
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దుల్లో భారత్, చైనా సేనల మధ్య ఘర్షణలు చెలరేగిన క్రమంలో ఉద్రిక్తతలు నివారించేందుకు ఇరు దేశాల సైనిక కమాండర్లు మంగళవారం సమావేశమయ్యారు. తూర్పు లడఖ్‌లో సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికులు ముఖాముఖి తలపడటంతో భారత్‌కు చెందిన ఓ కల్నల్, ఇద్దరు జవాన్లు మరణించిన క్రమంలో నాలుగు దశాబ్ధాల అనంతరం భారత్-చైనాల మధ్య ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారి. లడఖ్‌లోని గాల్వన్ లోయలో సైనికులు వెనుతిరిగే ప్రక్రియ చోటుచేసుకుంటున్న క్రమంలో ఈ ఘటన జరిగిందని భారత సైన్యం వెల్లడించింది. ఘర్షణల్లో భారత జవాన్లతో పాటు తమ సైనికులూ మరణించారని చైనా మీడియా పేర్కొంది.
సంప్రదింపులు షురూ..
సరిహద్దుల్లో అలజడిని నివారించేందుకు ఇరు దేశాలకు చెందిన సీనియర్ సైనికాధికారులు చర్చలు జరుపుతున్నారని పేర్కొంది. ఘర్షణ జరిగిన ప్రాంతంలో కరూకు చెందిన హెచ్‌క్యూఎస్ 3 ఇన్‌ఫ్రాంట్రీ డివిజన్ కమాండర్ మేజర్ జనరల్ అభిజిత్ బాపట్ చైనా కమాండర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని భారత సైన్యం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లడఖ్‌లో పరిస్ధితిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, త్రివిధ దళాధిపతులు, సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌లతో చర్చించారు. కాగా సరిహద్దు ఘర్షణలో మరణించిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు తెలంగాణకు చెందిన సూర్యాపేట వాసి కావడం గమనార్హం.
డ్రాగన్ కుయుక్తులు
సరిహద్దు ఉద్రిక్తతలను నివారించేందుకు దళాల ఉపసంహరణపై చర్చలు జరిగిన అనంతరం భారత సైన్యం చైనా సైనికులపై కవ్వింపు చర్యలకు దిగి దాడికి పాల్పడిందని చైనా ఆరోపించింది. భారత్ దూకుడు వల్లే ఇరు దళాల సైనికుల మధ్య బాహాబాహికి దారితీసిందని ఎదురుదాడికి దిగింది. మరోవైపు సరిహద్దుల్లో భారత్-చైనా సైనికులు ముఖాముఖి తలపడిన ఘటనలో భారత కల్నల్, ఇద్దరు జవాన్లు మరణించిన ఘటనపై తమకు సమాచారం లేదని చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. సరిహద్దు వివాదాన్ని చర్చలతో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝా లిజియన్ చెప్పారు. ఈ దిశగా ఈనెల 6న ఇరు దేశాల సైనికాధికారుల స్ధాయి చర్చలు ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment