న్యూయార్క్: నిషేధిత ఉగ్రసంస్థ అల్‌ఖైదా చీఫ్ అయ్మన్ అల్ - జవహిరి(71)ని.. ఎట్టకేలకు మట్టుపెట్టగలిగింది అమెరికా. అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ ఇంటిలోనే డ్రోన్ స్ట్రయిక్ ద్వారా అతన్ని నేల కూల్చింది. గతంలో పాక్ భూభాగంలో అల్ ఖైదా ‘ఎమిర్’(చీఫ్ కమాండర్) బిన్‌లాడెన్‌ను ఎలాగైతే మట్టుపెట్టిందో.. ఇప్పుడు ఆ తర్వాతి చీఫ్‌ను సైతం పక్కా దాడితో మట్టుపెట్టి.. ఉగ్ర సంస్థకు నాయకత్వం లేకుండా చేసింది. అయితే..
అమెరికా డ్రోన్ దాడిలో అల్ ఖైదా నాయకుడు హతమై కొన్నిగంటలు గడవక ముందే కొత్త నాయకుడి పేరు తెర మీదకు వచ్చింది ఇప్పుడు. అతని పేరే సైఫ్ అల్-అడెల్. అల్ ఖైదా వ్యవస్థాప సభ్యుడిగా, సీనియర్ మెంబర్‌గా, సంస్థలో నెంబర్ త్రీ పొజిషన్‌లో ఇంతకాలం ఉన్నాడతను. తర్వాతి నాయకత్వ పగ్గాలు అందుకునే అవకాశాలు ఉన్నాయని మిడిల్ ఈస్ట్ ఇనిస్టిట్యూట్ ఓ కథనం ప్రచురించింది.
► ఎఫ్‌బీఐ రికార్డుల ప్రకారం.. అడెల్ ఏప్రిల్ 11న 1960-63 మధ్యలో జన్మించాడు.
► జవహిరిలాగే.. అడెల్ కూడా ఈజిప్ట్ పౌరుడే. అక్కడి ఆర్మీలో కల్నల్ ర్యాంకుతో పని చేశాడు.
► జవహిరి స్థాపించిన ఇజిప్టియన్ ఇస్లామిక్ జిహాద్‌లో సైఫ్ అల్-అడెల్ పని చేశాడు. అందులో అతనికి ఎక్స్‌ప్లోజివ్ ఎక్స్‌పర్ట్‌గా పేరు ఉంది.
► 1980లలో ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యా దళాలతో కూడా పోరాడాడు.
► అమెరికన్లనే మాట వింటే చాలు రగిలిపోతాడతను. గతంలో అమెరికన్లను హతమార్చిన ఘటనలు, అమెరికన్లకు చెందిన ఆస్తుల విధ్వంసం, అమెరికా భద్రతా విభాగాల్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం తదితర ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అందుకే ఎఫ్‌బీఐ సైఫ్ అల్ అడెల్‌ను మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించింది.
► 1998లో టాంజానియా, కెన్యాలోని రాయబార కార్యాలయాల్లో బాంబు పేలుళ్ల ద్వారా అమెరికన్లను హతమార్చే యత్నం కింద అతనిపై నేరారోపణలు నమోదు చేసిన అమెరికా.. పట్టించినా, సమచారం అందించిన వాళ్లకు 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది.
► 1993 అక్టోబర్‌లో సోమాలియా మోగడిషూ దగ్గర జరిగిన బ్లాక్ హాక్ డౌన్ ఘటనకు మూల కారణం..సైఫ్ అల్-అడెల్. ఆ ఘటనలో అమెరికాకు చెందిన పద్దెనిమిది మంది సర్వీస్‌మెన్ బలయ్యారు.
► ఒసామా బిన్ లాడెన్ సెక్యూరిటీ చీఫ్‌గా పని చేయడంతో సైఫ్ అల్-అడెల్ బాగా ఆప్తుడిగా మెదిలేవాడు. జవహిరి కంటే అడెల్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు లాడెన్.
► 2001 నుంచే ఎఫ్‌బీఐ మోస్ట్-వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు.
► బిన్ లాడెన్ మరణించినప్పటి నుండి, అల్-అడెల్ ఒక ముఖ్యమైన వ్యూహకర్తగా మారాడని అనేక వార్తా సంస్థలు తెలిపాయి. అయితే,బ్లాక్ హాక్ డౌన్ తరువాత చాలాకాలం పాటు ఇరాన్‌లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతనెక్కడ ఉన్నాడన్నది మాత్రం తెలియదు!.
► కేడర్ హోదాలో తర్వాతి ఎమిర్ అయ్యే అవకాశాలు సైఫ్ అల్-అడెల్‌కు ఎక్కువగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment