నో డౌట్.. అధికారం మాదే!!
గోవా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీలు మళ్లీ తమదే అధికారమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటింగ్ సరళీ అధికార పార్టీలకు అనుకూలంగా ఉందని అంచనా వేస్తున్నాయి. కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ మాట్లాడుతూ.. గోవా ఎన్నికల్లో మరోసారి బీజేపీదే అధికారమని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని పేర్కొన్నారు. అటు పంజాబ్‌లో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న అధికార శిరోమణి అకాలీ దళ్ కూడా మరోసారి తమదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేసింది.
పంజాబ్‌లో తాము మరోసారి గెలిచితీరుతామని అకాలీ దళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తెలిపారు. కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్‌ది డ్రామా అని, ఆయనకు డిపాజిట్ కూడా రాదని ఆయన పేర్కొన్నారు. ఆప్ మూడోస్థానానికి పరిమితమవుతుందని బాదల్ జోస్యం చెప్పారు. మరోవైపు పంజాబ్, గోవాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రజలు, పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు క్యూలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.