
సాక్షి, న్యూఢిల్లీ : కార్బైన్ (లాంగ్ గన్స్)లను దిగుమతి చేసుకోవాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడంతో చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర వినియోగానికి మేడిన్ ఇండియా కార్బైన్‌లను సమీకరించాలని రక్షణ బలగాలు యోచిస్తున్నాయి. ప్రత్యర్ధులతో నేరుగా తలపడే సమయంలో పదాతిదళాలు వాడే తేలికపాటి పొడవైన గన్‌లను కార్భైన్‌లుగా వ్యవహరిస్తారు. ఈ తరహా ఆయుధాల సేకరణ కోసం భారత సైన్యం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని ఇషాపోర్ కేంద్రంలో తయారైన కార్బైన్‌ను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ రక్షణ బలగాలకు అప్పగించగా వీటి కొనుగోలుకు సాయుధ బలగాలు ఆసక్తి చూపుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. త్రివిధ దళాల కోసం ఈ ఆయుధాలను కొనుగోలు చేయాలని భావిస్తున్న అధికారులు ఇప్పటికే ఈ ఆయుధాలపై ప్రాథమికంగా పరీక్షించినట్టు తెలిసింది.
ఈ ఆయుధాలను ఎగుమతి చేసే దేశాలు కొద్ది దేశాలకే అదీ తక్కువ సంఖ్యలో ఎగుమతి చేస్తున్న క్రమంలో దేశీయ కార్బైన్ కొనుగోలుకు సాయుధ బలగాలు మొగ్గుచూపాయి. విదేశాల నుంచి కార్భైన్‌ల కొనుగోలు ప్రతిపాదన రెండేళ్లుగా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నియమించిన ఉన్నతస్ధాయి కమిటీ పరిశీలనలో ఉండటం కూడా వీటి సమీకరణలో జాప్యానికి కారణమవుతోంది. సాయుధ బలగాలకు 3.5 లక్షల కార్బైన్స్ అవసురం కాగా, ఫాస్ట్‌ట్రాక్ మార్గంలో 94,000 ఆయుధాలనే దిగుమతి చేసుకోనున్నారు. ఇక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కార్బైన్‌ను సాయుధ బలగాలు ఎంపిక చేస్తే వీటిని కఠినంగా పరీక్షించి తొలుత పరిమిత సంఖ్యలోనే రక్షణ బలగాలకు అందచేస్తారు. చదవండి : ఏకకాలంలో చైనా, పాక్‌లతో యుద్ధానికి రెడీ
Comments
Please login to add a commentAdd a comment