల మధ్య ఐక్యతకు వారథి లాంటిది. చరిత్ర అదే చెబుతుంది కూడా. క్రీడల్ని రాజకీయాలతో ముడిపెట్టి చూడొద్దు. వీటిపై బీసీసీఐతో చర్చిస్తాం. ఐసీసీ వద్దే తేల్చుకుంటాం’ అని పీసీబీ మేనేజింగ్ డైరక్టర్ వసీం ఖాన్ తెలిపారు.
భారత్‌లో పీఎస్‌ఎల్ ప్రసారాల్ని డీస్పోర్ట్ చానల్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న స‍్వల్ప వ్యవధిలోనే, పీఎస్ఎల్ కు అఫీషియల్ ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న ఐఎంజీ రిలయన్స్ ఇకపై లీగ్ తో ఏ మాత్రం భాగస్వామ్యాన్ని కొనసాగించబోమని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌తో వాణిజ్యపరమైన బంధం అవసరం లేదని భావించిన మీదటే ఈ నిర్ణయం తీసుకుంది. పీఎస్ఎల్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఐఎంజీ రిలయన్స్ పలు మ్యాచ్ ల లైవ్ కవరేజ్ కి అవసరమయ్యే వనరులను సమకూర్చాల్సివుంది. వివిధ దేశాల్లోని టీవీ చానళ్లకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, కవరేజ్ చేసే వ్యక్తులు, కెమెరాలు, ఓబీ వ్యాన్ లు వంటి ఇతర మౌలిక వసతులను కల్పించాల్సివుంది. తాజాగా పీఎస్‌ఎల్ నుంచి ఐఎంజీ రిలయన్స్ తప్పుకోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడానికి పీసీబీ సిద్ధమైంది.
ఇక్కడ చదవండి: పాక్ క్రికెటర్ల ఫొటోలు తొలగింపు
Comments
Please login to add a commentAdd a comment