'ఉగ్రదాడిని ఎదుర్కొనడంలో మా వైఫల్యం లేదు'
చంఢీగడ్: పఠాన్ కోట్ ఎయిర్ బేస్పై ఉగ్రదాడిని ఎదుర్కొనడంలో తమ వైఫల్యం లేదని పంజాబ్ డీజీపీ సురేశ్ అరోరా అన్నారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకున్నారని తెలిపారు. తమ అధికారులు అప్రమత్తంగా ఉండి, అన్ని శాఖలతో సమన్వయంగా వ్యవహరించడం వల్లే దాడి తీవ్రతను గణనీయంగా తగ్గించగలిగామన్నారు. మొదటిసారి తాము ఎన్ఎస్జీని వినియోగించామని డీజీపీ పేర్కొన్నారు.
అలాగే ఎయిర్బేస్లో ఏఐజీ కౌంటర్తో పాటు సీసీ నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కాగా చెక్పోస్ట్ వద్ద ఓ ప్రయివేట్ కారును ఎలా అనుమతించారని విలేకర్ల ప్రశ్నకు డీజీపీ అరోరా సమాధానమిస్తూ ఆ ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. అలాగే పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడికి సంబంధించి స్థానికుల మద్దతు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయన్న దానిపై కూడా ఆయన విచారణ అనంతరం అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు.