పంజాబ్ పోలీసుల పాత్ర ప్రశ్నార్థకం: పార్లమెంటరీ కమిటీ
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఉగ్రదాడిని అడ్డుకోవడంలో కేంద్రం విఫలమైందని, ఉగ్రదాడుల నిరోధక వ్యవస్థలో ఏదో తప్పు జరుగుతోందని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో రక్షణ వ్యవస్థ సరిగా లేదని మంగళవారం తన నివేదికలో వెల్లడించింది. హోం శాఖ వ్యవహారాలపై 197వ నివేదికను సమర్పిస్తూ... పంజాబ్ పోలీసుల పాత్ర కూడా ప్రశ్నార్థకంగా, అనుమానాస్పదంగా ఉందని పేర్కొంది. ఉగ్రదాడులు జరగవచ్చన్న హెచ్చరికల్ని అర్థంచేసుకోవడంలో రాష్ట్ర పోలీసులు విఫలమయ్యారంది.
భారీ భద్రత కలిగిన ఆ స్థావరంలోకి ఉగ్రవాదులు ఎలా ప్రవేశించారో అర్థం కావడం లేదని పేర్కొంది. అపహరణకు గురై విడుదలయ్యాక ఎస్పీ, అతని స్నేహితుడు చెప్పిన నమ్మకమైన నిఘా సమాచారాన్ని పరిశీలించడానికే పోలీసులు పరిమితమయ్యారని, ముప్పును ఎదుర్కోవడంలో వేగంగా, నిర్ణయాత్మకంగా స్పందించలేదంటూ అభిప్రాయపడింది. ఎస్పీ, అతని స్నేహితుడ్ని ఉగ్రవాదులు ఎందుకు వదిలేశారో ఎన్‌ఐఏ విచారణ జరపాలంది. వైమానిక స్థావరంలో ప్రహారీ గోడ చుట్టూ ఎలాంటి రహదార్లు లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
పాక్ టీంను అనుమతించడం సరికాదు
పాక్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నప్పుడు విచారణకు ఆ దేశం సాయం ఎందుకు కోరారంటూ కమిటీ ప్రశ్నించింది. పఠాన్‌కోట్ స్థావరంలోకి పాక్ ఉమ్మడి దర్యాప్తు బృందాన్ని(జేఐటీ) అనుమతించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. ఉగ్రవాదులు చాలా సులువుగా భారత్‌లో ప్రవేశించడం చూస్తుంటే... పాక్ భద్రతా సంస్థలు, నిఘా విభాగాల సాయం లేకుండా దాడి జరిగి ఉండకపోవచ్చని కమిటీ అభిప్రాయపడింది. రక్షణ కంచె, ఫ్లడ్ లైట్లతో పాటు బీఎస్‌ఎఫ్ సిబ్బంది నిరంతరం పహారా ఉన్నా తీవ్రవాదులు భారత్‌లోకి ఎలా ప్రవేశించారని ప్రశ్నించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంట వరుస దాడుల నేపథ్యంలో పహారా, రక్షణ కంచె, ఫ్లడ్ లైటింగ్‌లను పటిష్టం చేయాలని, సూచించింది.
‘పఠాన్‌కోట్’లో విఫలమయ్యారు
Published Wed, May 4 2016 1:15 AM | Last Updated on Sat, Mar 23 2019 8:00 PM
Advertisement