పనాజీ : గోవా సీఎం మనోహర్ పారికర్‌తో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మంగళవారం సమావేశమయ్యారు. వీరి మధ్య ఏయే అంశాలపై చర్చలు జరిగాయనే వివరాలు వెల్లడికాలేదు. పారికర్‌తో తాను కేవలం మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యానని, ఇది వ్యక్తిగత పర్యటనగా రాహుల్ వెల్లడించారు. నేటి ఉదయం గోవా సీఎం మనోహర్ పారికర్‌ను తాను కలిశానని, ఆయన సత్వరం కోలుకోవాలని ఆకాంక్షించానని రాహుల్ ట్వీట్ చేశారు.
గోవా శాసన సభ ప్రాంగణంలోని సీఎం చాంబర్‌లో పారికర్‌తో రాహుల్ సమావేశమయ్యారు. పారికర్‌తో ముచ్చటించిన అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాహుల్ అసెంబ్లీలోని విపక్ష లాబీలో సమావేశమయ్యారు. కాగా రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన కీలక పత్రాలు గోవా సీఎం వద్ద ఉన్నాయని కాంగ్రెస్ చీఫ్ ఆరోపించిన మరుసటి రోజే పారికర్‌తో రాహుల్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు పారికర్‌తో రాఫెల్ ఒప్పందంపై రాహుల్ ఎలాంటి చర్చలూ జరపలేదని, కేవలం ఆయన ఆరోగ్య పరిస్ధితిని వాకబు చేసేందుకే కలిశారని గోవా విపక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్ వివరణ ఇచ్చారు. పారికర్‌ను రాహుల్ కేవలం మర్యాదపూర్వకంగానే కలిశారని చెప్పుకొచ్చారు. మనోహర్ పారికర్ పాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతూ 2018 ఫిబ్రవరి నుంచి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment