సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు ప్రతిష్టంభనపై భారత్-చైనాల మధ్య సైనిక కమాండర్ల స్ధాయిలో చర్చల ప్రక్రియ సాగుతుండగానే డ్రాగన్ దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఎల్‌ఏసీ వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి చైనా సైనికులు ప్రయత్నించినట్లు గుర్తించిన భారత సైన్యం డ్రాగన్ చర్యలను తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. చైనా సేనలు తాళ్లు, ట్రెక్కింగ్ పరికరాలను ఉపయోగించి తూర్పు లడఖ్‌లోని ప్యాంగ్‌యాంగ్ త్సో సరస్సు ప్రాంతంలోకి చొచ్చుకువచ్చినట్టు తెలిసింది. ప్యాంగ్‌యాంగ్‌లోని తాకుంగ్ ప్రాంతంలో దాదాపు 500 మంది డ్రాగన్ సైనికులు గుమికూడారు. చైనా కదలికలను అప్పటికే పసిగట్టిన భారత సైన్యం దీటుగా స్పందించడంతో భారత బలగాల ధాటికి చైనా సైనికులు తోకముడిచారు.
చైనా దుస్సాహసాన్ని భారత్ సైనికులు తిప్పికొట్టిన క్రమంలో ఇరు పక్షాల మధ్య కాల్పులు చోటుచేసుకోలేదు. గల్వాన్ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించిన ఘటన నేపథ్యంలో రెండున్నర నెలల తర్వాత చైనా మరోసారి కుయుక్తికి పాల్పడింది. ఎల్‌ఏసీ వెంబడి యథాతథ స్థితిని మార్చేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రయత్నిస్తోందని భారత సైన్యాన్ని నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను భారత జవాన్లు దీటుగా తిప్పికొడుతున్నారు. మరోవైపు సరిహద్దు ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరు దేశాల బ్రిగేడ్ కమాండర్ స్ధాయి చర్చలు భారత్ భూభాగంలోని చుషుల్‌లో మంగళవారం ప్రారంభమయ్యాయి. చదవండి : దుస్సాహసానికి దిగితే డ్రాగన్‌కు బుద్ధి చెబుతాం!
Comments
Please login to add a commentAdd a comment