శ్రీనగర్ : తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనాల మధ్య సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో కల్నల్ సహా 20 మంది భారత జవాన్లు మరణించిన ఘటనపై భిన్న కథనాలు, పరస్పర విరుద్ధ అంశాలు ప్రచారంలో ఉండగా అసలు భారత్, చైనా సైనికుల ముఖాముఖికి దారితీసిన పరిస్థితులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. గల్వాన్ లోయలో ఇరు దళాల సైనికుల మధ్య మూడు వేర్వేరు సమయాల్లో భిన్న ప్రాంతాల్లో ఈ ఘర్షణలు చెలరేగాయని ఇండియా టుడే కథనం పేర్కొంది. ఘర్షణలకు పదిరోజుల ముందు సరిహద్దు వివాదంపై ఇరు దేశాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్ధాయి సంప్రదింపులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో గల్వాన్ నది సమీపంలో భారత్ భూభాగంలో చైనా ఏర్పాటు చేసిన టెంట్‌ను తొలగించేందుకు డ్రాగన్ అంగీకరించింది. చర్చల అనంతరం కొద్దిరోజుల తర్వాత ఈ పోస్ట్‌ను చైనా ధ్వంసం చేసింది. ఈ ప్రాంతంలో భారత దళాలకు ప్రాతినిథ్యం వహించే 16 బిహార్ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బీ సంతోష్‌బాబు చైనా కమాండర్‌తో సైతం చైనా పోస్ట్‌ను ధ్వంసం చేసిన మరుసటి రోజు మాట్లాడారు. అయితే జూన్ 14న రాత్రికిరాత్రే ఈ పోస్ట్ మళ్లీ ప్రత్యక్షమైంది.
మాట్లాడేందుకు వెళితే..
ఇక జూన్ 15 సాయంత్రం 5 గంటలకు కల్నల్ సంతోష్ బాబు తన బృందంతో స్వయంగా చైనా క్యాంప్ వద్దకు బయలుదేరారు. కొద్దిరోజుల కిందటే పొరుగుదేశం కమాండర్‌తో మాట్లాడిన క్రమంలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకునుందుకు టీంతో అక్కడికి వెళ్లారు. సహజంగా ఇలాంటివి పరిశీలించేందుకు మేజర్ స్ధాయి అధికారిని పంపే సంప్రదాయం ఉన్నా ఈ విషయాన్ని యూనిట్‌లో యువకులకు అప్పగించరాదని తానే ముందుండి నడవాలని నిర్ణయించుకున్నారు. అక్కడ అప్పటికి ఇరు దేశాల సైనికుల మధ్య స్నేహపూరిత వాతావరణమే ఉండటం గమనార్హం. 16 బిహార్ దళంలో సభ్యులందరూ చైనా సేనలకు సుపరిచితులే. అయితే అక్కడికి వెళ్లిన సంతోష్ బాబు బృందానికి డ్రాగన్ సేనల్లో అన్నీ కొత్తముఖాలే కనబడటంతో ఆశ్చర్యపోయారు. ఈ ప్రాంతంలో తొలగించిన పోస్ట్‌ను మళ్లీ ఎందుకు ఏర్పాటు చేశారని చైనా సేనలను ప్రశ్నించగా, ఓ చైనా జవాన్ ముందుకొచ్చి కల్నల్ సంతోష్ బాబును చైనా భాషలో అరుస్తూ గట్టిగా వెనక్కితోసివేయడంతో ఇరు పక్షాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఇరు దళాల మధ్య ఎలాంటి ఆయుధాలు లేకుండా 30 నిమిషాల పాటు తొలి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే చైనా పోస్ట్‌ను భారత సైనికులు ధ్వంసం చేశారు.
చైనా కొత్త ముఖాలను అక్కడకు దించడం, తనపైనే డ్రాగన్ సైనికుడు దాడికి దిగడంతో అక్కడ ప్రత్యర్థి సేనలు పెద్దసంఖ్యలో మోహరించాయని సందేహించిన సంతోష్ బాబు గాయపడిన సైనికులను వెనక్కుపంపి మరికొందరు సైనికులను పంపాలని కోరారు. కొత్తగా మోహరించిన చైనా దళాలు సంతోష్ బాబు బృందాన్ని గట్టిగా నిలువరించి వెనక్కు పంపాయి. కొద్దిసేపటికే సంతోష్‌బాబు సారథ్యంలో భారత జవాన్ల బృందం సరిహద్దు ఆవల డ్రాగన్ సేనల కదలికలను పసిగట్టేందుకు చైనా వైపు దూసుకెళ్లడంతో రెండోసారి ఇరు దళాల మధ్య గంటపాటు ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దశలోనే ఎక్కువ మరణాలు చోటుచేసుకున్నాయి. తమ అధికారిపై చైనా జవాన్ చేయిచేసుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భారత జవాన్లు డ్రాగన్ బృందంపై విరుచుకుపడ్డారు.
రాళ్లు, ఇనుపరాడ్లతో స్వైరవిహారం
చుట్టూ చీకటి, ప్రతికూల వాతావరణంలో కల్నల్ సంతోష్ బాబు ఊహించిందే ఎదురైంది. పెద్దసంఖ్యలో చైనా సైనికులు గల్వాన్ నదికి ఇరువైపులా మోహరించారు. భారత సైన్యం కంటపడగానే డ్రాగన్ మూకలు రాళ్ల దాడికి తెగబడ్డాయి. సరిగ్గా రాత్రి 9 గంటల ప్రాంతంలో పెద్ద రాయి కల్నల్ సంతోష్ బాబు తలకు తగిలింది. దీంతో ఆయన గల్వాన్ నదిలో పడిపోయారు. దాదాపు 300 మంది పరస్పరం భిన్నప్రాంతాల్లో తలపడుతూ సాగిన ఈ ఘర్షణలో ఇరు వైపులా ప్రాణనష్టం వాటిల్లింది. గంటపాటు సాగిన ఘర్షణ ముగిసిన తర్వాత కల్నల్ సంతోష్ బాబు సహా ఇరు సేనల మృతదేహాలు గల్వాన్ నదిలో తేలాయి. చిమ్మచీకటిలో ఇనుపతీగలు చుట్టిన రాడ్లతో డ్రాగన్ సేనలు ఈ విధ్వంసకాండలో భారత జవాన్లను దొంగదెబ్బతీశాయి.
రాత్రి 11 గంటల వరకూ ఈ ఘర్షణలు చోటుచేసుకోగా ఇరు పక్షాల నుంచి గాయపడిన, మరణించిన సైనికులను భారత్-చైనా తమ భూభాగాల వైపు తీసుకువెళ్లాయి. కల్నల్ సంతోష్ బాబును చైనా దళాలు పొట్టనపెట్టుకోవడంతో రగిలిన భారత జవాన్లు వాస్తవాధీన రేఖ వైపు చైనా సేనలు రాకుండా నిలువరించేందుకు సిద్ధమవుతుండగా చైనా డ్రోన్ కదలికలు మూడో ఘర్షణకు దారితీశాయి. వాస్తవాధీన రేఖ వెలుపల చైనా వైపు ఈ ఘర్షణ దాదాపు అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగింది. ఈ ఘర్షణలో ఇరు దళాల సైనికులు ఇరుకైన గల్వాన్ నదిలో పడిపోగా మరికొందరిపై రాళ్లు పడటంతో గాయాలయ్యాయి. ఈ ఘర్షణల్లో చైనా వైపు కూడా 20 మందికి పైగా సైనికులు మరణించారని భావిస్తున్నారు. కాగా మరుసటి రోజు సూర్యోదయం కాగానే భారత సేనలు వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ వైపుకు తిరిగిరాగా ఇరు దేశాల సైనికాధికారులు తమ సైనికుల అప్పగింతపై సమాలోచనలకు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment