బీజింగ్: పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)ని ప్రపంచంలోనే అత్యున్నత సైనిక శక్తిగా తీర్చిదిద్దాలని చైనా అధ్యక్షుడు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా అధినేత జిన్‌పింగ్ సంకల్పించారు. యుద్ధాల్లో నెగ్గడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, నిజమైన పోరాట పరిస్థితుల్లో సైన్యానికి శిక్షణ ఇవ్వాలని ఆయన చెప్పారు. జిన్‌పింగ్ తాజాగా సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) సమావేశంలో మాట్లాడారు. 20 లక్షల మంది సైన్యం ఉన్న పీఎల్‌ఏ ఈ కమిషన్ ఆధ్వర్యంలోనే పని చేస్తుంది. సీఎంసీకి జిన్‌పింగ్ చైర్మన్. చైనా సైన్యాన్ని ప్రపంచ స్థాయి సైనిక శక్తిగా మార్చాలని, ఇందుకోసం కొత్త తరహా శిక్షణా విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. ఆధునిక యుద్ధ రీతులకు అనుగుణంగా సైన్యంలో కీలక మార్పులు చేస్తున్నట్లు తెలిపారు.
6 నెలలుగా భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సరిహద్దు నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలన్న అంశంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తమ సైన్యం బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా సైన్యానికి దీటుగా తమ సైన్యాన్ని పెంచుకోవాలని చైనా కమ్యూనిస్టు పార్టీ ఇటీవల తీర్మానించింది. 2027 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. 2020లో సైన్యంపై 179 బిలియన్ డాలర్లు వెచ్చించేందుకు పార్టీ అంగీకరించింది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైనిక బడ్జెట్. 732 బిలియన్ డాలర్లతో అమెరికా తొలిస్థానంలో ఉంది.
షాంఘై సహకార సంఘం భేటీకి ప్రధాని లీ కెకియాంగ్
భారత్ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న 19వ షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌ఈవో) సభ్య దేశాల ప్రభుత్వ అధినేతల సమావేశానికి చైనా ప్రధాని లీ కెకియాంగ్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఈ సంఘం భేటీ 30న వర్చువల్‌గా జరగనుంది. కరోనా వైరస్‌పై పోరాటం విషయంలో పరస్పరం సహకరించుకోవడంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఎస్‌సీవోలో రష్యా, భారత్, చైనా, పాకిస్తాన్, కిర్గిజిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలు.
భారత్‌తో లోతైన చర్చలు: చైనా
తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద మోహరించిన సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై భారత్‌తో లోతైన చర్చలు జరుపుతున్నట్లు, పరస్పరం సహకరించుకుంటున్నట్లు చైనా గురువారం వెల్లడించింది. ఈ ఏడాది మేలో తూర్పు లద్దాఖ్‌లో ఇరు దేశాల సైన్యం మధ్య భారీ ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇరు దేశాలు పదుల సంఖ్యలో సైనికులను కోల్పోయాయి. అప్పటి నుంచి ఎల్‌ఏసీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. సరిహద్దులో ఇరు దేశాల భారీగా సైన్యాలనుమోహరించాయి. సైన్యాన్ని వెనక్కి తీసుకొని, ఉద్రిక్తతలకు స్వస్తి పలకాలని భారత్, చైనా నిర్ణయించుకున్నాయి. 8వ దఫా చర్చల తర్వాత సరిహద్దులో పరిస్థితి నిలకడగా ఉందని చైనా జాతీయ భద్రతా శాఖ తెలిపింది. సైన్యం ఉపసంహరణపై ఇండియాతో లోతైన చర్చలు జరుపుతున్నామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment