మసూద్‌ను ఆంక్షల జాబితాలో చేర్చండి: భారత్
న్యూయార్క్: ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ చీఫ్, పఠాన్‌కోట్ ఉగ్ర దాడి కుట్రదారు మసూద్ అజార్ పేరును భద్రతా మండలి ఆంక్షల జాబితాలో చేర్చాలని భారత్ ఐరాసను కోరింది. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలంది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, దౌత్యవేత్త సయీద్ అక్బరుద్దీన్ ఈమేరకు న్యూజిలాండ్ రాయబారి, 1267 అల్ కాయిదా ఆంక్షల కమిటీ అధ్యక్షుడు జెరార్డ్ జాకౌబ్స్ వాన్ బోహెమెన్‌కు ఈమేరకు లేఖరాశారు. జైషే సంస్థ ఉగ్ర కార్యకలాపాలకు, పఠాన్‌కోట్ దాడి ఘటనకు ఆ సంస్థ చీఫ్ మసూద్ ప్రమేయమున్నట్లు పటిష్ట ఆధారాలు చూపుతూ దీన్ని రాశారు. మసూద్‌ను ఆంక్షల జాబితాలో చేర్చకుంటే భారత్‌తోపాటు దక్షిణాసియాలోని ఇతర దేశాలకు ముప్పు ఉంటుందని స్పష్టంచేశారు.