ప్రతీకాత్మకచిత్రం
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్ ప్యాంగ్‌యాంగ్ త్సో సరస్సు ప్రాంతాల్లో చైనా దళాల కదలికలకు కొద్ది రోజుల ముందే సరిహద్దు సమీపంలో చైనా వాయుసేన అత్యాధునిక జే-20 యుద్ధవిమానాలను తిరిగి మోహరించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఇప్పటికీ చైనా యుద్ధవిమానాలు విస్తృతంగా కదులుతున్నాయని అధికారులు తెలిపినట్టు ఓ జాతీయ వెబ్‌సైట్ పేర్కొంది. చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్ హాటన్ ఎయిర్‌బేస్ నుంచి డ్రాగన్ జే-20ల కదలికలు సాగుతున్నాయని, ఇక్కడే వ్యూహాత్మక బాంబర్, ఇతర యుద్ధవిమానాలను చైనా మోహరించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత రక్షణ రంగ అమ్ములపొదిలో ఇటీవల రఫేల్ యుద్ధవిమానాలు చేరిన నేపథ్యంలో లడఖ్ సమీపంలోని ఎయిర్‌బేస్‌ల వద్ద చైనా వాయుసేన అత్యాధునిక జే-20 యుద్ధ విమానాలను తిరిగి మోహరించడం గమనార్హం.
దుస్సాహసానికి దిగితే భంగపాటు తప్పదు
చైనా వాయుసేన కార్యకలాపాలను భారత వైమానిక దళం, ఇతర నిఘా సంస్థలు పసిగడుతున్నాయని, డ్రాగన్ ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా తిప్పికొట్టేందుకు భారత్ సన్నద్ధంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఎల్‌ఏసీ వెంబడి ఏడు చైనా ఎయిర్ బేస్‌లపై భారత్ ఓ కన్నేసి ఉంచింది. చైనా తన వ్యూహాత్మక ఎయిర్‌బేస్‌లను ఇటీవల అప్‌గ్రేడ్ చేసిందని, ఆయా ఎయిర్‌బేస్‌ల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ షెల్టర్లు నిర్మించడంతో పాటు రన్‌వే పొడవును విస్తరించిందని, సైనిక, మానవవనరులను మోహరించిందని అధికారులు తెలిపారు. జిన్‌జియాంగ్, టిబెట్ అటానమస్ సైనిక ప్రాంతంలోని ఏడు చైనా సైనిక స్ధావరాలపై శాటిలైట్లు, ఇతర పరికరాలతో విస్తృత నిఘాను ముమ్మరం చేశామని చెప్పారు. చదవండి : మా దళాలు ఎల్‌ఏసీని దాటలేదు: చైనా
కాగా, సరిహద్దుల్లో తాజాగా కవ్వింపు చర్యలకు దిగిన చైనా ఆర్మీకి భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. తూర్పు లదాఖ్, ప్యాంగ్‌యాంగ్ త్సో సరస్సు ప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించిన డ్రాగన్ సైనికుల కుయుక్తులను తిప్పికొట్టింది. బలగాల ఉపసంహరణ చర్చల ఒప్పందాన్ని ఉల్లంఘించిన పొరుగు దేశానికి గట్టిగా బుద్ధి చెప్పింది. ఈ నేపథ్యంలో దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే చర్చల ద్వారా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలికే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది
Comments
Please login to add a commentAdd a comment