వారిపై తక్షణమే చర్యలు
పఠాన్‌కోట్ దాడిపై మోదీకి షరీఫ్ హామీ
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ లింకు ప్రస్ఫుటమైన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని నవాజ్‌షరీఫ్ మంగళవారం మధ్యాహ్నం భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. దాడి వెనుక గల ఉగ్రవాదులపై తక్షణమే నిర్ణయాత్మక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దాడికి బాధ్యులైన, దాడితో సంబంధమున్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై అత్యవసరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని షరీఫ్‌కు మోదీ బలంగా చెప్పారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఉగ్రవాదుల నిర్దిష్ట సమాచారాన్ని పాక్‌కు అందించినట్లు పీఎంఓ పేర్కొంది. శ్రీలంక పర్యటనలో ఉన్న షరీఫ్ మంగళవారం మోదీకి ఫోన్ చేసి మాట్లాడి.. పఠాన్‌కోట్ దాడిలో సంభవించిన మరణాలకు విచారం వ్యక్తం చేశారని పాక్ ప్రధాని కార్యాలయం తెలిపింది.
ఇరు దేశాల మధ్య శాంతి ప్రక్రియను దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారంటూ.. ఉగ్రదాడి కేసు దర్యాప్తులో భారత్‌కు పూర్తిగా సహకరిస్తామని, భారత్ అందించిన ఆధారాల మేరకు దర్యాప్తు చేస్తామని షరీఫ్ హామీ ఇచ్చారని వివరించింది. పరస్పర సహకారంతో ఉగ్రవాదంపై పోరాడాలని ఇరువురు ప్రధానులూ తీర్మానించారని పేర్కొంది. ప్రధానుల సంభాషణ తర్వాత పాక్ జాతీయ భద్రతా సలహాదారు జనరల్ నసీర్‌ఖాన్‌జాన్జు కూడా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌కు ఫోన్ చేసి మాట్లాడారు.
ఉగ్రవాదుల కాల్ చేసిన పాక్‌లోని ఫోన్ నంబర్లు, వాటిపై నిఘా సమాచారం వంటి ఆధారాలపై చర్చించారని, సమాచారాన్ని దోవ్‌ల్ పాక్‌కు అందించారని సమాచారం. దాడిని ఆదివారం ఖండించిన పాక్ సర్కారు సోమవారం ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తాము కట్టుబడి ఉన్నామంది.
దర్యాప్తులో పాక్ సాయం కోరతాం.. ఎన్‌ఐఏ: పఠాన్‌కోట్‌లో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చారనటంలో సందేహం లేదని ఎన్‌ఐఏ చీఫ్ శరద్‌కుమార్ పేర్కొన్నారు. ఉగ్రవాదులు పాక్‌లోని తమ సూత్రధారులతో మాట్లాడిన ఫోన్ కాల్స్ వివరాలు, వాటిపై నిఘా సమాచారం ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఆధారాలని చెప్పారు. ఈ దాడి వెనుక కుట్రను ఛేదించటం పెద్ద సవాలంటూ.. కేసు దర్యాప్తులో పాక్ సహాయం కోరతామని తెలిపారు. భద్రతా దళాల ఆపరేషన్‌లో హతమైన ఉగ్రవాదులను గుర్తించేందుకు ప్రయత్నిస్తామని, వారి డీఎన్‌ఏ నమూనాలు సేకరిస్తామని.. వారు ఫోన్‌లో మాట్లాడిన పాక్‌లోని వారి సూత్రధారుల స్వరాలను సరిపోల్సి చూసేందుకు వారి స్వర నమూనాలు అందించాలని అడుగుతామని పేర్కొన్నారు.