'అమ్మా.. నేను సూసైడ్ మిషన్లో ఉన్నాను'
చండీగఢ్: పంజాబ్ లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి కొన్ని గంటల ముందు ఓ టెర్రరిస్ట్ తన తల్లికి చేసిన కాల్ వివరాలు తెలిసి అధికారులు అశ్యర్యపోయారు. అర్థరాత్రి 1:58 గంటలకు వచ్చిన ఈ 70 సెకన్ల కాల్ రికార్డ్ వివరాలను అధికారులు సేకరించారు. అయితే, ఈ వివరాలపై స్పష్టత లేకపోవడంతోనే వైమానిక స్థావరంపై దాడులు జరగకుండా అప్రమత్తం కాలేకపోయినట్లు తెలుస్తోంది. టెర్రరిస్ట్ తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ.. 'నేను సూసైడ్ మిషన్లో ఉన్నాను. అల్లా మిమ్మల్ని చల్లగా చూస్తాడు' అని చెప్పినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ నుంచి అర్ధరాత్రి 12:30 గంటల నుంచి 2 గంటల వరకు వచ్చిన కాల్స్ వివరాలను డీకోడ్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
టెర్రరిస్టులు ఫోన్లో పంజాబీ, ముల్తానీ భాషల్లో మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. 87 సెకన్లపాటు జరిగిన ఓ కాల్ సంభాషణలో.. అంతా కంట్రోల్లో ఉందా అని ఓ వ్యక్తి అడగగా, అవును అని ఫోన్లో అవతలి వ్యక్తి సమాధానమిచ్చినట్లు గుర్తించారు. ఎయిర్ ఫోర్స్ ఆస్తులు, చాపర్స్, ఇతర విమానాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. శనివారం చోటుచేసుకున్న ఉగ్రదాడులు, భారత బలగాల ఎదురుకాల్పుల ఫలితంగా ముగ్గురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది చనిపోగా, నలుగురు తీవ్రవాదులు హతమైన విషయం అందరికీ తెలిసిందే.