ధ్రువీకరించిన హెజ్‌బొల్లా
మృతుల్లో అగ్ర నేతలు, కూతురు
ఇరాన్ సీనియర్ కమాండర్ కూడా
దాడులు కొనసాగుతాయి: ఇజ్రాయెల్
సరిహద్దుల్లో భారీగా మోహరింపులు
హెజ్‌బొల్లాకు అండగా ఉంటాం: ఇరాన్
పూర్తిస్థాయి యుద్ధం దిశగా పరిణామాలు
బీరూట్: లెబనాన్ ఉగ్ర సంస్థ హెజ్‌బొల్లాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల్లో సంస్థ చీఫ్ షేక్ హసన్ నస్రల్లా (64)తో పాటు పలువురు అగ్ర శ్రేణి కమాండర్లు మృతి చెందారు. హెజ్‌బొల్లా కూడా దీన్ని ధ్రువీకరించింది. ‘నస్రాల్లా తన తోటి అమరవీరులను చేరుకున్నారు’ అంటూ శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘పాలస్తీనాకు మద్దతుగా శత్రువుపై పవిత్రయుద్ధం కొనసాగుతుంది’ అని ప్రతిజ్ఞ చేసింది.
నస్రల్లాయే ప్రధాన లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం శుక్రవారం భారీ బాంబు దాడులకు దిగి హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయాన్ని నేలమట్టం చేయడం తెలిసిందే. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 80కి పైగా బాంబులతో విరుచుకుపడింది. ఆ క్రమంలో ఏకంగా 2,200 కిలోల బంకర్ బస్టర్ బాంబులను కూడా ప్రయోగించింది.
దాడిలో నస్రల్లాతో పాటు ఆయన కూతురు జైనబ్, òహెజ్‌బొల్లా సదరన్ కమాండర్ అలీ కరీ్కతో పాటు పలువురు కమాండర్లు మృతి చెందినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. నస్రల్లాతో పాటు తమ సీనియర్ సైనిక కమాండర్ అబ్బాస్ నిల్ఫోరుషన్ (58) కూడా దాడుల్లో మృతి చెందినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘నస్రల్లా కదలికలను కొన్నేళ్లుగా అత్యంత సన్నిహితంగా ట్రాక్ చేస్తూ వస్తున్నాం.
అతనితో పాటు హెజ్‌బొల్లా అగ్ర నేతలంతా బంకర్లో సమావేశమైనట్టు అందిన కచి్చతమైన సమాచారం మేరకు లక్షిత దాడులకు దిగాం’’ అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదావ్ షొషానీ వివరించారు. ‘‘నస్రల్లాను మట్టుపెట్టాం. పలు రకాలైన నిఘా సమాచారం ఆధారంగా నిర్ధారణ కూడా చేసుకున్నాం’’ అని ప్రకటించారు. ‘‘అంతేకాదు, గత వారం రోజులుగా చేస్తున్న దాడుల్లో హెజ్‌బొల్లా్ల సాయుధ సంపత్తిని భారీగా నష్టపరిచాం. దాన్ని పూర్తిగా నాశనం చేసేదాకా దాడులు చేస్తాం’’ అని తెలిపారు. శుక్రవారం నాటి దాడిలో వాడిన బాంబులు తదితరాలపై మాట్లాడేందుకు నిరాకరించారు. ‘‘హెజ్‌బొల్లా ప్రతీకార దాడులకు దిగుతుందని తెలుసు. మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని ప్రకటించారు.
హెజ్‌బొల్లాకు ఇరాన్, ఇరాక్ దన్ను
హెజ్‌బొల్లాకు పూర్తిగా అండగా నిలుస్తామంటూ ఇరాన్, ఇరాక్ ప్రకటించాయి. అత్యంత శక్తిమంతమైన ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ శనివారం అత్యవసరంగా సమావేశమైంది. ఇజ్రాయెల్ దాడులకు గట్టిగా జవాబివ్వాల్సిందేనని ముక్త కంఠంతో తీర్మానించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమ సైనిక కమాండర్ మృతికి ప్రతీకారం తీర్చుకునే హక్కుందని ఇరాన్ న్యాయవ్యవస్థ డిప్యూటీ చీఫ్‌రెజా పూర్ ఖగాన్ అన్నారు.
ముస్లిం ప్రపంచమంతా పాలస్తీనా, హెజ్‌బొల్లాలకు దన్నుగా నిలవాలంటూ ఇరాక్ కూడా పిలుపునిచి్చంది. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఇరాక్ ప్రధాని మొహహ్మద్ సియా అల్ సుడానీ ఇరాన్, హెజ్‌బొల్లాతోనే అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగడం ఖాయమంటున్నారు. మరోవైపు, నస్రల్లా మృతితో అంతా అయిపోయినట్టు కాదని ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ అన్నారు. హెజ్‌బొల్లాపై దాడులు మరింత తీవ్రంగా కొనసాగుతాయని ప్రకటించారు.
ఇజ్రాయెల్ ఇప్పటికే అదనపు బలగాలను సమీకరించుకుంటోంది! భూతల దాడులను ఎదుర్కొనేందుకు రెండు బ్రిగేడ్లను ఉత్తర ప్రాంతానికి పంపింది. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వు బెటాలియన్లను కూడా రంగంలోకి దిగాల్సిందిగా ఆదేశించింది. దాంతో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికే తారస్థాయికి చేరిన ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా మారవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హెజ్‌బొల్లా దాడుల వల్ల లెబనాన్ సరిహద్దుల్లో 60 వేల మందికి పైగా తమ ప్రజలు నిర్వాసితులయ్యారని ఇజ్రాయెల్ మండిపడుతోంది. దాడులకు పూర్తిగా స్వస్తి చెప్పేదాకా తగ్గేదే లేదంటోంది. ఇజ్రాయెల్ తాజా దాడుల దెబ్బకు లెబనాన్‌లో గత వారం రోజుల్లోనే ఏకంగా 2 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారని ఐరాస చెబుతోంది.
కోలుకోలేని దెబ్బ!
మూడు దశాబ్దాలకు పైగా హెజ్‌బొల్లాను నడిపిస్తున్న నస్రల్లా మృతి ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బే. హెజ్‌బొల్లాపై తలపెట్టిన తాజా దాడిలో ఇజ్రాయెల్‌కు ఇది అతి పెద్ద విజయంగా భావిస్తున్నారు. హెజ్‌బొల్లా హెడ్డాఫీస్‌తో పాటు ఆరు అపార్ట్‌మెంట్లను నేలమట్టం చేసిన శుక్రవారం నాటి దాడుల్లో మృతులు ఆరుకు, క్షతగాత్రుల సంఖ్య 91కి పెరిగినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రెండు వారాల క్రితమే లెబనాన్ అంతటా పేజర్లు పేలి పదుల సంఖ్యలో చనిపోగా వేలాది మంది తీవ్రంగా గాయపడటం తెలిసిందే. దాన్నుంచి తేరుకోకముందే వాకీటాకీలు మొదలుకుని పలు ఎలక్ట్రానిక్ పరికరాలు పేలి మరింత నష్టం చేశాయి. ఇదంతా ఇజ్రాయెల్ పనేనని,
మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు హెజ్‌బొల్లా మిలిటెంట్లేనని వార్తలొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment