సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు ప్రతిష్టంభనపై భారత్-చైనాల మధ్య చర్చలు జరుగుతుండగానే దుందుడుకుగా వ్యవహరిస్తున్న డ్రాగన్ మరోసారి రెచ్చిపోయింది. సోమవారం రాత్రి కాల్పులకు తెగబడిన చైనా సైనికులు మంగళవారం రెజాంగ్ లా హైట్స్ వద్ద భారత దళాలతో తలపడ్డారు. పర్వత ప్రాంతంపై ఉన్న భారత దళాలను తరిమికొట్టి అక్కడ పాగావేయాలనే దుర్నీతితో చైనా సైనికులు భారత జవాన్లతో తలపడ్డారు.
ఇక భారత్-చైనా సరిహద్దుల వద్ద తుపాకులు వాడరాదన్న ఒప్పందాలకు తూట్లుపొడుస్తూ సోమవారం రాత్రి లడఖ్‌లో నియంత్రణ రేఖ వెంబడి భారత స్ధావరాలపై చైనా సైనికులు కాల్పులు జరిపారు. భారత దళాలు డ్రాగన్ దాడిని తిప్పికొట్టేందుకు కాల్పులు చేపట్టాయి. ఇరు దళాల మధ్య కొద్దిసేపు కాల్పులు జరిగిన అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చిందని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. కాల్పులతో కవ్వించిన చైనా మంగళవారం మరోసారి భారత దళాలతో ఘర్షణకు తెగబడటాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. చదవండి : భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తత.. అర్ధరాత్రి కాల్పులు
సీసీఎస్ భేటీ
రెజాంగ్ లా ప్రాంతంలో భారత దళాలతో చైనా సైన్యం ఘర్షణలకు దిగినా ఇరు దళాల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు చైనా దూకుడు నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశం జరగనుంది. సరిహద్దుల్లో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment