
బీజింగ్ : లడఖ్ ప్రాంతంలోని గాల్వన్ లోయలో భారత్-చైనాలు ముఖాముఖి తలపడిన అనంతరం డ్రాగన్ ఆర్మీ అధికారికంగా స్పందించింది. ఘర్షణలకు భారత్‌ను నిందిస్తూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కుయుక్తులకు దిగింది. భారత్ ఉద్దేశపూర్వకంగా కవ్వింపు దాడులకు పాల్పడిందని పేర్కొంది. గాల్వన్ లోయ ప్రాంతంపై సార్వభౌమాధికారం చైనాకే ఉందని చైనా సైనిక ప్రతినిధి కల్నల్ జాంగ్ సులిల్ వ్యాఖ్యానించారు.
భారత్ కవ్వింపు చర్యలను పక్కనపెట్టి చైనాతో చర్చల్లో పాలుపంచుకుని సంప్రదింపుల ద్వారా వివాదాల పరిష్కారానికి మొగ్గుచూపాలని కల్నల్ సులిల్ పేర్కొన్నారని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అయితే ఆయన తన వాదనకు ఎలాంటి ఆధారాలను చూపకపోవడం గమనార్హం. సరిహద్దు ఘర్షణలో ఇరు దేశాల సైనికులు ఎందరు మరణించారనే వివరాలనూ వెల్లడించలేదు. కాగా గాల్వన్ లోయలో సోమవారం రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో ఓ సైనికాధికారితో పాటు ఇద్దరు జవాన్లు మరణించారని భారత్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment