చర్చల నుంచి భారత్ పారిపోతోంది: పాక్
ఇస్లామాబాద్: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిపై సంయుక్త దర్యాప్తునకు పాక్ ముందుకొచ్చినప్పటికీ... భారతదేశం మాత్రం చర్చల నుంచి పారిపోతోందని పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఆరోపించారు. పాకిస్థాన్ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆయన బుధవారం ప్రసంగించారు.
భారత్‌తో చర్చలను తిరిగి ఆరంభించేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పఠాన్‌కోట్ దాడిపై సంయుక్త దర్యాప్తునకు ముందుకొచ్చినప్పటికీ భారత్ మాత్రం విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలను నిలిపివేసిందని పేర్కొన్నారు. ఉప ఖండంలో ఉద్రిక్తతకు ప్రధాన కారణం కశ్మీర్ సమస్యేనని తాము నమ్ముతున్నామని.. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు, ఐరాస తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యను పరిష్కరించనిదే సమస్యలు పరిష్కారం కాబోవని వ్యాఖ్యానించారు.