
పటాన్ కోట్ లో 'ఉగ్ర' వేట
ఎయిర్ బేస్‌లో ముష్కరులపై కొనసాగుతున్న ఆర్మీ ఆపరేషన్
మరో ఉగ్రవాది హతం.. మొత్తం ఏడుగురు జవాన్ల మృతి
పఠాన్‌కోట్ : పంజాబ్‌లో వైమానిక స్థావరంపై ఉగ్రదాడిని తిప్పికొట్టేందుకు భద్రతా దళాలు చేస్తున్న ఆపరేషన్ ఆదివారం రెండోరోజూ కొనసాగింది. ఉగ్రవాదుల బాంబుదాడులు, కాల్పులతోపాటు భద్రతా బలగాల ఎదురుదాడితో ఆ ప్రాంతం దద్దరిల్లింది. శనివారం దాడికి దిగిన ఉగ్రవాదుల్లో నలుగురిని హతమార్చగా.. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఎయిర్ బేస్ ప్రాంగంణం లోనే ఉన్నట్లు గుర్తించిన బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఆదివారం మధ్యాహ్నం ఉన్నట్టుండి కాల్పులు మొదలవటంతో అప్రమత్తమైన బలగాలు.. ఎదురు కాల్పులు ప్రారంభించాయి.
ఎయిర్‌బేస్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు.. ఈ కేంద్రం వెనకవైపున్న అడవిలో దాక్కుని.. కాల్పులు జరుపుతున్నారు. దీంతో భద్రతా బలగాలకు సాయంగా మరో ఐదు కంపెనీల సైనిక దళాలను రంగంలోకి దించారు. దీనికి తోడు ఆపరేషన్‌ను వేగవంతం చేసేందుకు బుల్డోజర్లు, జేసీబీలనూ వినియోగిస్తున్నారు. సైనిక హెలికాప్టర్లు గగనతలం నుంచి ఈ అడవి ప్రాంతంలో గాలిస్తూ.. భద్రతా బలగాలకు సహాయం అందిస్తున్నాయి. ఆదివారం రాత్రికి ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. రాత్రి 9.30 గంటలకు చివరిసారిగా కాల్పులు జరిగాయని, వీలైనంత త్వరగా ఆపరేషన్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
అమరులైన మరో నలుగురు జవాన్లు
శనివారం తెల్లవారుజామున భారత్-పాక్ సరిహద్దుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్లు, తుపాకులతో దాడి చేయడం తెలిసిందే. గగనతల నిఘా ద్వారా వీరు లోపలకు వస్తుండటాన్ని గుర్తించిన ఎయిర్‌బేస్ రక్షణ సిబ్బంది.. అప్రమత్తమై ఎదురుదాడి ప్రారంభించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో శనివారం ముగ్గురు జవాన్లు చనిపోవడమూ తెలిసిందే. శనివారం గాయపడి చికిత్స పొందుతున్న భద్రతా సిబ్బందిలో ముగ్గురు (డిఫెన్స్ సెక్యూరిటీ కోర్) ఆదివారం మృతిచెందారు. బలగాల కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాది వద్దఉన్న గ్రనేడ్‌ను ఆదివారం ఉదయం నిర్వీర్యం చేస్తుండగా అది పేలటంతో.. ఎన్‌ఎస్‌జీ బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ మృతిచెందారు. దీంతో ఉగ్ర దాడిలో మరణించిన భద్రతా సిబ్బంది సంఖ్య ఏడుకు పెరిగింది. రెండు రోజుల్లో గాయపడిన జవాన్ల సంఖ్య 20కి పెరిగింది.
ఎంతమంది ఉగ్రవాదులు?
ఈ ఆపరేషన్లో..శనివారం నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో వారిని వేటాడేందుకు ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో మరొక ఉగ్రవాది హతమైనట్లు వార్తలు వచ్చాయి. ఐదుగురు ఉగ్రవాదులు హతమైనందున ఆపరేషన్ పూర్తయిందని శనివారం రాత్రి ట్వీట్ చేసిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్.. కాసేపటికే ఆ ట్వీట్‌ను తొలగించారు. ఐదో ఉగ్రవాది హతమైనట్లు అధికారికంగా వార్తలు కూడా రాలేదు. దీంతో.. దాడికి వచ్చిన ఉగ్రవాదులు ఎంతమంది అనేది నిర్దిష్టంగా తెలియలేదు.
అయితే.. ఆదివారం ఉదయం ఎయిర్‌బేస్‌లో ఉగ్రవాదులు మళ్లీ కాల్పులకు దిగటం.. రెండు వైపుల నుంచి కాల్పులు రావటంతో ఇంకా ఇద్దరు, అంతకన్నా ఎక్కువ మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ‘ఆపరేషన్ తర్వాతే.. ఎంతమంది ఉగ్రవాదులు వచ్చారనేది తెలుస్తుంది’ అని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్‌రిషి తెలిపారు. మరింత మంది ఎన్‌ఎస్‌జీ కమాం డోలను పఠాన్‌కోట్ పంపిస్తున్నామని.. అప్పటివరకు ఆపరేషన్ పూర్తి కాదని పేర్కొన్నారు.
ఒకటో తేదీనే స్థావరంలోకి చొరబాటు?
ఉగ్రవాదులు జనవరి 1వ తేదీ మధ్యాహ్నమే ఎయిర్‌బేస్ క్యాంపస్‌లోకి ప్రవేశించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాపైన ఎస్పీ మిత్రుడి సెల్‌ఫోన్‌తో పాకిస్తాన్‌లోని భవల్పూర్‌కు జరిపిన సంభాషణ కూడా ఎయిర్‌బేస్ సెల్‌టవర్ ద్వారానే జరిగినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ధ్రువీకరించాయి. దీని ఆధారంగానే ఉగ్రదాడి హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. జనవరి 1నే వారు ఎయిర్‌బేస్‌లోకి వచ్చినట్లయితే అది తీవ్ర భద్రతా వైఫల్యమే.
ఎయిర్‌బేస్ భద్రతా వైఫల్యమే?
నిఘా వర్గాలనుంచి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.. ఈ ఆపరేషన్‌ను పూర్తి చేయటంలో ఆలస్యం జరగటం కచ్చితంగా భద్రతా బలగాల నిఘా వైఫల్యమేనని.. రక్షణ రంగ మాజీ నిపుణులు విమర్శించారు. ఇంతకన్నా సమర్థవంతంగా వ్యవహరించేందుకు అవకాశం ఉందని ‘రా’ మాజీ చీఫ్ ఏఎస్ దౌలత్ తెలిపారు. ‘సరిహద్దు భద్రతా దళాల కన్నుగప్పి.. ఇంత పెద్దమొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు తీసుకుని దేశంలోకి ఎలా వచ్చుంటారు?’ అని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదులు తమ లక్ష్యానికి చేరుకోవటంలో విఫలమయ్యేలా ఎయిర్ బేస్ భద్రతా దళాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని.. దీనివల్ల పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం తప్పిందని.. ఈ కేంద్రం చీఫ్‌గా పనిచేసిన ఎయిర్ చీఫ్ మార్షల్ పీఎస్ అహ్లువాలియా అన్నారు. గత నెలలో ప్రధాని మోదీ పాక్ పర్యటన తర్వాతే ఇలాంటి ఘటనలు ఎదురవుతాయనే అనుమానం తనకు కలిగిందని.. రిటైర్డ్ మేజర్ జనరల్ గగన్‌దీప్ బక్షి ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.
కేసు ఎన్‌ఐఏ చేతికి..
ఉగ్రదాడి ఘటనపై సోమవారం ఎన్‌ఐఏ కేసు నమోదు చేయనుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ సంస్థ పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు. ఉగ్రవాదులు ఎలా భారత్‌లోకి వచ్చారు?, ట్యాక్సీ డ్రైవర్‌ను చంపటం, ఎస్పీపై దాడి తదితర ఘటనల తర్వాత ఎయిర్ బేస్‌పై దాడి వంటి అంశాలను ఎన్‌ఐఏ విచారించనుంది. శనివారం మధ్యాహ్నమే ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఎన్‌ఐఏ బృందం.. ప్రాథమిక సమాచారం సేకరించే పనిలో ఉంది.
ఎయిర్‌బేస్‌లో ఏం జరిగింది?
గురుదాస్‌పూర్ గుండా ఉగ్రవాదులు పంజాబ్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం అందిందని.. వారి లక్ష్యం పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడేనని సమాచారం అందటంతో.. ఎన్‌ఎస్‌జీ, ఆర్మీ, పోలీస్, వైమానిక సిబ్బంది అప్రమత్తమయ్యారని ఐఏఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు లోపలకు వస్తున్న విషయాన్ని గుర్తించిన డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ దళ సభ్యులు కాల్పులు ప్రారంభించారని.. ఉగ్రవాదులు ప్రతిదాడి చేయటంతో.. ఓ డీఎస్సీ సభ్యుడు మరణించారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఉగ్రవాదులు డీఎస్‌సీ క్యాంటీన్ వైపుకు పారిపోగా.. అక్కడున్న వారు అప్రమత్తమై కాల్పులు జరిపారని.. ఇందులో ఓ ఉగ్రవాది చనిపోగా.. మరో డీఎస్‌సీ సభ్యుడిని మరో ఉగ్రవాది కాల్చి చంపాడని వివరించారు. ఆ తర్వాత శనివారం దినమంతా జరిగిన ఆపరేషన్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోగా.. మిగిలిన వారు ఎయిర్‌బేస్ వెనకనున్న అటవీ ప్రాంతం వైపుకు పారిపోయారన్నారు.
పెళ్లై 45 రోజులే!
పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో అమరుడైన గరుడ్ కమాండో గురుసేవక్ సింగ్ కుటుంబానికి హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. 45 రోజుల క్రితమే గురుసేవక్‌కు వివాహమైంది. దీంతో కుటుంబం షాక్‌లో ఉంది. కాగా, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కామన్వెల్త్ గేమ్స్ మెడలిస్టు ఫతేసింగ్‌కు కేంద్ర మంత్రి, షూటింగ్ ఒలింపిక్ మెడలిస్టు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ నివాళులర్పించారు.
మోదీ ఉన్నత స్థాయి సమీక్ష...
కర్ణాటక పర్యటన ముగించుకుని ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్, విదేశాంగ కార్యదర్శి ఎస్.జయశంకర్, ఇతర అధికారులతో పఠాన్‌కోట్ పరిస్థితిపై సమీక్షించారు. అంతకుముందు.. ప్రధానికి రక్షణమంత్రి పరీకర్ ఆపరేషన్ వివరాలు తెలిపారు. కాగా, పాకిస్తాన్ వ్యూహాలపై మాజీ విదేశాంగ కార్యదర్శులు, పాక్‌లో పనిచేసిన మాజీ రాయబారులతో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమావేశమై చర్చించారు. భారత-పాక్ చర్చల ప్రక్రియపై ఈ దాడి చూపగల ప్రభావం గురించి సమీక్షించారు. పంజాబ్‌లో ఆరు నెలల్లో రెండుసార్లు ఉగ్రదాడులు జరగటంతో.. సరిహద్దుల్లో రెండంచెల భద్రతను ఏర్పాటు చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌బాదల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.