కోల్‌కతా: జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) ఉగ్రవాద సంస్థకు చెందినట్లు అనుమానిస్తున్న పశ్చిమ బెంగాల్ యువతి ప్రగ్యా దేబ్‌నాథ్ అలియాస్ ఆయేషా జన్నత్ మోహనాను శుక్రవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమె తల్లి చట్ట ప్రకారం తన కుమార్తెను శిక్షించాలని కోరుతున్నారు. ఆ వివరాలు.. పశ్చిమ బెంగాల్ హుగ్లీ ధానియఖాలి గ్రామానికి చెందిన ప్రగ్యా దేబ్‌నాథ్ నాలుగేళ్ల క్రితం అనగా 2016, సెప్టెంబర్ 25 ఉదయం దుర్గామాత పూజ సందర్భంగా బయటకు వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. ప్రతిరోజు ప్రగ్యా అలా బయటకు వెళ్లడం సాధారణమే. దాంతో తల్లిదండ్రులు కూడా అనుమానించలేదు. గంటలు గడుస్తున్నా ప్రగ్యా ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన ప్రగ్యా తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేశారు. స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దాంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. చుట్టుపక్కల గాలించడం ప్రారంభించారు.
ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత మధ్యాహ్నం సమయంలో ప్రగ్యా తల్లికి ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. చేసింది ఆమె కుమార్తె. తాను ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్నానని.. ఇస్లాంలోకి మారానని.. తల్లి ఆశీర్వాదం కోసం ఫోన్ చేశానని తెలిపింది ప్రగ్యా. అంతేకాక ఇదే తన చివరి కాల్ అని కూడా అన్నది. ఈ విషయం గురించి ప్రగ్యా తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. కానీ వారు ఆ నంబర్‌ను ట్రేస్ చేయలేకపోయారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత శుక్రవారం కౌంటర్ టెర్రరిజమ్ అండ్ ట్రాన్స్‌మిషనల్ క్రైమ్ యూనిట్ పోలీసులు ఢాకాలో ప్రగ్యాను అరెస్ట్ చేశారు. దీని గురించి స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ధనియాఖాలి ప్రాంతానికి చెందిన యువతి.. ఉగ్రవాద సంస్థలో చేరింది అని ప్రచారం చేయడంతో ఆమెని తన కుమార్తెగా గుర్తించింది ప్రగ్యా తల్లి. (చొరబాట్లను ఆపుతూ అమరులయ్యారు)
దీనిపై ప్రగ్యా తల్లి స్పందిస్తూ.. ‘ఇంటి నుంచి వెళ్లడానికి ముందు నా కుమార్తె ప్రవర్తనలో ఎలాంటి తేడాను మేం గమనించలేదు. ఏదైనా విషయంలో మాకు ఎదురుతిరగడం కూడా మేం ఎప్పుడు చూడలేదు. అలాంటిది ఏకంగా ఉగ్రవాద గ్రూపులో చేరింది. చట్ట ప్రకారం నా కుమార్తెను శిక్షించండి’ అని కోరింది. ఈ విషయం గురించి ఇరుగుపొరుగు వారు మాట్లాడుతూ.. ‘ప్రగ్యా చాలా సాధారణమైన అమ్మాయి. ప్రతి రోజు ఉదయం సైకిల్ మీద కిలోమీటర్ దూరంలో ఉన్న కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం వచ్చేది. తనకు తెలిసిన వారు ఎదురుపడితే.. నవ్వుతూ పలకరించేది. ఎవరితో ఎక్కువగా కలిసేది కాదు. చాలా సిగ్గరి. అలాంటి అమ్మాయి ఉగ్రవాదిగా మారింది అంటే నమ్మబుద్ధి కావడం లేదు’ అంటున్నారు. (నా భర్తని హత్య చేశారు: ఎమ్మెల్యే భార్య)
Comments
Please login to add a commentAdd a comment