![Curfew Imposed In West Bengal And Bangladesh Border](/styles/webp/s3/article_images/2025/02/19/Mamatha.jpg.webp?itok=S5eoCjLN)
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో మరోసారి రాజకీయం వేడెక్కింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చే చొరబాటుదార్లను ఆమె ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. పొరుగుదేశం నుంచి వచ్చిన ఉగ్రవాదులు బెంగాల్‌లో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారన్నారు. సీఎం తీరుతో రాష్ట్ర జనాభా తీరుతెన్నులు మారనున్నాయని ఆరోపించారు.
ఇదే సమయంలో ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైన మహా కుంభ్‌ను ఆమె మృత్యు కుంభ్ అంటూ వర్ణించడం ద్వారా కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ నుంచి సస్పెండైన అనంతరం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా సువేందు.. ‘అక్రమ చొరబాటుదార్లను అస్సాం ఎస్‌టీఎఫ్ పట్టుకుంటే మీరు నిద్రపోతున్నారు. కోల్‌కతాలోని కొన్ని ప్రాంతాలు బంగ్లాదేశ్‌లా ఉన్నాయని స్వయంగా మీరే అన్నారు. ఒక మతం జనాభా విపరీతంగా పెరిగిపోతున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర జనాభా తీరుతెన్నులు మారితే మీకు సంతోషమా? మీరు అలా చేయడాన్ని మేం ఒప్పుకోం’ అని హెచ్చరించారు.
రుజువు చేస్తే రాజీనామా చేస్తా: మమత
బంగ్లాదేశ్‌లోని అతివాదులు, ఉగ్రవాదులతో తనకు సంబంధాలున్నాయంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించడంపై సీఎం మమత మండిపడ్డారు. చేతనైతే రుజువు చేయాలని వారికి సవాల్ విసిరారు. ఆధారాలు చూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం కంటే చావడం మేలని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యేల నిరాధార ఆరోపణల విషయమై ప్రధాని మోదీకి లేఖ రాస్తానన్నారు.
బంగ్లా సరిహద్దులోని చచార్‌లో రాత్రి కర్ఫ్యూ
సిల్చార్: తీవ్రవాద శక్తులు, స్మగ్లర్ల కదలికలను నివారించే లక్ష్యంతో భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని అస్సాం రాష్ట్రం చచార్ జిల్లాలో రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. శాంతిభద్రతలను కాపాడేందుకు కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తూ చచార్ జిల్లా మేజిస్ట్రేట్ మృదుల్ యాదవ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సరిహద్దులకు కిలోమీటర్ పరిధిలో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు రెండు నెలల పాటు ఇవి అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ సమయంలో భారత భూభాగంలోని సుర్మా నది ఒడ్డున ఎవరూ సంచరించరాదని, అనుమతులున్న స్థానిక మత్స్యకారులు మాత్రమే చేపలు పట్టుకోవాలన్నారు. విధి నిర్వహణలో ఉండే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిబంధనలు వర్తించవని మేజిస్ట్రేట్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment