గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ (పాత ఫోటో)
పణాజీ, గోవా : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆరోగ్యంపై అసత్య ప్రచారం చేస్తున్న వాస్కో పట్టణానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తిని క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ‘అమెరికాలో క్లోమ గ్రంధి సంబంధిత చికిత్స పొందుతున్న పరీకర్ ఆరోగ్యం క్షీణించింది. ఇక ఆయన మనకు లేరు’ అంటూ సదరు వ్యక్తి మంగళవారం తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం కలకలానికి దారి తీసింది.
దీనిపై విచారణ జరిపిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సీఎం ఆరోగ్యం మెరుగు పడుతుందనీ, బహుశా ఆయన వచ్చే నెలలో ఇండియాకు రావొచ్చని గోవా బీజేపీ ప్రధాన కార్యదర్శి సదానంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లోగానే పరీకర్ ఆరోగ్యంపై పుకార్లు మొదలు కావడం బాధ కల్గించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘పరీకర్ కోలుకుంటున్నారు. ఆయన వచ్చే నెలలో స్వదేశానికి వస్తారు’ అని కర్‌కోరం ఎమ్మెల్యే నీలేష్ కాబ్రల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.
సీఎం ఆరోగ్య వివరాలను ప్రభుత్వం వెల్లడించడం లేదంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు అర్థరహితమని నీలేష్ మండిపడ్డారు. ఆయన ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తోందని వివరణ ఇచ్చారు. కాగా, కడుపు నొప్పితో ఫిబ్రవరి 5న ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన పరీకర్ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment