బంగ్లా నేతలకు మమత కౌంటర్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ను మరికొద్ది రోజుల్లోనే ఆక్రమించుకుంటామంటూ బంగ్లాదేశ్ రాజకీయ నేతలు కొందరు చేస్తున్న అతి వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ దీటైన సమాధానమిచ్చారు. అవన్నీ మతిలేని వ్యాఖ్యలంటూ ఆమె కొట్టిపారేశారు. ‘మీరొచ్చి బెంగాల్, బిహార్, ఒడిశాలను ఆక్రమించుకుంటూ ఉంటే మేం లాలీపాప్ తింటూ కూర్చుంటామనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు.
‘మా భూభాగాన్ని మా నుంచి లాక్కునే సత్తా ఎవ్వరికీ లేదు. అటువంటి ఆలోచన కూడా రానివ్వకండి’అని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలను ప్రేరేపించే దురుద్దేశంతోనే ఓ రాజకీయ పార్టీ ఫేక్ వీడియోలను ఇక్కడ వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని పట్టించుకోవద్దని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.
భారత్‌లో పరిణామాలను రాజకీయం చేయాలని చూడటం బంగ్లాదేశీయులతోపాటు బెంగాల్‌కు, ఇక్కడి ప్రజలకు కూడా క్షేమకరం కాదని మమత హెచ్చరించారు. అనవసరమైన వ్యాఖ్యల కారణంగా బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మరింతగా విషమించే ప్రమాదముందని కూడా మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఆమె తీవ్రంగా ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment