వారి ధైర్యసాహసాలు గర్వకారణం | A matter of pride for their bravery | Sakshi
Sakshi News home page

వారి ధైర్యసాహసాలు గర్వకారణం

Published Sun, Jan 10 2016 12:58 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

వారి ధైర్యసాహసాలు గర్వకారణం - Sakshi

వారి ధైర్యసాహసాలు గర్వకారణం

పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన ప్రధాని
♦ ఆపరేషన్‌పై ప్రధానికి వివరించిన భద్రతా బలగాల చీఫ్‌లు
♦ ఉగ్రదాడిని ఎదుర్కొన్న ఆపరేషన్‌పై సంతృప్తి: పీఎంఓ ప్రకటన
 
 పఠాన్‌కోట్: ఉగ్రవాదులు దాడికి తెగబడిన పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరాన్ని ప్రధాని మోదీ శనివారం సందర్శించారు. భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. సైనికుల ధైర్యసాహసాలు మనకు గర్వకారణమని ప్రశంసించారు. మోదీ వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్ ఉన్నారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాదులంతా హతమయ్యాక సైతం ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ పూర్తయ్యాక కూడా ఎయిర్‌బేస్‌లో కొనసాగించిన కూంబింగ్ ఆపరేషన్లు శుక్రవారం ముగిశాయని, స్థావరం పూర్తిగా సురక్షితంగా ఉందని బలగాలు ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో మోదీ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. దాడులు, ఆపరేషన్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. ఉగ్రవాదులను భద్రతా బలగాలు తొలుత ఎదుర్కొన్న మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ యార్డ్‌ను, చివరి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టటానికి బలగాలు పేల్చివేసిన రెండంతస్తుల భవనాన్ని మోదీ పరిశీలించారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా భారత్ - పాక్ సరిహద్దు ప్రాంతాన్ని గగనతలం నుంచి  పరిశీలించారు. వైమానిక దళాధిపతి ఎయిర్ మార్షల్ అరూప్ రాహా, సైనిక దళాధిపతి దల్బీర్‌సింగ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నతాధికారులు సంబంధిత వివరాలు తెలియజేశారు.

మోదీ పర్యటనలో ‘‘వ్యూహాత్మక ప్రతిస్పందన విషయంలో నిర్ణయం తీసుకోవటం, దానిని అమలు చేయటాన్ని సంతృప్తితో గుర్తించటం జరిగింది. పోరాట క్షేత్రంలో మన పురుష, మహిళా సిబ్బంది ధైర్యసాహసాలను ప్రశంసించటం జరిగింది. వారు మనకు గర్వకారణం’’ అంటూ ప్రధాని కార్యాలయం శనివారం ట్వీట్ల ద్వారా వ్యాఖ్యానించింది.

 ఫొటోలకు ఫోజుల కోసమే...: కాంగ్రెస్
 దాడి జరిగిన ఎనిమిది రోజుల తర్వాత ప్రధాని ఆ స్థావరాన్ని సందర్శించటం.. దేశ భద్రత, ఉగ్రవాదంపై పోరాటంలో మోదీ సర్కారు వైఫల్యాన్ని చూపుతోందని.. ప్రధాని ఆలస్య సందర్శన కేవలం ఫొటో కార్యక్రమం స్థాయికి దిగజారిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ‘‘జైషే మొహమ్మద్‌పై పాకిస్తాన్ చర్యలు చేపట్టేలా చూడటం, అంతర్గత భద్రత పరిరక్షణ చర్యలపై సంపూర్ణ సమీక్ష, భద్రతా లోపాలకు బాధ్యులను గుర్తించటం.. తక్షణావసరం.

ఈ కీలకాంశాలపై చేపట్టిన చర్యల గురించి మోదీ దేశ ప్రజలకు తెలియజేస్తారని మేం ఆశిస్తున్నాం’’ అని ఏఐసీసీ సమాచార విభాగం చీఫ్ రణ్‌దీప్‌సూర్జేవాలా శనివారం ఢిల్లీలో మీడియాతో వ్యాఖ్యానించారు. ‘‘పాక్ ప్రధాని నవాజ్‌షరీఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి ప్రధాని మోదీ తన విమానాన్ని ఆ దేశానికి మళ్లించారు.. కానీ పఠాన్‌కోట్ వెళ్లటానికి ఎనిమిది రోజుల సమయం తీసుకున్నారు’’ అని కాంగ్రెస్ పార్టీ ట్విటర్‌లో తప్పుపట్టింది. కాగా, అనుమానిత ఉగ్రవాదులు కనిపించారన్న సమాచారాన్ని భద్రతాబలగాలు తేలికగా తీసుకోబోవని.. దానిని చాలా తీవ్రంగా పరిగణించి వేగంగా స్పందిస్తామని బోర్డర్ రేంజ్ డీఐజీ కున్వర్‌విజయ్‌ప్రతాప్‌సింగ్ పేర్కొన్నారు. కాగా, పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి వెనుక ఉన్న సూత్రధారులపై పాకిస్తాన్ త్వరగా చర్యలు తీసుకోవాలని అమెరికా కోరింది.
 
 15న విదేశాంగ కార్యదర్శుల భేటీ జరగాల్సి ఉంది: అజీజ్
 ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ - పాక్ చర్చల ప్రక్రియపై అనిశ్చిత పరిస్థితుల మధ్య.. ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు ఈ నెల 15వ తేదీన సమావేశమై చర్చలు జరపాల్సి ఉందని పాకిస్తాన్ పేర్కొంది. విదేశీ వ్యవహారాలపై పాక్ ప్రధానమంత్రికి సలహాదారైన సర్తాజ్ అజీజ్ శుక్రవారం తమ దేశ పార్లమెంటులో తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ సభ్యుడు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘భారత్ - పాక్ విదేశాంగ కార్యదర్శులు జనవరి 15వ తేదీన భేటీ కావాల్సి ఉంది. కొత్తగా అంగీకరించిన సమగ్ర ద్వైపాక్షిక చర్చల కింద వివిధ సమావేశాల షెడ్యూళ్లను ఇరువురు విదేశాంగ కార్యదర్శులూ నిర్ణయిస్తారు. ఇరు దేశాల మధ్య చర్చల్లో వివిధ అంశాలతో పాటు కశ్మీర్ అంశం కూడా భాగంగా ఉంటుంది’’ అని వివరించారు.

 ఎలా వచ్చారు? ఎవరు సహకరించారు?
 దాడి కేసులో ఎన్‌ఐఏ దృష్టిపెట్టిన కీలకాంశాలివీ...
 న్యూఢిల్లీ: ఉగ్రదాడికి సంబంధించిన కీలకాంశాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దృష్టి సారించింది. గురుదాస్‌పూర్ ఎస్‌పీ సల్వీందర్, ఆయన స్నేహితుడు, వంటమనిషిల కిడ్నాప్‌పై ఒకటి, దానికి ముందు ఒక ట్యాక్సీ డ్రైవర్  హత్యపై ఒకటి, స్థావరంపై దాడిపై ఒకటి.. మూడు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. ఎన్‌ఐఏ దర్యాప్తులో దృష్టి పెట్టిన కీలకాంశాలివీ...
► ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడినప్పటి నుంచీ దాడి చేయటం వరకూ జరిగిన ఘటనల క్రమం, సరిహద్దు నుంచి ఉగ్రవాదులు ప్రయాణించిన మార్గం, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ - కశ్మీర్‌లోని కతువాల మధ్య బమియాల్ సెక్టార్‌లోకి పాక్ నుంచి చొరబాటును నిరోధించటంలో బీఎస్‌ఎఫ్ లోపాలపై ఉన్నతస్థాయిలో దర్యాప్తు జరుగుతోంది.
► ఉగ్రవాదుల ఆయుధాలు, మందుగుండు.. వారి వ్యూహం.. వారికి స్థానికుల సహకారం. పంజాబ్‌లోకి చొరబడిన తర్వాత సైనిక దుస్తులు, వాకీ-టాకీలు అందించిన స్థానికులను గుర్తించేందుకు ఎన్‌ఐఏ ప్రయత్నిస్తోంది.
► ఉగ్రవాదులకు - పాక్‌లోని వారి సూత్రధారులకు మధ్య మొబైల్ ఫోన్ సంభాషణలను ఉగ్రవాదులు చంపేసిన ఇన్నోవా ట్యాక్సీ డ్రైవర్‌కు చెందిన మొబైల్ ఫోన్ నంబరు సహా వారు కాల్ చేసిన నంబర్లపై దర్యాప్తు చేస్తోంది.
► జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థదిగా భావిస్తున్న లేఖ, ఉగ్రవాదులు అపహరించి వదిలివెళ్లిన ఎస్‌పీ కారులో దొరికిన పఠాన్‌కోట్ మ్యాప్ పైనా దర్యాప్తు చేస్తోంది. ఉగ్రవాదుల మృతదేహాల నుంచి సేకరించిన డీఎన్‌ఏ నమూనాలు, వారి స్వర నమూనాల విశ్లేషణపై దృష్టి సారించింది.
► ఉగ్రదాడికి ముందు.. ఎస్‌పీ, ఆయన స్నేహితుడు, వంటమనిషి చెప్పిన కిడ్నాప్ కథనాలు, ఇచ్చిన స్టేట్‌మెంట్లను విశ్లేషిస్తోంది. ఎన్‌ఐఏ బుధవారం  ఎస్‌పీని..కిడ్నాప్ చేసిన ప్రాంతానికి, తర్వాత ఆయనను పడేసిన చోటుకు, ఆయన కారు దొరికిన ప్రాంతానికి తీసుకెళ్లినట్లు సమాచారం. 31వ తేదీ కతువాలోని ఆలయానికి వెళ్లామని చెప్తున్న ఎస్‌పీ ఆలయం నుంచి రాత్రి 9:30 గంటలకు తిరిగి బయల్దేరిన తర్వాత.. అర్థరాత్రి దాటాక ఉగ్రవాదులు కిడ్నాప్ చేసే వరకూ మూడు గంటల పాటు ఏం చేశారనే దానిపైనా ఎన్‌ఐఏ దృష్టి సారించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement