border tension
-
భారత్-చైనా యుద్ధం కాస్తలో తప్పింది..!
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో భారత్-చైనాల మధ్య గత తొమ్మిది నెలలుగా తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. సరిహద్దు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు నడిచాయి. తాజాగా సరిహద్దులో ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్నాయి. గతేడాది జూన్‌లో ఇరు దేశాల మధ్య మొదలైన ప్రతిష్టంభన ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. అయితే ఈ తొమ్మిది నెలల కాలంలో సరిహద్దులో ఇరు దేశాల మధ్య కొన్ని సార్లు యుద్ధ వాతావరణం నెలకొన్నదని.. ఒకానొక సమయంలో ఇక యుద్ధ భేరి మోగించడమే తరువాయి అనే పరిస్థితులు తలెత్తాయి అని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి తెలిపారు. ఈ సందర్భంగా వైకే జోషి మాట్లాడుతూ.. ‘‘గల్వాన్ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య ఎర్ర గీత గీశారు. దీని తర్వాత కేంద్రం మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. డ్రాగన్ తోక జాడిస్తే.. దాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ఆపరేషన్ అయినా చేపట్టవచ్చని మాకు ఆదేశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో గతేడాది ఆగస్టు 29, 30న మన సైన్యం దక్షిణాన ఉన్న కైలాష్ రేంజ్ శిఖరాలను స్వాధీనం చేసుకుంది. ఈ చర్యలను చైనా ఏ మాత్రం ఊహించలేకపోయింది.. సహించలేకపోయింది. దీనికి ప్రతీకారంగా కౌంటర్ ఆపరేషన్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆగస్టు 31న పీఎల్ఏ దళాలు మనకు అతి సమీపంలోకి వచ్చాయి. పరిస్థితి చూస్తే ఏ క్షణంలోనైనా యుద్ధం తప్పదన్నట్లుగా ఉంది’’ అన్నారు. ‘‘ఇక ఇటువైపు మన ట్యాంక్ మ్యాన్, గన్నర్, రాకెట్ లాంచర్ అందరూ సిద్ధంగా ఉన్నారు. ట్రిగ్గర్ వదిలితే చాలు.. దీనికి ధైర్యంతో పని లేదు. ఇక్కడ అత్యంత కష్టమైన పని ఏంటంటే కాల్పులు జరగకుండా చూడటం.. రక్తం చిందకుండా.. ప్రాణాలు కోల్పోకుండా చూడటం. ఈ పరిస్థితి తలెత్తకుండా చూడాలంటే ఎంతో ధైర్యం కావాలి. మాకు స్పష్టంగా అర్థం అవుతుంది యుద్ధం చేసే సందర్భం వచ్చిందని. మన జవాన్లు చాలా నిబద్ధతతో వ్యవహరించారు. మొత్తానికి డ్రాగన్‌ను కట్టడి చేయగలిగాం. యుద్ధం తప్పించగలిగాం’’ అని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు’’ వైకే జోషి. 45 మంది చనిపోయి ఉండొచ్చు గల్వాన్ ఘర్షణ సందర్భంగా 45 మంది చైనా జవాన్లు మరణించారని ఓ రష్యన్ ఏజెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జోషి కూడా నేరుగా నంబర్ చెప్పకపోయినా.. అదే అయి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. చైనా వైపు చనిపోయిన వాళ్ల గురించి మన ఆర్మీ నుంచి ఇలాంటి ప్రకటన రావడం ఇదే తొలిసారి. ‘‘గల్వాన్ ఘర్షణలో ఎంత మంది మరణించి ఉంటారనే దాని గురించి నేను ఎలాంటి అంచనా వేయను. కానీ ఆ ఘటన జరిగినప్పుడు మా వైపు ఆబ్జర్వేషన్ పోస్ట్‌లు ఉన్నాయి. చాలా మందిని స్ట్రెచర్లలో తీసుకెళ్లడం కనిపించింది. 60మందికి పైగానే ఇలా తీసుకెళ్లారు. అందులో అందరూ చనిపోయారా లేదా తెలియదు. రష్యన్ ఏజెన్సీ చెప్పినట్లు మరణించిన చైనా సైనికుల సంఖ్య 45 లేదా అంతకంటే ఎక్కువే ఉండొచ్చు’’ అన్నారు జోషి. చైనాకు కార్గిల్ హీరో సలహా కార్గిల్ యుద్ధ హీరో అయిన జోషి.. తన కెరీర్లో చాలా వరకూ లద్ధాఖ్ శిఖరాల్లోనే గడిపారు. ఆయనకు చైనా భాష మాండరిన్ చాలా బాగా తెలుసు. ఇక గల్వాన్ ఘర్షణ వల్ల చైనాకు చెడ్డపేరు రావడం తప్ప వాళ్లు సాధించింది ఏమీ లేదన్నారు జోషి. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రముఖ మాండరిన్ సామెతను గుర్తు చేసుకున్నారు. ‘‘దూరంగా ఉన్న బంధువు, దగ్గరగా ఉన్న పొరుగువారు ఎప్పటికీ సమానం కారు’’ అనే సామెత చెప్పారు. అంటే పొరుగు వాళ్లతో మంచి సంబంధాలు నెలకొల్పడం ముఖ్యం కానీ.. దూరంగా ఉన్న బంధువుపై ఆధారపడటం సరికాదు అని దీని అర్థం అన్నారు జోషి. ఇదే సామెతను తాను చైనాకు చెబుతానని అన్నారు. ‘‘మేము(భారత్) వాళ్లతో మంచి పొరుగువారిగా ఉంటాము కానీ రెండు వైపులా ఆ నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకాన్ని కలిగించే బాధ్యత ఇప్పుడు చైనాపైనే ఉంది’’ అని జోషి స్పష్టం చేశారు. చదవండి: మాటకి కట్టుబడి వెనుదిరిగిన చైనా సైన్యం గల్వాన్ ఘర్షణపై సంచలన విషయాలు బహిర్గతం.. -
దేశీ గన్లతో డ్రాగన్‌పై గురి
సాక్షి, న్యూఢిల్లీ : కార్బైన్ (లాంగ్ గన్స్)లను దిగుమతి చేసుకోవాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడంతో చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర వినియోగానికి మేడిన్ ఇండియా కార్బైన్లను సమీకరించాలని రక్షణ బలగాలు యోచిస్తున్నాయి. ప్రత్యర్ధులతో నేరుగా తలపడే సమయంలో పదాతిదళాలు వాడే తేలికపాటి పొడవైన గన్లను కార్భైన్లుగా వ్యవహరిస్తారు. ఈ తరహా ఆయుధాల సేకరణ కోసం భారత సైన్యం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని ఇషాపోర్ కేంద్రంలో తయారైన కార్బైన్‌ను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ రక్షణ బలగాలకు అప్పగించగా వీటి కొనుగోలుకు సాయుధ బలగాలు ఆసక్తి చూపుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. త్రివిధ దళాల కోసం ఈ ఆయుధాలను కొనుగోలు చేయాలని భావిస్తున్న అధికారులు ఇప్పటికే ఈ ఆయుధాలపై ప్రాథమికంగా పరీక్షించినట్టు తెలిసింది. ఈ ఆయుధాలను ఎగుమతి చేసే దేశాలు కొద్ది దేశాలకే అదీ తక్కువ సంఖ్యలో ఎగుమతి చేస్తున్న క్రమంలో దేశీయ కార్బైన్ కొనుగోలుకు సాయుధ బలగాలు మొగ్గుచూపాయి. విదేశాల నుంచి కార్భైన్ల కొనుగోలు ప్రతిపాదన రెండేళ్లుగా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నియమించిన ఉన్నతస్ధాయి కమిటీ పరిశీలనలో ఉండటం కూడా వీటి సమీకరణలో జాప్యానికి కారణమవుతోంది. సాయుధ బలగాలకు 3.5 లక్షల కార్బైన్స్ అవసురం కాగా, ఫాస్ట్‌ట్రాక్ మార్గంలో 94,000 ఆయుధాలనే దిగుమతి చేసుకోనున్నారు. ఇక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కార్బైన్‌ను సాయుధ బలగాలు ఎంపిక చేస్తే వీటిని కఠినంగా పరీక్షించి తొలుత పరిమిత సంఖ్యలోనే రక్షణ బలగాలకు అందచేస్తారు. చదవండి : ఏకకాలంలో చైనా, పాక్‌లతో యుద్ధానికి రెడీ -
చైనా, పాక్‌లతో యుద్ధానికి సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆయుధ శ్రేణిలో రఫేల్ యుద్ధ విమానాలు చేరడంతో ప్రత్యర్ధులపై మనం పైచేయి సాధించామని, తొలిసారిగా ప్రభావవంతంగా దాడిచేసే సామర్థ్యం అందివచ్చిందని వైమానిక దళం చీఫ్ ఆర్కేఎస్ భదూరియా అన్నారు. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్లతో ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో ఇరు దేశాలతో ఏకకాలంలో యుద్ధం చేసేందుకు సిద్థమని ఆయన స్ప్టష్టం చేశారు. లడఖ్‌లో చైనా దూకుడును ఈ ఏడాది మేలోనే తాము గుర్తించామని, అప్పటినుంచి మన సైనం, వైమానిక దళం వేగంగా స్పందిస్తున్నాయని భదూరియా పేర్కొన్నారు. చదవండి : రఫేల్ రాక.. చైనాకు స్ట్రాంగ్ కౌంటర్ సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా సేనలు మోహరించి విస్తృతంగా సైనిక విన్యాసాలు చేపడుతున్నాయని చెప్పారు. పలు అంశాల్లో పాకిస్తాన్ చైనాపై ఆధారపడుతోందని చెప్పుకొచ్చారు. యుద్ధం వస్తే భారత్‌పై చైనా పైచేయి సాధించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. లడఖ్ సహా కీలక ప్రాంతాల్లో భారత సైన్యం మోహరించిందని, పాక్-చైనాలతో తలపడేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు భారీగా సేనలను మోహరించామని వెల్లడించారు. కాగా ఐదు రాఫేల్ యుద్ధవిమానాలు సెప్టెంబర్ 10న భారత వాయుసేన అమ్ములపొదిలో చేరిన సంగతి తెలిసిందే. -
చైనాకు మరోసారి గట్టి హెచ్చరికలు పంపిన భారత్
-
సరిహద్దు వివాదం : మోదీ సర్కార్ ఏ గట్టునుంది?
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాగుతుండగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశంలో లేకున్నా నరేంద్ర మోదీ సర్కార్‌పై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. భారత్-చైనా సరిహద్దు ప్రతిష్టంభనపై ట్విటర్ వేదికగా రాహుల్ బుధవారం మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. లడఖ్‌లో చైనా బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయని, అసలు దేశంలో ప్రభుత్వం భారత సైన్యంతో ఉందా చైనా వైపు ఉందా అని రాహుల్ మోదీ సర్కార్‌పై మండిపడ్డారు. ‘ సరిహద్దుల్లోకి ఏ ఒక్కరూ ప్రవేశించలేదని ప్రధానమంత్రి చెబుతారు..ఆ తర్వాత చైనా బ్యాంకు నుంచి భారీ రుణం తీసుకుంటారు..ఆపై రక్షణమంత్రి చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందని చెబుతారు..ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రేమో ఎలాంటి ఆక్రమణలు లేవని చెపుతున్నారని ఈ వరుస పరిణామాలను గమనించాల’ని రాహుల్ ట్వీట్ చేశారు. అసలు మోదీ ప్రభుత్వం భారత సైన్యంతో ఉందా లేక చైనా వెంట ఉందా..? ఎందుకంతగా భయపడుతున్నారని ప్రశ్నించారు. తన తల్లి సోనియా గాంధీ ఆరోగ్య పరీక్షల నిమిత్తం రాహుల్ గాంధీ ఆమెతో కలిసి విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా సరిహద్దు పరిస్థితిపై మంగళవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్లో ప్రకటన చేస్తూ లడఖ్‌లో 38,000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించిందని ప్రకటించారు. చదవండి : ‘ఆత్మనిర్భర్ అంటే ఎవరిని వారు కాపాడుకోవడమే’ మే నుంచి ఎల్ఏసీని దాటేందుకు పలు ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఇక గత ఆరునెలలుగా ఎల్ఏసీ వెంబడి ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం బుధవారం పార్లమెంట్లో పేర్కొంది. ఇక గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో మన భూభాగంలోకి ఎవరూ అడుగుపెట్టలేదు..మన స్ధావరాల్లో పాగా వేయలేదని జూన్‌లో ప్రధానమంత్రి ప్రకటించగా, చైనా సరిహద్దులను దాటి మన భూభాగంలోకి చొచ్చుకువస్తేనే భారత సేనలు చైనా భూభాగంలోకి దూసుకువెళ్లాల్సి వచ్చిందని కాంగ్రెస్ ప్రధాని వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపింది. ఇక ఇదే సమయంలో చైనా ప్రాబల్య ఆసియా మౌలిక వసతుల పెట్టుబడి బ్యాంక్ (ఏఐఐబీ) నుంచి ప్రభుత్వం భారీగా రుణాలను పొందింది. -
చైనాకు దీటుగా బదులిస్తాం
-
సరిహద్దు వివాదం : రక్షణ మంత్రి కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దు సమస్యపై పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్రకటన చేశారు. సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని సమస్య ఇంకా పరిష్కారం కాలేదని స్పష్టం చేశారు. మన బలగాలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నాయని, చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. చైనా మొండిగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది మే నుంచి సరిహద్దుల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించిందని వివరించారు. చైనాతో తాము స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నా డ్రాగన్ దూకుడుతో శాంతి ఒప్పందంపై ప్రభావం పడుతోందని, ద్వైపాక్షిక చర్చలపైనా ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు. చైనాతో సరిహద్దు వివాదం ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉందని, 1962లో చైనా లడ్డాఖ్లో 90 వేల కిలోమీటర్ల భూభాగం ఆక్రమించిందని అన్నారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడేది లేదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నామని చెప్పారు. సరిహద్దుల నిర్ణయానికి చైనా అంగీకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ఏసీని ఇరు దేశాలు గౌరవించాలని అన్నారు. చైనా ఏకపక్ష చర్యలను భారత్ ఖండిస్తోందని, డ్రాగన్ కదలికలను పసిగడుతున్నామని మన సైన్యం కూడా అప్రమత్తంగా ఉందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. భారత్ శాంతినే కోరుకుంటోందని, సామరస్య చర్చలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. చైనా రక్షణ మంత్రితో తాను చర్చలు జరిపానని, యథాతథ స్థితికి భంగం కలిగించే చర్యలు చేపట్టవద్దని ఆయనతో స్పష్టం చేశానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడ్డాఖ్‌కు వెళ్లి సైనికులను కలిశారని గుర్తు చేశారు. చైనాతో చర్చలకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. చర్చలు కొనసాగిస్తామని చైనా హామీ ఇస్తున్నా సరిహద్దుల విషయంలో మొండిగా వాదిస్తోందని దుయ్యబట్టారు. తాజాగా ఇరుదేశాల విదేశాంగ మంత్రులు అవగాహనకు వచ్చారని చెప్పారు.ఇక చైనాతో ఉద్రిక్తతలపై పార్లమెంట్లో చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చగా ఈ అంశంపై సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన చేశారు. చదవండి : రఫేల్ రాక.. చైనాకు స్ట్రాంగ్ కౌంటర్ -
పాపం.. జిన్‌పింగ్
వాషింగ్టన్: ఏదో అనుకుంటూ.. ఇంకేదో అయ్యిందే అని బాధపడుతున్నారంట చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్. భారత భూభాగంలోకి చొరబడాలని తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఏమైంది.. మనం సైన్యం ప్రతి దాడి చేయడంతో తోక ముడవాల్సిన పరిస్థితి తలెత్తెంది. చైనా సైన్యం దారుణంగా విఫలమయ్యింది. ఈ పరిణామాలు జిన్ పింగ్‌ను మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదంట. దాంతో చాలా క్రూరమైన ప్రక్షాళన చర్యలకు దిగబోతున్నాడంటూ అమెరికన్ మీడియా కోడై కూస్తూంది. ఈ మేరకు వరుస కథనాలను వెల్లడిస్తోంది. వాటి ప్రకారం తాజాగా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు జిన్ పింగ్ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించాడట. అతని సైన్యం మీద అపారమైన నమ్మకం ఉంచి.. దూకుడుగా ప్రవర్తించాడట. అయితే భారత్ కూడా అందుకు ధీటుగా బదులివ్వడం.. రక్షణపరంగా వ్యూహత్మకమైన శిఖరాలను ఆదీనంలోకి తీసుకోవడంతో జిన్ పింగ్ షాక్‌కు గురయ్యాడట. ఈ ఊహించని అపజయం అతడిని తీవ్రంగా కలిచి వేస్తున్నట్లు అమెరికన్ మీడియా న్యూస్‌వీక్ కథనం వెలువరించింది. దాంతో జిన్‌పింగ్ దీన్ని ఒక సాకుగా చూపించి తన రక్షణ దళ సలహాదారులను బలవంతంగా తొలగించమే కాక కొత్త వారిని నియమిస్తాడని న్యూస్‌వీక్ వెలువరించింది. ఈ ఏడాది జూన్ 15న గల్వాన్ లోయలో భారత్-చైనాల మధ్య ఘర్షణలు జరిగిన నాటి నుంచి ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చైనా ఆక్రమించుకున్న అత్యున్న పర్వత భూభాగాలను భారత దళాలు స్వాధీనం చేసుకోవడంతో చైనా దళాలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాట. గడిచిన అరశతాబ్ధంలో భారత్ ఎప్పుడు ఇంత దుకుడుగా లేదని.. ఈ చర్యలతో చైనా దళాలు వెనక్కి తగ్గాయని న్యూస్ లింక్ తెలిపింది. అంతేకాక భారత బలగాలను నిరోధించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా పేలవంగా ఉన్నట్లు తెలిపింది. చైనా గ్రౌండ్ ఫోర్స్‌లు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభావవంతంగా పని చేయలేకపోయిందని వివరించింది. ఇది కేవలం 1979లో వియాత్నంకు పాఠం నేర్పించే అంశంలో మాత్రమే విజయం సాధించిందని వెల్లడించినంది. (చదవండి: 'జిన్‌పింగ్ ఓకే అంటేనే లెక్కను వివరిస్తాం') అంతేకాక ప్రస్తుతం భారత దళాలలు ఆక్రమణదారులకు తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని.. ప్రస్తుతం చాలా దూకుడుగా.. రక్షణాత్మకంగా ఉన్నారని.. మొత్తానికి భారత్ తన ఆటని పూర్తిగా మార్చవేసిందని కథనం ప్రచురించింది. అయితే ఈ ఎదురుదెబ్బలను పరిగణలోకి తీసుకుని జిన్ పింగ్‌ని తక్కువ అంచనా వేయలేమని కూడా హెచ్చరించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో జి జిన్‌పింగ్ సైనిక అంశాలను పూర్తిగా ప్రక్షాళన చేసే అవకాశం ఉందని తెలిపింది. -
త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్)తో పాటు త్రివిధ దళాల అధిపతులతో శుక్రవారం సమావేశమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరైన ఈ భేటీలో నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి పరిస్థితిని సమీక్షించారు. తూర్పు లడఖ్‌లో సుదీర్ఘంగా సాగుతున్న సరిహద్దు ప్రతిష్టంభనకు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వి మధ్య గురువారం మాస్కోలో కీలక భేటీ అనంతరం రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో సరిహద్దు వెంబడి పరిస్థితితో పాటు చైనా విదేశాంగ మంత్రితో విదేశాంగ మంత్రి జై శంకర్ చేపట్టిన చర్చల సారాంశాన్ని సమీక్షించారు. భారత్-చైనా సైనిక కమాండర్ల స్ధాయి చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు ఐదు సూత్రాల ప్రణాళికను అనుసరించడంపై గురువారం ఇరు దేశాలు అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఒప్పందాలు, ప్రొటోకాల్స్ అన్నిటికీ కట్టుబడాలని, ఉద్రిక్తతలు పెంచే చర్యలకు దూరంగా ఉంటూ శాంతి సామరస్యం కొనసాగేలా చూడాలని పంచసూత్ర ప్రణాళికలో నిర్ణయించారు. మరోవైపు తూర్పు లడఖ్‌లో డ్రాగన్ సేనలు భారీగా మోహరించడంతో భారత దళాలూ అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యలను దీటుగా తిప్పికొట్టేందుకు సన్నద్ధమయ్యాయి. ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్నా ఇరు దేశాల మధ్య సైనిక కమాండర్ల స్ధాయి చర్చలు చుషుల్‌లో శుక్రవారం కొనసాగాయి. చదవండి : భారత్, చైనా మధ్య ‘యుద్ధాటకం’ -
డ్రాగన్ దూకుడు : యుద్ధ విమానాలతో భారత్ సన్నద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు ప్రతిష్టంభనపై సైనిక కమాండర్ల స్థాయిలో సంప్రదింపులు జరుగుతుండగానే దొంగదెబ్బ తీస్తున్న డ్రాగన్‌కు బుద్ధిచెప్పేందుకు భారత సైన్యం సన్నద్ధమైంది. చైనా కదలికలను పసిగట్టి దీటుగా ప్రతిఘటించేందుకు సాధనా సంపత్తితో సంసిద్ధమైంది. భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో బుధవారం పాంగాంగ్ ప్రాంతంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) పెద్దసంఖ్యలో దళాలను మోహరించింది. సైనిక దళాలను భారీగా మోహరించడంతో పాటు ఈ ప్రాంతానికి ఆయుధ సామాగ్రి, పలు మెటీరియల్స్‌ను తరలిస్తోంది. మరోవైపు డ్రాగన్ దూకుడుతో భారత సైన్యం తన స్ధావరాల్లో బలగాలను పెంచడంతో పాటు సుఖోయ్-30, ఎంఐజీలతో సహా పలు యుద్ధ విమానాలను సిద్ధం చేసిందని సమాచారం. ఇక ఆగస్ట్ 29 రాత్రి చైనా దళాలు ఈ ప్రాంతంలోకి చొచ్చుకువచ్చి పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరాన యథాతథ స్థితిని మార్చేందుకు చేసిన ప్రయత్నాన్ని భారత దళాలు తిప్పికొట్టిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెచ్చుమీరాయి. మరోవైపు చైనా దూకుడుతో అప్రమత్తమైన భారత సైన్యం పాంగాంగ్ ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో అప్రమత్తమైంది. చైనా దుందుడుకు చర్యలను తిప్పికొట్టేందుకు ఆయా ప్రాంతాల్లో భారత సైన్యం అదనపు దళాలను మోహరించింది. ఈనెల ఏడున సైతం తూర్పు లడఖ్‌లో పీఎల్ఏ దళాలు భారత భూభాగం వైపు చొచ్చుకువచ్చి గాలిలోకి కాల్పులు జరిగిన అనంతరం భారత్ దీటుగా బదులివ్వడంతో డ్రాగన్ సేన తోకముడిచింది. పీఎల్ఏ ఏకంగా కాల్పులకు తెగబడటం చైనా దుస్సాహస్సాన్ని వెల్లడించింది. భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు కాల్పుల స్థాయికి చేరడం ఆందోళనకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఇరుదేశాల రక్షణ శాఖల మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జనరల్ వీ ఫెంగ్ నిర్ణయించిన మూడు రోజులకే ఈ కాల్పుల ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇక పాంగాంగ్ ప్రాంతంలో చైనా సేనల కదలికలు కొనసాగుతుండటంతో భారత సైన్యం సైతం అప్రమత్తమైంది. చదవండి : సరిహద్దుల్లో బాహాబాహీ : మళ్లీ రెచ్చిపోయిన డ్రాగన్ -
సరిహద్దుల్లో బాహాబాహీ : మళ్లీ రెచ్చిపోయిన డ్రాగన్
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు ప్రతిష్టంభనపై భారత్-చైనాల మధ్య చర్చలు జరుగుతుండగానే దుందుడుకుగా వ్యవహరిస్తున్న డ్రాగన్ మరోసారి రెచ్చిపోయింది. సోమవారం రాత్రి కాల్పులకు తెగబడిన చైనా సైనికులు మంగళవారం రెజాంగ్ లా హైట్స్ వద్ద భారత దళాలతో తలపడ్డారు. పర్వత ప్రాంతంపై ఉన్న భారత దళాలను తరిమికొట్టి అక్కడ పాగావేయాలనే దుర్నీతితో చైనా సైనికులు భారత జవాన్లతో తలపడ్డారు. ఇక భారత్-చైనా సరిహద్దుల వద్ద తుపాకులు వాడరాదన్న ఒప్పందాలకు తూట్లుపొడుస్తూ సోమవారం రాత్రి లడఖ్‌లో నియంత్రణ రేఖ వెంబడి భారత స్ధావరాలపై చైనా సైనికులు కాల్పులు జరిపారు. భారత దళాలు డ్రాగన్ దాడిని తిప్పికొట్టేందుకు కాల్పులు చేపట్టాయి. ఇరు దళాల మధ్య కొద్దిసేపు కాల్పులు జరిగిన అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చిందని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. కాల్పులతో కవ్వించిన చైనా మంగళవారం మరోసారి భారత దళాలతో ఘర్షణకు తెగబడటాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. చదవండి : భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తత.. అర్ధరాత్రి కాల్పులు సీసీఎస్ భేటీ రెజాంగ్ లా ప్రాంతంలో భారత దళాలతో చైనా సైన్యం ఘర్షణలకు దిగినా ఇరు దళాల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు చైనా దూకుడు నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశం జరగనుంది. సరిహద్దుల్లో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. -
భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు
-
చైనాకు చెక్ పెట్టేందుకు ఎందాకైనా!
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లో ప్యాంగాంగ్ ప్రాంతంలోకి చొచ్చుకువచ్చిన చైనా సైన్యాన్ని భారత దళాలు తిప్పికొట్టిన అనంతరం డ్రాగన్ దూకుడుకు చెక్ పెట్టేందుకు సైన్యం అప్రమత్తమైంది. చైనా కవ్వింపులపై తీవ్రంగా స్పందించాలని, డ్రాగన్ ఎత్తులను చిత్తుచేయాలని పదాతిదళాలకు విస్పష్ట ఆదేశాలు రావడంతో సరిహద్దుల్లో సైన్యం సర్వసన్నద్ధమైంది. సరిహద్దు ప్రతిష్టంభనపై ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్య చర్చలకు అవకాశం ఉన్నా చైనా దళాల దుందుడుకు చర్యలతో చుషుల్ సెక్టార్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక మీడియా ద్వారా మానసిక యుద్ధనీతిని చైనా సైనిక వ్యూహంగా ముందుకొస్తోంది. ఎల్ఏసీని మార్చేందుకు చైనా దళాలు తెగబడితే దీటుగా తిప్పికొట్టేందుకు భారత సైన్యం పదాతిదళాలు, సాయుధ దళాలు సన్నద్ధమయ్యాయి. లడఖ్ బోర్డర్‌పై భారత సైన్యం పరిస్ధితిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాస్కోలో ఎస్సీఓ సదస్సు నేపథ్యంలో చైనా రక్షణ మంత్రికి స్పష్టం చేశారు. సరిహద్దు ప్రతిష్టంభనను శాంతి ఒప్పందాల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా భావిస్తే ఇరు దేశాల మధ్య ప్రత్యేక ప్రతినిధుల భేటీ జరిగే అవకాశం ఉంది. అయితే క్షేత్రస్ధాయిలో మాత్రం చైనా దూకుడు పెంచడం ఆందోళన రేకెత్తిస్తోంది. జూన్ 15న గల్వాన్ లోయలో ఘర్షణల అనంతరం ఇరు దేశాల మధ్య సంప్రదింపులు సాగుతుండగానే సరిహద్దుల్లో చైనా సైనికుల సంఖ్య 60 శాతం పైగా పెరిగింది. మరోవైపు నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసే వరకూ చైనా దుందుడుకు చర్యలు కొనసాగుతాయని డ్రాగన్ పరిశీలకులు పేర్కొంటున్నారు. అమెరికాతో భారత్ సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నందుకే చైనా వ్యూహాత్మకంగానే గల్వాన్, ప్యాంగాంగ్ ప్రాంతాల్లో కవ్వింపులకు దిగిందని చెబుతున్నారు. ఇక అమెరికాలో నాయకత్వ మార్పుపై స్పష్టత, నూతన పాలకులు డ్రాగన్ పట్ల అనుసరించే వైఖరి ఆధారంగా చైనా తదుపరి వ్యూహానికి పదునుపెట్టవచ్చని భావిస్తున్నారు. ఇక భారత్ మాత్రం సరిహద్దు వివాదానికి శాంతియుత పరిష్కారానికి సంప్రదింపులకు మొగ్గుచూపుతూనే ఎల్ఏసీ వెంబడి భారీగా దళాల మోహరింపుతో సన్నద్ధంగా ఉంది. చదవండి : ఎల్ఏసీని గౌరవించాలి -
సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు వివాదానికి తెరదించేందుకు ఓవైపు సంప్రదింపులు సాగుతున్నా తోకజాడిస్తున్న చైనాకు బుద్ధిచెప్పేందుకు భారత్ సంసిద్ధమైంది. డ్రాగన్ సైన్యం హద్దు మీరితే బుద్ధిచెప్పేందుకు భారీఎత్తున దళాలు, ట్యాంకులతో సన్నద్ధమైంది. ఇరు పక్షాలు ఎల్ఏసీ వద్ద పెద్దసంఖ్యలో మోహరించడంతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు సరిహద్దు వెంబడి భారత్-చైనా ఉద్రిక్తతలు పెచ్చుమీరడంతో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. ఇండో-చైనా, భారత్-నేపాల్, భారత్-భూటాన్ సరిహద్దుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రిత్వ శాఖ భద్రతా దళాలను ఆదేశించింది. చైనా సరిహద్దుల్లో నిఘాను, పెట్రోలింగ్ తీవ్రతరం చేయాలని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సహస్ర సీమా బల్ (ఎస్ఎస్బీ)లను కోరాయి. చదవండి : భారత్, చైనా మిలటరీ చర్చలు ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, లడఖ్, సిక్కిం సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఐటీబీపీని ప్రభుత్వం ఆదేశించింది. దీంతోపాటు ఇండియా-నేపాల్-చైనా ట్రై జంక్షన్, ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ ప్రాంతంలో నిఘాను ముమ్మరం చేయాలని ఎస్ఎస్బీ, ఐటీబీపీలకు స్పష్టం చేసింది. హోంమంత్రిత్వ శాఖ, బోర్డర్ మేనేజ్మెంట్ కార్యదర్శి, ఐటీబీపీ, ఎస్ఎస్బీ అధికారులతో బుధవారం జరిగిన అత్యున్నత స్ధాయి సమీక్షా సమావేశంలో ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, తూర్పు లడఖ్‌లోని ప్యాంగ్యాంగ్ త్సో ప్రాంతంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాల ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఎల్ఏసీ వెంబడి యథాతథ స్ధితిని మార్చేందుకు చైనా విఫలయత్నం చేసిన నేపథ్యంలో సరిహద్దు వెంబడి వ్యూహాత్మక ప్రాంతాల్లో భారత సైన్యం పెద్ద ఎత్తున దళాలను మోహరించింది. సైనిక చర్చలు కొనసాగుతుండగానే మంగళవారం కూడా చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇక సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్-చైనాల మధ్య చుషుల్‌లో మంగళవారం ప్రారంభమైన బ్రిగేడ్ కమాండర్ స్ధాయి చర్చలు కొనసాగుతున్నాయి. -
తాళ్లు, ట్రెక్కింగ్ పరికరాలతో చొచ్చుకువచ్చారు
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు ప్రతిష్టంభనపై భారత్-చైనాల మధ్య సైనిక కమాండర్ల స్ధాయిలో చర్చల ప్రక్రియ సాగుతుండగానే డ్రాగన్ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఎల్ఏసీ వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి చైనా సైనికులు ప్రయత్నించినట్లు గుర్తించిన భారత సైన్యం డ్రాగన్ చర్యలను తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. చైనా సేనలు తాళ్లు, ట్రెక్కింగ్ పరికరాలను ఉపయోగించి తూర్పు లడఖ్‌లోని ప్యాంగ్యాంగ్ త్సో సరస్సు ప్రాంతంలోకి చొచ్చుకువచ్చినట్టు తెలిసింది. ప్యాంగ్యాంగ్లోని తాకుంగ్ ప్రాంతంలో దాదాపు 500 మంది డ్రాగన్ సైనికులు గుమికూడారు. చైనా కదలికలను అప్పటికే పసిగట్టిన భారత సైన్యం దీటుగా స్పందించడంతో భారత బలగాల ధాటికి చైనా సైనికులు తోకముడిచారు. చైనా దుస్సాహసాన్ని భారత్ సైనికులు తిప్పికొట్టిన క్రమంలో ఇరు పక్షాల మధ్య కాల్పులు చోటుచేసుకోలేదు. గల్వాన్ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించిన ఘటన నేపథ్యంలో రెండున్నర నెలల తర్వాత చైనా మరోసారి కుయుక్తికి పాల్పడింది. ఎల్ఏసీ వెంబడి యథాతథ స్థితిని మార్చేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రయత్నిస్తోందని భారత సైన్యాన్ని నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను భారత జవాన్లు దీటుగా తిప్పికొడుతున్నారు. మరోవైపు సరిహద్దు ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరు దేశాల బ్రిగేడ్ కమాండర్ స్ధాయి చర్చలు భారత్ భూభాగంలోని చుషుల్‌లో మంగళవారం ప్రారంభమయ్యాయి. చదవండి : దుస్సాహసానికి దిగితే డ్రాగన్‌కు బుద్ధి చెబుతాం! -
దుస్సాహసానికి దిగితే డ్రాగన్‌కు బుద్ధి చెబుతాం!
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్ ప్యాంగ్యాంగ్ త్సో సరస్సు ప్రాంతాల్లో చైనా దళాల కదలికలకు కొద్ది రోజుల ముందే సరిహద్దు సమీపంలో చైనా వాయుసేన అత్యాధునిక జే-20 యుద్ధవిమానాలను తిరిగి మోహరించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఇప్పటికీ చైనా యుద్ధవిమానాలు విస్తృతంగా కదులుతున్నాయని అధికారులు తెలిపినట్టు ఓ జాతీయ వెబ్సైట్ పేర్కొంది. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ హాటన్ ఎయిర్‌బేస్ నుంచి డ్రాగన్ జే-20ల కదలికలు సాగుతున్నాయని, ఇక్కడే వ్యూహాత్మక బాంబర్, ఇతర యుద్ధవిమానాలను చైనా మోహరించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత రక్షణ రంగ అమ్ములపొదిలో ఇటీవల రఫేల్ యుద్ధవిమానాలు చేరిన నేపథ్యంలో లడఖ్ సమీపంలోని ఎయిర్‌బేస్‌ల వద్ద చైనా వాయుసేన అత్యాధునిక జే-20 యుద్ధ విమానాలను తిరిగి మోహరించడం గమనార్హం. దుస్సాహసానికి దిగితే భంగపాటు తప్పదు చైనా వాయుసేన కార్యకలాపాలను భారత వైమానిక దళం, ఇతర నిఘా సంస్థలు పసిగడుతున్నాయని, డ్రాగన్ ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా తిప్పికొట్టేందుకు భారత్ సన్నద్ధంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఎల్ఏసీ వెంబడి ఏడు చైనా ఎయిర్ బేస్‌లపై భారత్ ఓ కన్నేసి ఉంచింది. చైనా తన వ్యూహాత్మక ఎయిర్‌బేస్‌లను ఇటీవల అప్‌గ్రేడ్ చేసిందని, ఆయా ఎయిర్‌బేస్‌ల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ షెల్టర్లు నిర్మించడంతో పాటు రన్‌వే పొడవును విస్తరించిందని, సైనిక, మానవవనరులను మోహరించిందని అధికారులు తెలిపారు. జిన్జియాంగ్, టిబెట్ అటానమస్ సైనిక ప్రాంతంలోని ఏడు చైనా సైనిక స్ధావరాలపై శాటిలైట్లు, ఇతర పరికరాలతో విస్తృత నిఘాను ముమ్మరం చేశామని చెప్పారు. చదవండి : మా దళాలు ఎల్ఏసీని దాటలేదు: చైనా కాగా, సరిహద్దుల్లో తాజాగా కవ్వింపు చర్యలకు దిగిన చైనా ఆర్మీకి భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. తూర్పు లదాఖ్, ప్యాంగ్యాంగ్ త్సో సరస్సు ప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన డ్రాగన్ సైనికుల కుయుక్తులను తిప్పికొట్టింది. బలగాల ఉపసంహరణ చర్చల ఒప్పందాన్ని ఉల్లంఘించిన పొరుగు దేశానికి గట్టిగా బుద్ధి చెప్పింది. ఈ నేపథ్యంలో దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే చర్చల ద్వారా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది -
డ్రాగన్ కుతంత్రం
-
సరిహద్ధు ఘర్షణ : అసలేం జరిగింది.?
శ్రీనగర్ : తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనాల మధ్య సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో కల్నల్ సహా 20 మంది భారత జవాన్లు మరణించిన ఘటనపై భిన్న కథనాలు, పరస్పర విరుద్ధ అంశాలు ప్రచారంలో ఉండగా అసలు భారత్, చైనా సైనికుల ముఖాముఖికి దారితీసిన పరిస్థితులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. గల్వాన్ లోయలో ఇరు దళాల సైనికుల మధ్య మూడు వేర్వేరు సమయాల్లో భిన్న ప్రాంతాల్లో ఈ ఘర్షణలు చెలరేగాయని ఇండియా టుడే కథనం పేర్కొంది. ఘర్షణలకు పదిరోజుల ముందు సరిహద్దు వివాదంపై ఇరు దేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్ధాయి సంప్రదింపులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో గల్వాన్ నది సమీపంలో భారత్ భూభాగంలో చైనా ఏర్పాటు చేసిన టెంట్‌ను తొలగించేందుకు డ్రాగన్ అంగీకరించింది. చర్చల అనంతరం కొద్దిరోజుల తర్వాత ఈ పోస్ట్‌ను చైనా ధ్వంసం చేసింది. ఈ ప్రాంతంలో భారత దళాలకు ప్రాతినిథ్యం వహించే 16 బిహార్ ఇన్ఫాంట్రీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బీ సంతోష్‌బాబు చైనా కమాండర్‌తో సైతం చైనా పోస్ట్‌ను ధ్వంసం చేసిన మరుసటి రోజు మాట్లాడారు. అయితే జూన్ 14న రాత్రికిరాత్రే ఈ పోస్ట్ మళ్లీ ప్రత్యక్షమైంది. మాట్లాడేందుకు వెళితే.. ఇక జూన్ 15 సాయంత్రం 5 గంటలకు కల్నల్ సంతోష్ బాబు తన బృందంతో స్వయంగా చైనా క్యాంప్ వద్దకు బయలుదేరారు. కొద్దిరోజుల కిందటే పొరుగుదేశం కమాండర్‌తో మాట్లాడిన క్రమంలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునుందుకు టీంతో అక్కడికి వెళ్లారు. సహజంగా ఇలాంటివి పరిశీలించేందుకు మేజర్ స్ధాయి అధికారిని పంపే సంప్రదాయం ఉన్నా ఈ విషయాన్ని యూనిట్లో యువకులకు అప్పగించరాదని తానే ముందుండి నడవాలని నిర్ణయించుకున్నారు. అక్కడ అప్పటికి ఇరు దేశాల సైనికుల మధ్య స్నేహపూరిత వాతావరణమే ఉండటం గమనార్హం. 16 బిహార్ దళంలో సభ్యులందరూ చైనా సేనలకు సుపరిచితులే. అయితే అక్కడికి వెళ్లిన సంతోష్ బాబు బృందానికి డ్రాగన్ సేనల్లో అన్నీ కొత్తముఖాలే కనబడటంతో ఆశ్చర్యపోయారు. ఈ ప్రాంతంలో తొలగించిన పోస్ట్‌ను మళ్లీ ఎందుకు ఏర్పాటు చేశారని చైనా సేనలను ప్రశ్నించగా, ఓ చైనా జవాన్ ముందుకొచ్చి కల్నల్ సంతోష్ బాబును చైనా భాషలో అరుస్తూ గట్టిగా వెనక్కితోసివేయడంతో ఇరు పక్షాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇరు దళాల మధ్య ఎలాంటి ఆయుధాలు లేకుండా 30 నిమిషాల పాటు తొలి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే చైనా పోస్ట్‌ను భారత సైనికులు ధ్వంసం చేశారు. చైనా కొత్త ముఖాలను అక్కడకు దించడం, తనపైనే డ్రాగన్ సైనికుడు దాడికి దిగడంతో అక్కడ ప్రత్యర్థి సేనలు పెద్దసంఖ్యలో మోహరించాయని సందేహించిన సంతోష్ బాబు గాయపడిన సైనికులను వెనక్కుపంపి మరికొందరు సైనికులను పంపాలని కోరారు. కొత్తగా మోహరించిన చైనా దళాలు సంతోష్ బాబు బృందాన్ని గట్టిగా నిలువరించి వెనక్కు పంపాయి. కొద్దిసేపటికే సంతోష్‌బాబు సారథ్యంలో భారత జవాన్ల బృందం సరిహద్దు ఆవల డ్రాగన్ సేనల కదలికలను పసిగట్టేందుకు చైనా వైపు దూసుకెళ్లడంతో రెండోసారి ఇరు దళాల మధ్య గంటపాటు ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దశలోనే ఎక్కువ మరణాలు చోటుచేసుకున్నాయి. తమ అధికారిపై చైనా జవాన్ చేయిచేసుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భారత జవాన్లు డ్రాగన్ బృందంపై విరుచుకుపడ్డారు. రాళ్లు, ఇనుపరాడ్లతో స్వైరవిహారం చుట్టూ చీకటి, ప్రతికూల వాతావరణంలో కల్నల్ సంతోష్ బాబు ఊహించిందే ఎదురైంది. పెద్దసంఖ్యలో చైనా సైనికులు గల్వాన్ నదికి ఇరువైపులా మోహరించారు. భారత సైన్యం కంటపడగానే డ్రాగన్ మూకలు రాళ్ల దాడికి తెగబడ్డాయి. సరిగ్గా రాత్రి 9 గంటల ప్రాంతంలో పెద్ద రాయి కల్నల్ సంతోష్ బాబు తలకు తగిలింది. దీంతో ఆయన గల్వాన్ నదిలో పడిపోయారు. దాదాపు 300 మంది పరస్పరం భిన్నప్రాంతాల్లో తలపడుతూ సాగిన ఈ ఘర్షణలో ఇరు వైపులా ప్రాణనష్టం వాటిల్లింది. గంటపాటు సాగిన ఘర్షణ ముగిసిన తర్వాత కల్నల్ సంతోష్ బాబు సహా ఇరు సేనల మృతదేహాలు గల్వాన్ నదిలో తేలాయి. చిమ్మచీకటిలో ఇనుపతీగలు చుట్టిన రాడ్లతో డ్రాగన్ సేనలు ఈ విధ్వంసకాండలో భారత జవాన్లను దొంగదెబ్బతీశాయి. రాత్రి 11 గంటల వరకూ ఈ ఘర్షణలు చోటుచేసుకోగా ఇరు పక్షాల నుంచి గాయపడిన, మరణించిన సైనికులను భారత్-చైనా తమ భూభాగాల వైపు తీసుకువెళ్లాయి. కల్నల్ సంతోష్ బాబును చైనా దళాలు పొట్టనపెట్టుకోవడంతో రగిలిన భారత జవాన్లు వాస్తవాధీన రేఖ వైపు చైనా సేనలు రాకుండా నిలువరించేందుకు సిద్ధమవుతుండగా చైనా డ్రోన్ కదలికలు మూడో ఘర్షణకు దారితీశాయి. వాస్తవాధీన రేఖ వెలుపల చైనా వైపు ఈ ఘర్షణ దాదాపు అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగింది. ఈ ఘర్షణలో ఇరు దళాల సైనికులు ఇరుకైన గల్వాన్ నదిలో పడిపోగా మరికొందరిపై రాళ్లు పడటంతో గాయాలయ్యాయి. ఈ ఘర్షణల్లో చైనా వైపు కూడా 20 మందికి పైగా సైనికులు మరణించారని భావిస్తున్నారు. కాగా మరుసటి రోజు సూర్యోదయం కాగానే భారత సేనలు వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ వైపుకు తిరిగిరాగా ఇరు దేశాల సైనికాధికారులు తమ సైనికుల అప్పగింతపై సమాలోచనలకు సిద్ధమయ్యారు. -
సరిహద్దు వివాదం: ముగిసిన చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో సరిహద్దు ఉద్రిక్తతలను నివారించేందుకు గురువారం ఆరుగంటల పాటు సాగిన ఇరు దేశాల మేజర్ జనరల్ స్ధాయి చర్చలు ముగిశాయి. గాల్వన్ లోయలో సాధారణ స్ధితి నెలకొనేలా చూడటంతో పాటు సరిహద్దుల నుంచి సేనల ఉపసంహరణపై వరుసగా మూడోరోజూ ఇరు దేశాల సీనియర్ సైనికాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. గాల్వన్ లోయలో సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణలో కల్నల్ బీ. సంతోష్‌బాబు సహా 20 మంది భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. కాగా గత రెండు రోజులుగా గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికాధికారుల మధ్య జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనగా తాజా చర్చల సారాంశం ఇంకా తెలియరాలేదు. మరోవైపు డ్రాగన్ సైన్యంతో జరిగిన ఘర్షణల్లో 20 మంది సైనికులు మరణించడం, మరో 18 మంది జవాన్లకు గాయాలవడం మినహా ఏ ఒక్కరి ఆచూకీ గల్లంతు కాలేదని సైనిక వర్గాలు తెలిపాయి. ఇక చైనా దూకుడు తగ్గించకుంటే దౌత్యం యుద్ధం తప్పదని, ఆ దేశ వస్తువుల బహిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
సరిహద్దుల్లో ఘర్షణ : అమర జవాన్లు వీరే..
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లోని గాల్వన్ లోయలో సోమవారం రాత్రి చైనా దళాలతో జరిగిన ఘర్షణల్లో మరణించిన 20 మంది సైనికుల పేర్లను భారత సైన్యం విడుదల చేసింది. తొలుత ఈ ఘర్షణలో కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మరణించారని వెల్లడించిన సైన్యం ఆపై తీవ్రంగా గాయపడిన మరో 17 మంది ప్రతికూల వాతావరణ పరిస్థితులు తోడవడంతో మరణించారని తెలిపింది. చదవండి: వారి త్యాగానికి దేశం గర్విస్తోంది: మోదీ మరణించిన సైనికులు వీరే.. కల్నల్ బీ. సంతోష్ బాబు నుదురమ్ సోరెన్ మందీప్ సింగ్ సత్నాం సింగ్ కే. పళని సునీల్ కుమార్ విపుల్ రాయ్ దీపక్ కుమార్ రాజేష్ ఒరాంగ్ కుందన్ కుమార్ ఓజా గణేష్ రామ్ చంద్రకాంత ప్రధాన్ అంకుష్ గుర్వీందర్ గుర్తేజ్ సింగ్ చందన్ కుమార్ కుందన్ కుమార్ అమన్ కుమార్ జై కిషోర్ సింగ్ గణేష్ హంస్ధా -
సరిహద్దు వివాదం : డ్రాగన్ కుయుక్తి
బీజింగ్ : లడఖ్ ప్రాంతంలోని గాల్వన్ లోయలో భారత్-చైనాలు ముఖాముఖి తలపడిన అనంతరం డ్రాగన్ ఆర్మీ అధికారికంగా స్పందించింది. ఘర్షణలకు భారత్‌ను నిందిస్తూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కుయుక్తులకు దిగింది. భారత్ ఉద్దేశపూర్వకంగా కవ్వింపు దాడులకు పాల్పడిందని పేర్కొంది. గాల్వన్ లోయ ప్రాంతంపై సార్వభౌమాధికారం చైనాకే ఉందని చైనా సైనిక ప్రతినిధి కల్నల్ జాంగ్ సులిల్ వ్యాఖ్యానించారు. భారత్ కవ్వింపు చర్యలను పక్కనపెట్టి చైనాతో చర్చల్లో పాలుపంచుకుని సంప్రదింపుల ద్వారా వివాదాల పరిష్కారానికి మొగ్గుచూపాలని కల్నల్ సులిల్ పేర్కొన్నారని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అయితే ఆయన తన వాదనకు ఎలాంటి ఆధారాలను చూపకపోవడం గమనార్హం. సరిహద్దు ఘర్షణలో ఇరు దేశాల సైనికులు ఎందరు మరణించారనే వివరాలనూ వెల్లడించలేదు. కాగా గాల్వన్ లోయలో సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో ఓ సైనికాధికారితో పాటు ఇద్దరు జవాన్లు మరణించారని భారత్ పేర్కొంది. చదవండి : చైనాతో ఘర్షణ: తెలంగాణ ఆర్మీ అధికారి మృతి -
మా సైనికులూ మరణించారు: చైనా
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దుల్లో భారత్, చైనా సేనల మధ్య ఘర్షణలు చెలరేగిన క్రమంలో ఉద్రిక్తతలు నివారించేందుకు ఇరు దేశాల సైనిక కమాండర్లు మంగళవారం సమావేశమయ్యారు. తూర్పు లడఖ్‌లో సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికులు ముఖాముఖి తలపడటంతో భారత్‌కు చెందిన ఓ కల్నల్, ఇద్దరు జవాన్లు మరణించిన క్రమంలో నాలుగు దశాబ్ధాల అనంతరం భారత్-చైనాల మధ్య ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారి. లడఖ్‌లోని గాల్వన్ లోయలో సైనికులు వెనుతిరిగే ప్రక్రియ చోటుచేసుకుంటున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని భారత సైన్యం వెల్లడించింది. ఘర్షణల్లో భారత జవాన్లతో పాటు తమ సైనికులూ మరణించారని చైనా మీడియా పేర్కొంది. సంప్రదింపులు షురూ.. సరిహద్దుల్లో అలజడిని నివారించేందుకు ఇరు దేశాలకు చెందిన సీనియర్ సైనికాధికారులు చర్చలు జరుపుతున్నారని పేర్కొంది. ఘర్షణ జరిగిన ప్రాంతంలో కరూకు చెందిన హెచ్క్యూఎస్ 3 ఇన్ఫ్రాంట్రీ డివిజన్ కమాండర్ మేజర్ జనరల్ అభిజిత్ బాపట్ చైనా కమాండర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని భారత సైన్యం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లడఖ్‌లో పరిస్ధితిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, త్రివిధ దళాధిపతులు, సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌లతో చర్చించారు. కాగా సరిహద్దు ఘర్షణలో మరణించిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు తెలంగాణకు చెందిన సూర్యాపేట వాసి కావడం గమనార్హం. డ్రాగన్ కుయుక్తులు సరిహద్దు ఉద్రిక్తతలను నివారించేందుకు దళాల ఉపసంహరణపై చర్చలు జరిగిన అనంతరం భారత సైన్యం చైనా సైనికులపై కవ్వింపు చర్యలకు దిగి దాడికి పాల్పడిందని చైనా ఆరోపించింది. భారత్ దూకుడు వల్లే ఇరు దళాల సైనికుల మధ్య బాహాబాహికి దారితీసిందని ఎదురుదాడికి దిగింది. మరోవైపు సరిహద్దుల్లో భారత్-చైనా సైనికులు ముఖాముఖి తలపడిన ఘటనలో భారత కల్నల్, ఇద్దరు జవాన్లు మరణించిన ఘటనపై తమకు సమాచారం లేదని చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. సరిహద్దు వివాదాన్ని చర్చలతో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝా లిజియన్ చెప్పారు. ఈ దిశగా ఈనెల 6న ఇరు దేశాల సైనికాధికారుల స్ధాయి చర్చలు ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. చదవండి: ఇండో చైనా సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత -
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారత్, పాక్ సరిహద్దులో మరోసారి ఆందోళనకర వాతావరణం, మిడ్ క్యాప్ కరెక్షన్ తో స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 63.61 పాయింట్ల నష్టంలో 30,301.64 వద్ద, నిఫ్టీ 25.60 పాయింట్ల నష్టంలో 9,360 వద్ద క్లోజయ్యాయి. నేటి ట్రేడింగ్ లో టాటా మోటార్స్ టాప్ గెయినర్ గా లాభాలు పండించడంతో 'స్టాక్ ఆఫ్ ది డే'గా నిలిచింది. అంచనావేసిన దానికంటే మెరుగైన ఫలితాలు ప్రకటించడంతో టాటా మోటార్స్ స్టాక్ 4.44 శాతం మేర దూసుకెళ్లింది. టాటా మోటార్స్ తో పాటు టాటా మోటార్స్ డీవీర్, గెయిల్ షేర్లు రెండు సూచీల్లో లాభాలు పండించాయి. బీహెచ్ఈఎల్, లార్సెన్ అండ్ టర్బో, బ్యాంకు ఆఫ్ బరోడా, భారతీ ఇన్ ఫ్రాటెల్ లు నష్టాలు గడించాయి. నేటి సెషన్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్, ఫార్మా, రియల్ ఎస్టేట్ స్టాక్ లే ఎక్కువగా నష్టపోయినట్టు తెలిసింది. పాకిస్తాన్ తో ఉన్న నియంత్రణ రేఖ వెంబడి మరోసారి క్రాస్ బోర్డర్ టెన్షన్ నెలకొనడంతో ఎస్ అండ్ పీ బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రెండు సూచీలు 1 శాతం పైగా పడిపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు గత ఆరు నెలలుగా లాభాల దిశగా పయనిస్తున్నాయని, ఈ గరిష్ట స్థాయిల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉంటుందనీ విశ్లేషకులు చెప్పారు. అదేవిధంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 64.83గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 96 రూపాయల నష్టంతో 28,751గా నమోదయ్యాయి. -
సరిహద్దులో మళ్లీ టెన్షన్: మార్కెట్లు క్రాష్
పాకిస్తాన్ పోస్టులపై భారత ఆర్మీ జరిపిన దాడులతో సరిహద్దులో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో దేశీయ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. సెన్సెక్స్ 205.72 పాయింట్లు క్రాష్ అయి 30,365 వద్ద, నిఫ్టీ 52.10 పాయింట్లు నష్టపోయి 9,400 మార్కుకు దిగువన 9,386 వద్ద ముగిసింది. 20,21 తేదీల్లో కశ్మీర్ నౌషేరా సెక్టార్ లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ శిబిరాలను టార్గెట్ గా చేసుకుని దాడులు జరిపినట్టు భారత ఆర్మీ వెల్లడించింది. ఈ దాడిలో పాకిస్తాన్‌కు చెందిన పలు సైనిక శిబిరాలు పూర్తిగా ధ్వంసమైనట్టు పేర్కొంది. మార్కెట్లో ట్రేడింగ్ ముగియడానికి అరగంట ముందు ఈ దాడులు విషయాన్ని భారత ఆర్మీ రివీల్ చేయడంతో దేశీయ సూచీలు క్రాష్ అయ్యాయి. అంతేకాక ఫార్మా, రియాల్టీ స్టాక్స్ లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో కూడా మార్కెట్లు పడిపోయాయి. సన్ ఫార్మా, సిప్లా రెండు సూచీల్లో టాప్ లూజర్లుగా ఉన్నాయి. అదానీ పోర్ట్స్ కూడా 6 శాతం మేర నష్టపోయింది. మారుతీ సుజుకీ, మహింద్రా అండ్ మహింద్రా, ఐషర్ మోటార్స్, హిందాల్కోలు లాభాలు పండించాయి. మరోవైపు అంతర్జాతీయంగానూ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా 22 పైసలు మేర నష్టపోయి, 64.77 వద్ద నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 83 రూపాయల లాభంలో 28,868గా ట్రేడయ్యాయి. -
బోర్డర్...టెన్షన్