Rafale jet deal
-
రాఫెల్ కుంభకోణానికి ప్రధాని మోదీనే బాధ్యుడు
సాక్షి, హైదరాబాద్: రాఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోళ్ల కుంభకోణానికి ప్రధాని నరేంద్ర మోదీనే బాధ్యుడని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. రక్షణ శాఖ కొనుగోళ్ల విషయంలో ప్రధానికి అధికారం ఉండదని, అయినా మోదీ రాఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల విషయంలో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. పీఎంవో జోక్యం తగదంటూ రక్షణశాఖ లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. దీన్ని బట్టి ప్రధాని మోదీనే ఈ కుంభకోణానికి పూర్తి బాధ్యుడని అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన గతంలోనే పలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, గతవారం ఫ్రెంచ్ మీడియాలో వచ్చిన కథనంతో ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని నిర్ధారణ అయిందని వ్యాఖ్యానించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019, మార్చిలో ఈడీ అధికారులు సుశేన్‌గుప్తా ఇంటిపై దాడి చేసినప్పుడు ఈ కుంభకోణానికి సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు లభించాయని, రక్షణ శాఖ వద్ద ఉండాల్సిన పత్రాలు ఆయన ఇంట్లో ఎలా దొరికాయని ప్రశ్నించారు. దేశానికి రూ.41,205 కోట్ల నష్టం రక్షణ శాఖ వద్ద ఉండాల్సిన డాక్యుమెంట్లు సుశేన్‌గుప్తా అనే దళారి ఇంట్లో ఉన్నాయంటే డసాల్ట్ కంపెనీకి, కేంద్రానికి మధ్య ఆయన పోషించిన పాత్ర ఏంటో అర్థమవుతుందని పవన్ ఖేరా అన్నారు. అప్పటి నుంచి 2021, నవంబర్ వరకు సుశేన్‌గుప్తాపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదో, రాఫెల్ కంపెనీపై సీబీఐ, ఈడీ ఎందుకు విచారణ చేయలేదో చెప్పాలని నిలదీశారు. యూపీఏ హయాంలో 126 ఎయిర్‌క్రాఫ్ట్‌లను రూ.526 కోట్ల చొప్పున కొనుగోలు చేయాలని రాఫెల్‌తో ఒప్పందం కుదిరితే, మోదీ అధికారంలోకి వచ్చాక ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్యను 36కి తగ్గించి ఒక్కో ఎయిర్‌క్రాఫ్ట్ ధరను రూ.1,670 కోట్లకు పెంచిందని, తద్వారా దేశానికి రూ.41,205 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్ : ఆధారాలు లేని ఆరోపణలు చేసి బీజేపీపై బురద చల్లాలని అనుకుంటే చూస్తూ ఊరుకోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్షణ్ హెచ్చరించారు. రఫెల్ వ్యవహారంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాహుల్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ క్షమాపణ చెప్పేదాకా దేశ ప్రజలు వదిలిపెట్టరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాశం, పాతాళంలో కూడా కాంగ్రెస్ అవినీతి ఉంటుందని, కాంగ్రెస్ ఒక బెయిల్ గాడీ అని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఆలీబాబా దొంగల ముఠాలంటిదని, దేశ సంపదను దోచుకొని విదేశాల్లో దాచుకున్నారని దుయ్యబట్టారు. అర్థం లేని విమర్శలు చేస్తున్నారు రాహుల్ చిన్న పిల్లల మనస్తత్వంతో విమర్శలు చేస్తున్నారని, రఫెల్‌పై సుప్రీంకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చిందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. క్షమాపణ చెప్పడం కాదు, నోరు అదుపులో పెట్టుకోవాలని కోర్టు సూచించిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారని, కోడిగుడ్డుపై ఈకలు పీకే రాజకీయాలు నడవవని మండిపడ్డారు. దేశ భద్రత కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచిస్తూంటే రాహుల్ మాత్రం అర్థంలేని విమర్శలు చేస్తున్నారని, మోదీకి మంచి పేరు వస్తుందనే రఫెల్‌పై రివ్యూ పిటిషన్ వేశారని ఎమ్మెల్సీ రాంచందర్ రావు విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ది చెప్పి మోదీకి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ధర్నాలో లక్ష్మణ్‌తో పాటు ఎమ్మెల్సీ రామచందర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రాహుల్‌కు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ తీర్పుపై కాపలాదారే దొంగ అంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్దానం మంగళవారం ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. రఫేల్ ఒప్పందానికి సంబంధించి వెలువడిన తీర్పుపై రాహుల్ వ్యాఖ్యలు తమ ఉత్తర్వులను వక్రీకరించేలా ఉన్నాయని ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రఫేల్ కేసుపై తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లతో కలిపి ఈ అంశాన్ని ఈనెల 30న విచారణకు చేపడతామని కోర్టు పేర్కొంది. కాగా తనపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కొట్టివేయాలన్న రాహుల్ అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. రాఫెల్ తీర్పుపై రాహుల్ చేసిన ప్రకటనపై ఇప్పటికే క్షమాపణ తెలిపారని ఆయన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు తెలిపారు. ఇది చట్టం దృష్టిలో క్షమాపణ కిందకు రాదని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. రఫేల్ ఒప్పందంపై సుప్రీం తీర్పును పూర్తిగా పరిశీలించకుండానే ఎన్నికల ప్రచారంలో పొరపాటుగా సుప్రీం కోర్టు పేరును ప్రస్తావించానని రాహుల్ గాంధీ అంగీకరించిన సంగతి తెలిసిందే. -
రాహుల్ వివరణ ఇవ్వాలి: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చౌకీదార్ చోర్ (కాపలాదారే దొంగ) అనే వ్యాఖ్యలను తమకు ఆపాదించినందుకు గాను ఈ నెల 22 లోపు వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఆదేశించింది. రఫేల్ తీర్పుపై రాహుల్ గాంధీ ‘కాపలాదారే దొంగ’ అంటూ చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ఆయనపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సుప్రీం కోర్టు ఈ రోజు (సోమవారం) విచారణ చేపట్టింది. కాపలాదారే దొంగ అని మేము ఎప్పుడూ అనలేదని సుప్రీం కోర్టు తెలిపింది. ఆ వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించవద్దని రాహుల్ గాంధీకి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుకు ఆపాదిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఏప్రిల్ 22 కల్లా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చదవండి : రాహుల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ ఇటీవల ఎన్నికల సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి..చౌకీదార్ చోర్ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని రాహుల్ వ్యాఖ్యానించారు. అనిల్ అంబానికి రూ.40 వేల కోట్లు రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో లబ్ధి జరిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లుగా ఎన్నికల సభలో రాహుల్ పేర్కొన్నారు. సత్యాన్ని ఎవరూ మార్చలేరని, ప్రతి ఒక్కరూ కాపలాదారే దొంగ అంటున్నారని మోదీని ఉద్దేశించి రాహుల్ ఆరోపణలు చేశారు. -
రఫేల్ డీల్ : కేంద్రంపై మరో బాంబు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న రఫేల్ కుంభకోణంలో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా అనిల్ అంబానీకి కోట్ల రూపాయల పన్నును ఫ్రెంచ్ అధికారులు మాఫీ చేశారంటూ ఫ్రెంచి పత్రిక లీ మాండె మరో బాంబు వేసింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి లబ్ది చేకూర్చడం కోసమే రిలయన్స్ డిఫెన్స్ కంపెనీకి డీల్‌ను కట్టబెట్టారన్న ఆరోపణలకు తోడు, ఈ సంచలన కథనం మరింత కలకలం రేపుతోంది. దీంతో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఇబ్బందుల్లో పడిన నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఎన్నికల వేళ లీ మాండె రూపంలో మరో గట్టి ఎదురు దెబ్బ. భారత వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్ అని పిలిచే టెలికాం సంస్థకు అనుకూలంగా ఫ్రెంచ్ అధికారులు సుమారు రూ.11,27 కోట్లు (143.7 మిలియన్ యూరోలు లేదా 162.6 మిలియన్ డాలర్ల ) పన్నులను రద్దు చేసారని అక్కడి జాతీయ వార్తాపత్రిక లీ మాండే నివేదించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌తో రాఫెల్ ఒప్పందాన్ని ప్రకటించిన కొన్ని నెలల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుందని రిపోర్ట్ చేసింది. లీ మాండే ప్రకారం డస్సాల్ట్ ఏవియేషన్ రఫేల్ ఒప్పందంలో చర్చల సందర్బంగా అనిల్ అంబానీ పన్నుల వివాదానికి 2015, అక్టోబర్‌లో పరిష్కారం లభించిందని తెలిపింది. ఏప్రిల్, 2015 ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో అధికారిక పర్యటన సందర్బంగా 36 రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలు డీల్‌ను ప్రకటించడం గమనార్హం. 2007 - 2010 మధ్య కాలంలో అంబానీ రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్ కంపెనీ 60 మిలియన్ల యూరోలు పన్నుల ఎగవేతపై అక్కడి పన్ను అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే 7.6 మిలియన్ యూరోలు చెల్లించేందుకు కంపెనీ ప్రతిపాదించింది. దీన్ని తిరస్కరించిన అధికారులు దర్యాప్తు చేపట్టారని, కానీ ఈ వివాదానికి 2015లో ముగింపు పలికారని లీమాండే నివేదించింది. ఈ కథనంపై అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా రఫేల్ తీర్పుపై రివ్యూ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను సుప్రీకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. రివ్యూ పిటిషన్ల విచారణకు అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం త్వరలో విచారణ తేదీని నిర్ణయిస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. Breaking : French authorities waived taxes worth 143,7 million euros for Anil Ambani's French-based company just a few months after PM Modi announced his plans to buy 36 Rafale fighter jets from Dassault. Our story with @annemichel_LMhttps://t.co/Tpw50cJg0c — julien bouissou (@jubouissou) April 13, 2019 -
రాహుల్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ తీర్పుపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ‘కాపలాదారే దొంగ’ అంటూ చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ఆయనపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును ఈనెల 15న విచారణకు చేపట్టేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై రివ్యూ పిటిషన్ పట్ల కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన మీదట కాపలాదారే దొంగ అని సుప్రీం కోర్టు పేర్కొందని రాహుల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు కోర్టు ఉత్తర్వుల్లో కనీసం ఒక పేరా కూడా రాహుల్ చదవలేదని తాము భావిస్తున్నామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. తీర్పును పరిశీలించకుండానే రఫేల్ ఒప్పందంలో అవినీతి చోటుచేసుకున్నట్టు కోర్టు చెప్పినట్టుగా, కాపలాదారే దొంగ అని తీర్పు ఇచ్చినట్టు రాహుల్ మాట్లాడటం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మై భీ చౌకీదార్ పేరిట ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో బీజేపీ చేపట్టిన క్యాంపెయిన్‌పైనా రాహుల్ భగ్గుమన్న సంగతి తెలిసిందే. సత్యాన్ని ఎవరూ మార్చలేరని, ప్రతి ఒక్కరూ కాపలాదారే దొంగ అంటున్నారని మోదీని ఉద్దేశించి రాహుల్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. -
ప్రభువుల రహస్యాలపై ప్రజావిజయం
రఫేల్ యుద్ధవిమానాల కొనుగోల్‌మాల్ ఆరోపణలపైన సమరం ఇది. ఈ ఒప్పందం గందరగోళంపై దర్యాప్తుకు ఆదేశించాలని బీజేపీ సీనియర్ నాయ కులు, మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టును కోరారు. అందుకు కారణాలేమీ లేవని సుప్రీంకోర్టు డిసెంబర్ 2018లో కొట్టేసింది. రఫేల్ కొనుగోలు కోసం బేరసారాలు దారి తప్పాయని తెలిపే మూడు కీలకమైన పత్రాలు పత్రికల్లో బయటపడ్డాయి. వెల్లడయిన రక్షణ కొనుగోలు దస్తావేజులు చూపుతూ పిటిషనర్లు సుప్రీం కోర్టు తీర్పును మరోసారి పరిశీలించాలని రివ్యూ పిటి షన్ వేశారు. సుప్రీంకోర్టు ముందుకు కొన్ని కీలకమైన పత్రాలను ప్రభుత్వం తీసుకురాలేదని వాదించారు. అందుకు ఆధారాలుగా ఈ పత్రాలను చూపారు. కీలకమైన ఒప్పందంలో అత్యంత కీలకమైన రహస్య పత్రాలను దొంగిలించడం నేరమని, ఆ పత్రాలను ప్రచురించిన పాత్రికేయులను, ఆ పత్రాల ఆధారంగా పిటిషన్ వేసిన లాయర్లను క్రిమినల్ కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తామని అటార్నీ జనరల్ కె. వేణుగోపాల్ కోర్టులో చెప్పడం సంచలనం కలిగించింది. తరువాత పాత్రికేయులను, న్యాయవాదులను ప్రాసిక్యూట్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అటార్నీ జనరల్ ప్రకటించారు. మరికొన్నాళ్లకు తమ రహస్య దస్తావేజులన్నీ భద్రంగా ఉన్నాయని వాటినెవరూ దొంగిలించలేదని మరో వివరణ ఇచ్చారాయన. కానీ అత్యంత రహస్య పత్రాలను కాపీ చేయడం, లీక్ చేయడం నేరాలే అని అందుకు కారణమైన వారిపై దర్యాప్తు జరిపిస్తామని హెచ్చరించారు. మరోవైపు సుప్రీంకోర్టులో ప్రభుత్వ పక్షాన వాదిస్తూ అధికార రహస్యాల చట్టం, సాక్ష్య చట్టం ప్రకారం అక్రమ రహస్య పత్రాలు సాక్ష్యాలే కాబోవని, ఈ రహస్య పత్రాలను ప్రచురించే హక్కు పత్రికలకు లేదని, అక్రమంగా సంపాదించిన ఈ పత్రా లను పరిశీలించే అధికారం కోర్టులకు కూడా లేదని అటార్నీ జనరల్ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, సంజయ్ కిషన్ కౌల్, కెం.ఎం. జోసెఫ్ వాటిని కొట్టివేస్తూ, పత్రికా స్వాతంత్య్రాన్ని, సమాచార హక్కును నిలబెడుతూ ఏప్రిల్ 10న ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం. పత్రికలు ఇటువంటి పత్రాలు ప్రచురించకుండా నిషేధించాలని ప్రభుత్వం కోరింది. కానీ, ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం పత్రికాస్వాతంత్య్రాన్ని అరికట్టే విధానమని, అది సంవిధానానికి విరుద్ధమని కొట్టివేసింది. సాక్ష్య చట్టం సెక్షన్ 123 ప్రకారం ప్రభుత్వం ప్రచురించని పత్రాలను ఆ శాఖ అధినేత అనుమతి లేకుండా సాక్ష్యంగా కోర్టులు పరిశీలించడానికి వీల్లే దని అటార్నీ జనరల్ మరో లా పాయింట్ లేవదీసారు. ఈ పత్రాలు ఇదివరకే హిందూ తదితర పత్రికల్లో ప్రచురితమైన తరువాత వీటిని అప్రచురిత పత్రాలని ఏవిధంగా అంటారు? మొత్తం ప్రజానీకానికి తెలిసిన పత్రాలను రహస్యాలని ఎలా అంటా రని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రివిలేజ్ కింద ఈ పత్రాలను దాచుకోవాలనుకోవడం కూడా చెల్లదని సుప్రీంకోర్టు చెప్పింది. సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత ఇంకా ఈ రహస్యాలకు ఏ విలువ ఉందనేది ప్రశ్న. ప్రభుత్వ పాలనకు కొన్ని రహస్యాలు అవసరమని, వాటిని వెల్లడిస్తే ప్రభుత్వాలను ప్రజలు అనవసరంగా విమర్శిస్తూ ఉంటారని అందువల్ల పాలనలో ఇబ్బందులు ఏర్పడతాయని ప్రభుత్వ వాదన. ప్రభుత్వపాలనకు కొన్ని రహస్యాలను కాపాడడం అవసరమైతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ కార్యకలాపాల గురించి తెలుసుకునే ప్రజల హక్కు కూడా ముఖ్యమే. ఈ రెండు అంశాల మధ్య సమతుల్యాన్ని సాధించడానికే సమాచార హక్కు చట్టం ఉపయోగించాలని ఆ చట్టం పీఠిక వివరిస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. సెక్షన్ 8(1)ఎ ప్రకారం సమాచారం వెల్లడిస్తే భారత భద్రతకు, సమగ్రతకు, విదేశీ స్నేహసంబంధాలకు హాని కలుగుతుందని భావిస్తే సమాచారం ఇవ్వాల్సిన పని లేదు. కానీ సెక్షన్ 8(2) ప్రకారం ప్రజాప్రయోజనాన్ని పరిశీ లించి, సమాచారం వెల్లడిస్తే వచ్చే ప్రయోజనం, దాచడంవల్ల కలిగే హానికన్నా అధికమైతే వెల్లడించాల్సి ఉంటుంది. సెక్షన్ 22 ప్రకారం రహస్యాల చట్టంగానీ, మరే ఇతర చట్టంగానీ సమాచార హక్కు చట్ట నియమాలకు విరుద్ధమయితే ఆ మేరకు సమాచార హక్కు చట్టమే చెల్లుతుందని చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. ఐబి, రా వంటి కొన్ని సంస్థలను సమాచార హక్కు చట్టం కిందనుంచి పూర్తిగా తప్పించిన సెక్షన్ 24లో కూడా రెండు మినహాయింపు లున్నాయి. అవినీతికి సంబంధించిన సమాచారాన్ని, మానవహక్కుల ఉల్లంఘన సమాచారాన్ని ఆ సంస్థలు కూడా ఇవ్వాల్సి ఉంటుందని కనుక వెల్లడిపై ఆంక్షలు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది ప్రభువుల రహస్యాల మీద ప్రజా విజయం. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
పారదర్శకతకు నీరాజనం
అనవసరమైన అంశాల్లో గోప్యత పాటిద్దామని ప్రయత్నిస్తే వికటిస్తుంది. రఫేల్ ఒప్పందం పెద్ద కుంభకోణమంటూ ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు పారదర్శకంగా వ్యవహరించి దీటైన జవాబి వ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం దాన్ని అధికార రహస్యాల మాటున, దేశ రక్షణ మాటున దాచడానికి ప్రయత్నించి భంగపడింది. ఈ వ్యవహారంలో లోగడ వెలువరించిన తీర్పును పునస్సమీక్షిం చాలంటూ దాఖలైన పిటిషన్‌కు విచారణార్హత లేదని కేంద్రం చేసిన వాదనను బుధవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అలాగే రఫేల్ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను దొంగిలించి ఆంగ్ల దిన పత్రిక ‘ది హిందూ’ కథనాలు రాసిందని, ఇది అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడమే అవు తుంది గనుక వాటిని సాక్ష్యాధారాలుగా పరిగణించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చేసిన వాద నను కూడా తిరస్కరించింది. ఈ తీర్పులో మరో కీలకమైన అంశం– ‘ది హిందూ’ రఫేల్ పత్రాలను ప్రచురించడం రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛలో భాగమేనని, దానికి ఆ హక్కు ఉన్న దని తేల్చిచెప్పడం. రఫేల్ ఒప్పందంపై సమగ్రమైన దర్యాప్తును కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను నిరుడు డిసెంబర్లో సుప్రీంకోర్టు తోసిపుచ్చాక ఆ సమస్య ముగిసినట్టేనని కేంద్రం భావించింది. కానీ ‘ది హిందూ’ ప్రచురించిన మూడు కథనాలతో విషయం మొదటికొచ్చింది. అంతక్రితం ఏం చెప్పినా ఆ కథనాలు వెలువడ్డాకైనా ప్రజలకు వాస్తవాలు వెల్లడించి ఉంటే బాగుండేది. ఆ పత్రిక తప్పుడు కథనాలు ప్రచురించిందని భావిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు అందుకు భిన్నంగా పత్రాలు దొంగిలించారని, ఇది నేరమని వాదించడం అర్ధరహితం. రఫేల్ ఒప్పందంలో జవాబు చెప్పాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా రఫేల్ యుద్ధ విమానాలపై ఏక కాలంలో మన ప్రభుత్వానికి చెందిన రెండు బృందాలు ఫ్రాన్స్‌తో మంతనాలు జరపడంలోని సహేతుకత ఏమిటో వివరించాలి. అలాగే దీనివల్ల మనకు చాలా నష్టం జరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ తరఫున చర్చలు జరిపిన బృందం వ్యక్తం చేసిన అభిప్రాయంలో నిజమెంతో చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. ఇదేవిధంగా ఒప్పందానికి బ్యాంకు గ్యారెంటీ తీసు కోనట్టయితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఇచ్చిన సల హాకు భిన్నంగా ఎందుకు వ్యవహరించాల్సివచ్చిందో చెప్పాలి. ఫ్రాన్స్ ప్రధాని ఇచ్చిన ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’ సరిపోతుందని ఎలా అనుకున్నారో వివరించాలి. వీటన్నిటికీ సమాధానాలు ఇవ్వకుండానే సమస్య ముగిసిపోయిందని, సుప్రీంకోర్టు తమకు క్లీన్చిట్ ఇచ్చిందని కేంద్రం భావించడం వల్లనే అది మరింత జటిలంగా మారింది. కొత్త అంశాలు వెల్లడైనప్పుడు ఏ కేసునైనా న్యాయస్థానాలు తిర గదోడతాయి. అలాంటి అవకాశం ఎప్పుడూ ఉంటుందని ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపో యిందో అనూహ్యం. ఒకవేళ దీనిపై పునర్విచారణ అనవసరమనుకుంటే దానికి మద్దతుగా బల మైన వాదనలు వినిపిస్తే వేరుగా ఉండేది. అందుకు భిన్నంగా దొంగిలించారని ఒకసారి... కాదు, వాటి నకళ్లు తీసుకున్నారని మరోసారి వాదించడం ద్వారా ఆ పత్రాల ఆధారంగా వెలువడిన కథ నాల్లో వాస్తవమున్నదని అంగీకరించినట్టయింది. పోనీ అలా అంగీకరించి, ఆ నిర్ణయాలను సహే తుకంగా సమర్ధించుకుంటే ఎవరూ అభ్యంతరపెట్టరు. ఆ జోలికి పోకుండా దొంగిలించిన పత్రాలు గనుక అసలు వాటిని పరిగణనలోకే తీసుకోరాదన్న తర్కానికి దిగింది. దీనికి ధర్మాసనం అంగీ కరించలేదు. తాము వెల్లడించదల్చుకోని అంశాలన్నిటినీ గంపగుత్తగా అధికార రహస్యాలుగా పరిగణిం చడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. గోప్యత పేరు చెప్పి ప్రజాప్రయోజనంతో ముడిపడి ఉండే అనేక అంశాలను ప్రభుత్వాలు వెల్లడి కానీయడం లేదు. సమాచారాన్ని తెలుసుకునే హక్కు వాక్‌స్వాతంత్య్రంలో భాగమేనని సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాల్లో చెప్పింది. కనుక అధి కార రహస్యాల చట్టం కింద కేసులు పెట్టడం వాక్ స్వాతంత్య్రాన్ని, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమే అవుతుంది. మన రాజ్యాంగంలోని 19(2) అధికరణ వాక్ స్వాతంత్య్రంపై ఆంక్షలు విధించడానికి సహేతుకమైన కారణాలు చెప్పమంటున్నది. కానీ అధికార రహస్యాల చట్టం దీన్ని విస్మరించింది. ప్రభుత్వాలకు బయటపెట్టడం ఇష్టం లేని ఏ అంశమైనా ఈ చట్టం పరిధిలోకొస్తుంది. వెనువెంటనే దానికింద చర్యలు మొదలవుతాయి. ఒకపక్క ప్రజాస్వామిక దేశమని ఘనంగా ప్రక టించుకుంటూ ఇలా విచక్షణారహితంగా వ్యవహరించే ధోరణి సరికాదు. నిజానికి మన దేశంలో సాగుతున్న స్వాతంత్య్రోద్యమాన్ని అణిచేయడానికి బ్రిటిష్ పాలకులు తెచ్చిన చట్టమిది. ఈ సందర్భంగా పెంటగాన్ పత్రాల విషయంలో అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయ మూర్తులు ఉదాహరించారు. వియత్నాం యుద్ధంపై ప్రభుత్వం పౌరులకు అసత్యాలు చెబుతున్న దని చెబుతూ అందుకు సాక్ష్యంగా ‘న్యూయార్క్‌టైమ్స్’ అధికారిక పత్రాలను ప్రచురించింది. వీటిని అడ్డుకోవడం చెల్లదని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ధర్మాసనంలోని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ కౌల్ అభిప్రాయాలతో ఏకీభవిస్తూనే జస్టిస్ కేఎం జోసెఫ్ విడిగా రాసిన తీర్పు పత్రికాస్వేచ్ఛకు నీరాజనాలు పట్టింది. అదే సమయంలో మీడియా నిర్వహిం చాల్సిన, నిర్వహిస్తున్న పాత్రపై నిశితంగా వ్యాఖ్యానించింది. చలనశీలమైన ప్రజాస్వామ్యం వర్థిల్ల డానికీ, అది బలపడటానికి మీడియా నిర్వహిస్తున్న పాత్రను కొనియాడుతూనే దానిద్వారా ప్రస రించే సమాచారమంతా సత్యనిష్టకు లోబడి ఉండాలి తప్ప ఇతరత్రా అంశాలతో కలుషితం కాకూ డదని తీర్పు హితవు చెప్పింది. అలా కలుషితం కావొద్దని డిమాండ్ చేసే హక్కు వినియోగదారు లకు ఉంటుందని కూడా గుర్తుచేసింది. ఈ విషయంలో మీడియా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవ సరం ఉందని వేరే చెప్పనవసరం లేదు. ఏదేమైనా రఫేల్ వివాదం సాధ్యమైనంత త్వరగా ముగిసి మన రక్షణ దళాలు కోరుకున్న యుద్ధ విమానాలు సకాలంలో వారికి చేరుతాయని ఆశిద్దాం. -
రఫేల్ కేసు : కేంద్రానికి సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రఫేల్ తీర్పుపై రివ్యూ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. రివ్యూ పిటిషన్ల విచారణకు అంగీకరించిన సుప్రీం త్వరలో విచారణ తేదీని నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. రఫేల్ ఒప్పంద పత్రాలను తస్కరించారన్న కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చుతూ తీర్పును వెలువరించింది. రఫేల్ ఒప్పందంలో విచారణ చేపట్టాల్సిన అంశాలేమీ లేవని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ విపక్షాలు సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించి రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నూతన అంశాలతో పిటిషనర్లు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై విచారణ కొనసాగిస్తామని కోర్టు తేల్చిచెప్పింది. -
వాద్రాతో పాటు మోదీనీ విచారించాలి : రాహుల్
చెన్నై : ఆరోపణలు ఎదుర్కొనే ప్రతి ఒక్కరినీ విచారించే హక్కు ప్రభుత్వానికి ఉందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. చట్టం ప్రతి ఒక్కరికీ వర్తించాలని, కేవలం ఎంపిక చేసుకున్న కొందరికే కాదని ప్రధాని మోదీకి చురకలు అంటించారు. రఫేల్ ఒప్పందంపై ప్రధాని సమాంతర చర్చలు జరిపారని ప్రభుత్వ పత్రాల్లోనే వెల్లడైందని, ఆరోపణలు వచ్చిన ప్రతిఒక్కరిపై వాద్రా అయినా ప్రధాని మోదీ అయినా అందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. రాహుల్ బుధవారం చెన్నైలోని స్టెల్లా మేరీస్ కళాశాలలో పెద్దసంఖ్యలో హాజరైన విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నడైనా 3000 మంది మహిళల మధ్యలో నిలుచుని ఇలా మాట్లాడారా..? మీరు అడిగే ప్రశ్నలకు బదులిచ్చారా అని నిలదీశారు. దేశంలో ప్రస్తుతం రెండు భిన్న సిద్ధాంతాల మధ్య పోరాటం సాగుతోందని, ప్రజలంతా కలిసిమెలిసి ఐక్యంగా జీవించాలన్నది ఒక సిద్ధాంతమైతే, తమ భావజాలాన్ని దేశంపై రుద్దాలని మోదీ సర్కార్ అనుసరిస్తున్న మరో సిద్ధాంతమని చెప్పుకొచ్చారు. -
‘రఫేల్ ఒప్పంద పత్రాలు భద్రం’
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పంద పత్రాలు గల్లంతు వ్యవహారం కలకలం రేపడంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. రఫేల్ ఒప్పంద పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురికాలేదని, వాటి నకళ్లను మాత్రమే పిటిషనర్లు తమ దరఖాస్తుల్లో వాడారని మాత్రమే తాను సుప్రీం కోర్టు ఎదుట పేర్కొన్నానని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వివరణ ఇచ్చారు. రఫేల్ యుద్ధ విమాన ఒప్పంద పత్రాలు చోరీ అయ్యాయని బుధవారం సర్వోన్నత న్యాయస్ధానంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. సున్నితమైన సమాచారం కలిగిన ఈ పత్రాలు మాయం కావడంపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రఫేల్ పత్రాలు చోరీకి గురయ్యాయని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని కేకే వేణుగోపాల్ పేర్కొన్నారు. రఫేల్ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ, ప్రశాంత్ భూషణ్‌లు తమ దరఖాస్తులో అనుబంధంగా ఒరిజినల్ పత్రాల ఫోటోకాపీలను వాడారని వేణుగోపాల్ పేర్కొన్నారు. కాగా అటార్నీ జనరల్ చోరీ అనే పదాన్ని వాడకుండా ఉండాల్సిందని అధికార వర్గాలు సైతం వ్యాఖ్యానించాయి. మరోవైపు ఈ పత్రాల ఆధారంగా కథనాలను ప్రచురించినందుకు అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేస్తామని ప్రభుత్వం ది హిందూ వార్తాపత్రికను హెచ్చరించింది. -
రఫేల్ ‘దొంగ’ రహస్యం!
రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు సంగతులు దర్యాప్తు చేయాలా, వద్దా అనే అంశంలో సుప్రీంకోర్టు కీలకమైన విచారణ మళ్లీ జరపవలసి వచ్చింది. రఫేల్ డీల్ అమలు, విమానాల కొనుగోలు, ధరల విషయంలో ఏ మార్పు లేకుండా కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తొలుత భావించింది. కానీ ఆ నిర్ణయానికి రావడానికి ఆధారమైన పత్రాలలో అనుమానాలు ఉండడం వల్ల సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తీవ్రవాదనలు ప్రతి వాదనలువిన్నారు. పునఃసమీక్షా పిటిషన్ కొట్టి వేయాలని అటార్నీ జనరల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రార్థించింది. హిందూ తదితర పత్రికల్లో వచ్చిన కీలక పత్రాలను పిటిషనర్లు ఉటంకిస్తూ ఈ కేసును తిరగతోడవలసిందేనని కోరారు. భారత అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ చేసిన వాదనల ప్రభావం ఏవిధంగా ఉంటుందో అనే చర్చ సాగుతున్నది. రెండు పత్రికలలో ప్రచురించిన పత్రాలను ఆధారం చేసుకుని ప్రశాంత్ భూషణ్, అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా వాదిస్తున్నారనీ, ఆ పత్రాలను ప్రస్తుత లేదా మాజీ పబ్లిక్ సర్వెంట్లు దొంగిలించి వారికి ఇచ్చి ఉంటారని, ఇవి రఫేల్ డీల్‌కు చెందిన రహస్య పత్రాలనీ ఏజీ వేణుగోపాల్ అన్నారు. ఈ రహస్యపత్రాలు దొంగిలించిన వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా సుప్రీంకోర్టుకు వివరించారు. అంటే హిందూ ఎడిటర్ ఎన్ రాం మీద, ప్రశాంత్ భూషణ్ మీద అధికార రహస్యాల చట్టం కింద క్రిమినల్ కేసులు ఉంటాయా? ముందు ఆ పత్రాలు దొంగిలించిన వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పినా ఆ తరువాత కాసేపటికి జర్నలిస్టుల మీద, లాయర్లమీద చర్యలు ఉండబోవని అటార్నీ జనరల్ వివరణ ఇచ్చారు. అంటే రక్షణ శాఖ నుంచి బయటకి ఈ రహస్యాలు పొక్కడానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకుంటారేమో? ఏ దేశంలోనూ రక్షణ ఒప్పందాలమీద కోర్టుల్లో కేసులు వేయరని, కోర్టులు విచారించవని కూడా ఆయన అన్నారు. అయితే బోఫోర్స్ కేసుల సంగతేమిటని సుప్రీంకోర్టు అడిగింది. డిఫెన్స్ డీల్‌లో సంప్రదింపులు బేరసారాలు సాగిస్తున్న ఏడుగురు సభ్యుల బృందంలో ముగ్గురి అసమ్మతి పత్రం పత్రికలలో దర్శనమిచ్చింది. ఆ అసమ్మతి అవాస్తవమని ప్రభుత్వం వాదించడం లేదు. అది దొంగ పత్రం అనడం లేదు. అది దొంగి లించిన పత్రం కనుక ముట్టుకోవద్దంటున్నది ప్రభుత్వం. అవి దొంగ పత్రాలు కావనీ, అంటే అవి నిజాలనీ, ప్రమాదకరమైన నిజాలనీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అధికార రహస్యాలన్న పదమే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రభుత్వం అధికారికంగా చేసిన అంశాలు రహస్యాలు ఎందుకవుతాయి? సమాచార హక్కు చట్టం వచ్చినపుడు అధికార రహస్యాల చట్టం పోయిందనుకుని ఎంపీ రాం జెఠ్మలానీ ఆ కఠిన చట్టం తీసివేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ చట్టాన్ని కాంగ్రెస్, కాంగ్రెసేతర ప్రభుత్వాలు, బీజేపీతో కూడిన ఎన్డీయే ప్రభుత్వాలు కూడా వాడుకుంటున్నాయి. సమాచార హక్కు చట్టంతో అధికార రహస్యాల చట్టం విభేదిస్తే ఆ మేరకు సమాచార హక్కు చట్టం అమలవుతుందే కానీ అధికార రహస్య చట్టం పనిచేయదని సమాచార హక్కు చట్టంలో చాలా స్పష్టంగా వివరించారు. జాతీయ భద్రత కోసం రహస్యాలు కాపాడవచ్చునని, జాతీయ భద్రతతో సంబంధం లేని భాగాలను సమాచార హక్కు చట్టం ప్రకారం వెల్లడించాలని కూడా ఎన్నో సందర్భాలలో నిర్ధారిం చారు. ఒకే పత్రంలో భద్రతా రహస్యాలు, భద్రతకు సంబంధంలేని అంశాలు ఉంటే, రక్షించవలసిన అంశాలు తొలగించి, మిగిలిన సమాచారం ఇవ్వాలని కూడా చట్టంలో స్పష్టంగా ఉంది. రక్షణ రంగం సమాచార హక్కు చట్టం పరిధిలోనే ఉంది. రఫేల్ డీల్‌లో భారతదేశ భద్రతకు సంబంధిం చిన అంశాలేమయినా ఉంటే ప్రశాంత్ భూషణ్‌కు, అరుణ్ శౌరీకి, యశ్వంత్ సిన్హాకే కాదు ఎవరికీ ఇవ్వకూడదు. కానీ బేరసారాల విషయంలో వచ్చిన తేఢాలు, భిన్నాభిప్రాయాలు జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు అవుతాయా? పెంచిన ధరలు, చెల్లించిన డబ్బు కూడా రహస్యాలేనా? విపరీతంగా పెంచిన ధరలు, విమానాల సంఖ్యను 126 నుంచి 36కు తగ్గించడం వెనుక కారణాలు కూడా రహస్యాలేనా? బేరసారాల బృందంలోనే ముగ్గురి తీవ్ర అసమ్మతి కూడా రహస్యమేనా? నేరం జరిగిందని ఆరోపణ రాగానే సాక్ష్యాలేవీ అంటారు. సాక్ష్యం చూపగానే నీకెలా వచ్చిందంటారు. దొంగతనం చేశావంటారు. మా ప్రైవసీని భంగపరిచి సాక్ష్యాలను సేకరిస్తావా? ముందు నీవు జైలుకు వెళ్లు అంటారు. రహస్యాలు, ప్రైవసీ తెరల చాటున నేరాలు, లంచాలు వర్థిల్లడమేనా రాజ్యాంగ పాలన? వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
అధికారం–రహస్యం!
కేంద్ర ప్రభుత్వమూ, బీజేపీ నేతలూ రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై సాగుతున్న రగడకు ముగింపు పలకాలని ఎంత ప్రయత్నిస్తున్నా అందులో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తు న్నాయి. ఆ ఒప్పందం విషయంలో దాఖలైన వ్యాజ్యాలను కొట్టేస్తూ గత డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలని సుప్రీంకోర్టును కోరుతూ ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదప్రతివాదాలు జరిగిన బుధవారంనాడే ఆంగ్ల దినపత్రిక ‘ద హిందూ’ రాసిన కథనం పెను సంచలనం సృష్టించింది. ఇలాంటి కథనాలు అధికారంలో ఉన్నవారిని సహజంగానే ఇబ్బంది పెడ తాయి. వారు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఆశ్చర్యకరంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో విచిత్రమైన వాదన చేసింది. యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీ అయ్యాయని, వాటి ఆధారంగా ఆ పత్రిక రఫేల్‌పై వరస కథనాలు రాస్తూ అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన నేరానికి పాల్పడిందని అటార్నీ జనరల్(ఏజీ) కెకె వేణుగోపాల్ ధర్మాసనానికి చెప్పారు. ఈ దొంగతనం నేరంపై దర్యాప్తు జరుగు తున్నదని వివరించారు. కానీ ఈ క్రమంలో మీడియాలో వెలువడిన కథనం సరైందేనని పరోక్షంగా ఆయన అంగీకరించినట్టయింది. రఫేల్ ఒప్పందంపై కావొచ్చు... మరొక అంశంలో కావొచ్చు మీడియాలో వెలువడుతున్న కథనాలు తప్పయితే వాటిపై అధికారంలో ఉన్నవారు వివరణ ఇవ్వొచ్చు. వాస్తవాలేమిటో ప్రజలకు వివరించవచ్చు. తప్పుడు సమాచారం అందించినందుకు మీడియా సంస్థలపై చట్టప్రకారం చర్య తీసుకోవచ్చు. పొరపాట్లకు మీడియాతో సహా ఎవరూ అతీతులు కాదు. కానీ ఏజీ చేసిన వాదన భిన్నంగా ఉంది. ‘హిందూ’ పత్రిక గత నెల 8న ప్రచురించిన కథనం, ఆ తర్వాత వెలువడిన కథ నాలు, తాజాగా బుధవారం అదే పత్రిక రాసిన కథనం రఫేల్ ఒప్పందంపై ప్రభుత్వం చేస్తున్న వాదనలపై సందేహాలు కలిగించాయి. వీటిలో ఏది నిజమో తెలుసుకోవాలని పౌరులు సహజం గానే కోరుకుంటారు. ఈ సమయంలో సంతృప్తికరమైన వివరణనివ్వకపోగా ఒప్పంద పత్రాలను ఎవరో దొంగిలించారని చెప్పడం వింత కాదా? ఇంతకూ ‘హిందూ’ తాజా కథనం ఏం చెబు తోంది? రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ఏకకాలంలో సమాంతరంగా రెండు బృందాలు ఫ్రాన్స్‌తో మంతనాలు జరపడం పర్యవసానంగా కలిగిన నష్టం గురించి రక్షణ మంత్రిత్వ శాఖ బృందం ఒక నివేదికలో ఏకరువు పెట్టిందని తెలిపింది. అలాగే ఒప్పందానికి బ్యాంకు గ్యారెంటీ తీసుకోనట్టయితే మనకు నష్టం జరుగుతుందని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వ్యక్తం చేసిన అభి ప్రాయానికి భిన్నంగా ఫ్రాన్స్ ప్రధాని ఇచ్చే ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’తో సరిపెట్టుకుని ఒప్పందానికి అంగీకరించారని కూడా ఆ పత్రిక వివరించింది. గ్యారెంటీలుంటే బ్యాంకులు తీసుకునే కమిషన్లు కూడా కలిసి ఒప్పందం తడిసి మోపెడవుతుందని చెప్పినవారు... అటువంటివి లేకుండానే ఒప్పం దం వ్యయాన్ని పెంచేశారని ఆ కథనం వెల్లడించింది. లోగడ అదే పత్రిక వెల్లడించిన కథనం కూడా కీలకమైనదే. రఫేల్ ఒప్పందంపై రక్షణ శాఖ బృందం చర్చిస్తుండగా ప్రధాని కార్యాలయం (పీఎంఓ) అధికారులు కూడా అదే అంశంపై ఫ్రాన్స్‌తో మంతనాలు జరపడం సరికాదని అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పరికర్ దృష్టికి రక్షణ అధికారులు తీసుకొచ్చారని ఆ కథనం వెల్లడించింది. రఫేల్ ఒప్పందంపై సాగుతున్న వివాదం త్వరగా ముగిసిపోవాలని కేంద్రం ఆశిస్తోంది. ప్రజలు ఆశిస్తున్నదీ అదే. కానీ అందుకు పారదర్శకంగా వ్యవహరించడం, అన్ని రకాల సందేహా లకూ సవివరమైన, సహేతుకమైన జవాబులివ్వడం అవసరం. అలాగైతేనే అది సాధ్యమైనంత త్వరగా సమసిపోతుంది. గతంలో రాజీవ్‌గాంధీ హయాంలో జరిగిన బోఫోర్స్ శతఘ్నుల కొను గోలులో కుంభకోణం జరిగిందని ఆరోపణలొచ్చినప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజాలను తొక్కిపెట్టాలని చూడటంతో అది పెను భూతంలా మారిన సంగతి ఎవరూ మరిచిపోరు.ఈ వ్యవ హారంలో కీలక పాత్రధారి ఒట్టావియో కత్రోకి 2013లో మరణించడంవల్లా, సీబీఐ చేతులెత్తేయడం వల్లా చివరకు అది అటకెక్కింది. అయితే కాంగ్రెస్‌పై ఈనాటికీ ఆ మచ్చ పోలేదు. రక్షణ కొనుగోళ్ల ఒప్పందాలు వివాదాల్లో చిక్కుకుంటే మన సైనిక దళాల అవసరాలు తీరడంలో జాప్యం జరుగు తుంది. అది దేశ భద్రతకు మంచిది కాదు. పాలకులు పారదర్శకంగా ఉంటే ఈ జాప్యాన్ని నివారిం చడం అసాధ్యమేమీ కాదు. ధర్మాసనం ముందు ఏజీ చేసిన వాదన ఆ దిశగా లేదు సరిగదా... అది మీడియాను బెదిరించే పద్ధతుల్లో ఉంది. దేశంలో వివిధ భాషల్లో పత్రికలు వెలువడటం మొదలవుతున్న దశలో వాటిని నియంత్రిం చడం కోసం, ప్రజలకు వాస్తవాలు అందకుండా చేయడం కోసం 1889లో బ్రిటిష్ వలస పాలకులు ఈ అధికార రహస్యాల చట్టం తీసుకొచ్చారు. దాన్ని 1904లో మరిన్ని కఠిన నిబంధనలు చేరుస్తూ సవరించారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న చట్టం 1923లో సవరించింది. ఈ చట్టం కొనసాగడం మన మహోన్నతమైన స్వాతంత్య్రోద్యమానికి అపచారం చేయడం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. కానీ కేంద్రంలో కాంగ్రెస్ మొదలుకొని ఎన్ని పార్టీలు అధికారంలోకొచ్చినా... సమాచార హక్కు చట్టం వచ్చి దాదాపు పదిహేనేళ్లు అవుతున్నా ఈ అప్రజాస్వామిక చట్టం కొనసాగుతూనే ఉంది. మన పార్టీల చిత్తశుద్ధిని, మన ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తూనే ఉంది. కాలం చెల్లిన చట్టాలను సమీక్షించి బుట్టదాఖలా చేస్తామని నాలుగేళ్లక్రితం కేంద్రం ప్రకటించినప్పుడు అందరూ హర్షిం చారు. ఆ సమీక్ష ఎంతవరకూ వచ్చిందో తెలియదుగానీ... ఇటువంటి చట్టాలు మాత్రం క్షేమంగా కొనసాగుతున్నాయి. ఈ చట్టం విషయంలో కేంద్రం వైఖరిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సంధించిన ప్రశ్నలు పాలకుల కళ్లు తెరిపించాలి. రఫేల్ ఒప్పందంలో అన్ని కీలకాం శాలనూ ప్రజలముందు ఉంచడంతోపాటు అధికార రహస్యాల చట్టాన్ని తక్షణం ఎత్తేయాలి. -
మోదీకి రాహుల్ చురకలు
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంలో ప్రధాని నరేంద్ర మోదీని విచారించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రఫేల్ ఒప్పందంలో ప్రధాని మోదీ బైపాస్ సర్జరీ చేశారు. అనిల్ అంబానీకి ప్రయోజనం చేకూర్చేలా ఒప్పందంలో జాప్యం చేశారని రాహుల్ వ్యాఖ్యానించారు. 2016లో నోట్ల రద్దు తర్వాత లక్షలాది ఉద్యోగాలు గల్లంతైన తరహాలో రఫేల్ ఒప్పందానికి సంబంధించిన ఫైళ్లు మాయమయ్యాయని రాహుల్ ఎద్దేవా చేశారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించి కీలక పత్రాలు చోరీ అయ్యాయని సుప్రీం కోర్టులో ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో రాహుల్ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ‘ఈ రోజుల్లో అన్నీ అదృశ్యమవుతున్నాయి..రెండు కోట్ల మంది ఉద్యోగాలు కనుమరుగయ్యాయి..ప్రజలందరి ఖాతాల్లో రూ 15 లక్షలు జమచేస్తానన్న హామీ మాయామైంది...వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కనుమరుగైంది..ఇప్పుడు రఫేల్ ఫైళ్లు మాయమయ్యా’యని రాహుల్ పేర్కొన్నారు. -
‘రక్షణ’లో రాజీనా?
రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా కాగ్ నివేదిక ఉన్నప్పటికీ.. గత, ప్రస్తుత ప్రభుత్వాలు భారత రక్షణ ఒప్పందాల్లో అనుసరించిన విధానాలను మాత్రం ఘాటుగానే విమర్శించింది. అధికారంలో ఎవరున్నా.. రక్షణ ఒప్పందాల్లో అవినీతి ఆరోపణలు వస్తుండడం వల్ల నాణ్యత లేని ఆయుధాలు భారత్‌కు వస్తున్నాయా? అన్న అనుమానం ప్రజల్లో ఎదురవుతోందని కాగ్ పేర్కొంది. సర్వసాధారణంగా రక్షణ ఒప్పందాల్లో నెలకొంటున్న లొసుగులను కాగ్ నివేదిక వివరించింది. వాయుసేన విధానాల్లో లోపాలు విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేయాలంటే భారత వాయుసేన తమ నిబంధనలు, వాతావరణ పరిస్థితుల మేరకు ఎలాంటి ఆయుధాలు ఉండాలో, ఎంత ధర ఉండాలో.. ఎంతమేరకు సైనిక అవసరాలున్నాయో ముందే స్పష్టంగా చెప్పాలి. కానీ వాయుసేనకి ఈ అంశాలపై స్పష్టత కొరవడింది. ఎయిర్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ (ఏఎస్‌క్యూఆర్) సూత్రీకరణ విధానాలను మెరుగుపరచుకోకపోవడం వల్ల భారత్ పలు ఆయుధాల ఒప్పందాల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అపాచి అటాక్ హెలికాప్టర్లు, చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి కొనుగోలు చేయడానికి 2015లో మోదీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే వాటికి బదులుగా రష్యాకు చెందిన మిల్ ఎంఐ–26 హెలికాప్టర్లను కొనుగోలు చేసి ఉంటే భారత్‌కు ఎంతో ప్రయోజనకరంగా ఉండేదనే చర్చ జరుగుతోంది. యుద్ధ ప్రాంతాలకు సైనికుల్ని, ఆయుధాల్ని చేరవేయడంలో చినూక్ కంటే మిల్ ఎంఐ–26కున్న సామర్థ్యం రెట్టింపని కొందరి వాదన. వాయుసేన తన అవసరాలను తక్కువ చేసి చూపించడంతో ప్రభుత్వం బోయింగ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలుస్తోంది. ప్రామాణిక ధరల్లో మార్పు ఆయుధాల కొనుగోలు వ్యవహారంలో సర్వసాధారణంగా ప్రభు త్వం ఒక ప్రామాణిక ధరను నిర్ణయించాలి. దానికి అనుగుణంగా వచ్చిన టెండర్లనే తీసుకోవాలి. కానీ ప్రభుత్వం కొందరికి లబ్ధి చేకూర్చేందుకు టెండర్లని విప్పిచూసిన తర్వాత కూడా ఆ ధరల్ని మార్చేస్తుందని కొందరు ఆరోపిస్తున్నారు. డాప్లర్ వెదర్ రాడార్స్, అపాచి అటాక్ హెలికాఫ్టర్ల కొనుగోలులో అత్యంత కీలకమైన వాయుసేన ప్రమాణాలను (ఏఎస్‌క్యూఆర్) అమ్మకందారులు పాటించకపోయినప్పటికీ కాంట్రాక్టుల్ని అప్పగించారనే విమర్శలున్నాయి. బిడ్లు మార్చుకునే అవకాశం ఆయుధాల కొనుగోలుకు టెండర్లను పిలిచాక విక్రేతలు బిడ్ వేస్తే దాన్ని మార్చే చాన్స్ ఇవ్వకూడదు. కానీ యూపీఏ ప్రభుత్వం యథేచ్ఛగా ఈ నిబంధనను తుంగలో తొక్కిందనే విమర్శలున్నాయి. 2012లో యూపీఏ హయాంలో స్విట్జర్లాండ్‌కు చెందిన పిలాటస్ కంపెనీకి బిడ్ మార్చుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని విపక్షాలు ఆరోపించాయి. అప్పుడప్పుడే విమానాల తయారీ రంగంలోకి అడుగుపెట్టిన అతి చిన్న కంపెనీకి అలాంటి అవకాశం ఇవ్వడం వల్ల భారత్‌కు నాసిరకమైన విమానాలే వచ్చాయి. నిర్వహణ వ్యయంపై అవగాహన లేదు గతంలో.. ఆయుధాలైనా, యుద్ధ విమానాలైనా తక్కువ ధరకి వస్తున్నాయి కదా అని సంస్థ స్థాయిని చూడకుండా కొనుగోలు జరిగింది. వాటి నిర్వహణ వ్యయంపై ప్రభుత్వాలకు కనీస అంచనాలు ఉండకపోవడంతో భారీగా నష్టాలొచ్చాయి. స్విస్ పిలాటస్ విమానాల నిర్వహణ భారాన్ని మోయలేక.. వాటి వాడకాన్ని 2017లో మోదీ సర్కార్ నిలిపివేసింది. అదే ఆ విమానాల కొనుగోలుకు ముందే ఆలోచించి ఉంటే ఆర్థికంగా చాలా మేలు జరిగేది. ఒప్పందాల్లో జాప్యాలు.. రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాలు కూడా మరో ప్రతికూల అంశమే. నాలుగు ఒప్పందాలకు మూడేళ్ల కంటే ఎక్కువ సమయం పడితే, ఏడు ఒప్పందాలు కుదరడానికి అయిదేళ్ల కంటే ఎక్కువ పట్టింది. వివిధ స్థాయిల్లో అనుమతులు కావాల్సి ఉండడం, అధికారుల్లో నెలకొన్న అలసత్వం వల్లే ఈ జాప్యాలు జరుగుతున్నాయని కాగ్ నివేదిక విమర్శించింది. జాప్యాలతో ధరల భారం.. ఇలా సంవత్సరాల తరబడి జాప్యం జరగడం వల్ల ఆయుధాల ధరలు పెరిగిపోవడంతో.. దేశ ఖజానాపై అదనపు భారం పడుతోంది. రష్యా లేదా కామన్వెల్త్ దేశాల నుంచి ఆయుధాల కొనుగోలులో ప్రతీ ఏడాది జాప్యానికి 5% ధర పెంచడానికి మన ప్రభుత్వం గతంలోనే అనుమతినిచ్చింది. అదే యూరోపియన్ దేశాలకు 3.5% పెంచుకునేలా నిర్ణయించింది. కానీ మార్కెట్ ధరల్ని పరిశీలించి చూస్తే మన దేశం అనుమతించిన దానికి సగానికి సగం తక్కువగా ఉండడం గమనార్హం. అయినప్పటికీ భారత్ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చెప్పాల్సిందంతా చెప్పేశాం.. అవన్నీ అబద్ధాలే..
-
అవన్నీ అబద్ధాలే... అంతా చెప్పేశాం..
న్యూఢిల్లీ : రఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, అనీల్ అంబానీలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రఫెల్ కుంభకోణంలో మోదీ పాత్ర ఉందని నిరూపితం అయిందని ఆయన అన్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీతో పాటు నిర్మలా సీతారామన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనన్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వంతో పీఎంవో నేరుగా చర్చలు జరిపిందంటూ... 2017 నాటి రక్షణశాఖ నోట్‌ను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశానికి చౌకీదారే దొంగ అని రుజువైందంటూ రాహుల్ ఆరోపించారు. రాహుల్ మాట్లాడుతూ.. ‘అనిల్ అంబానీకి రూ.30వేల కోట్లు దోచిపెట్టారు. గత ఏడాది నుంచి మేం అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పడం లేదు. రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అనిల్ అంబానీ పేరును ప్రధాని మోదీనే సూచించారంటూ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడే స్వయంగా చెప్పారు. ఈ కుంభకోణంపై పార్లమెంట్ జేఏసీ విచారణ చేయాలి. ఉన్నతస్థాయి కమిటీ చర్చలు జరుపుతున్నప్పుడు మోదీ ప్రమేయం ఎందుకు?. రక్షణ శాఖ వ్యతిరేకించినా ఎందుకు ఒప్పందం చేసుకున్నారు. మోదీ సర్కార్ సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించింది. మనీ ల్యాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రా, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని ప్రశ్నించుకోవచ్చు. అయితే రఫెల్ కుంభకోణంపై విచారణ జరపాల్సిందే’ అని డిమాండ్ చేశారు. చెప్పాల్సిందంతా చెప్పేశాం: నిర్మలా సీతారామన్ మరోవైపు రఫెల్ ఒప్పందంపై శుక్రవారం లోక్‌సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సభ్యుల నిరసలన మధ్యే ఇదే అంశంపై రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి దేశ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండటం ఇష్టంలేదన్న ఆమె... రఫెల్ ఒప్పందంపై రాహుల్ గాంధీ ఆరోపణలు అవాస్తవమన్నారు. ఇందుకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజాలు లేవని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మల్టీ నేషనల్ కంపెనీల కోసమే రఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందని ఆమె మండిపడ్డారు. దీనిపై ఇప్పటికే తాము చెప్పాల్సిందంతా చెప్పేశామన్నారు. -
మోదీ పిరికి వ్యక్తి: రాహుల్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పిరికివాడని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ వ్యాఖ్యానించారు. రాఫెల్ అంశంతోపాటు జాతీయ భద్రతపై తనతో కనీసం 5 నిమిషాల ముఖాముఖి చర్చకు వచ్చేందుకు మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ మైనారిటీ విభాగం సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. ‘గత ఐదేళ్లుగా మోదీతో పోరాడుతున్న నాకు ఆయన అసలు రంగేమిటో తెలిసిపోయింది. ఆయన పిరికి వ్యక్తి. జాతీయ భద్రత, రాఫెల్ అంశాలపై నాతో 5 నిమిషాలు ముఖాముఖి చర్చకు రమ్మనండి’ అంటూ సవాల్ విసిరారు. ‘మీరంతా కలిసికట్టుగా ఉండి, ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోదీని శాయశక్తులా ఎదుర్కోండి. వారు పిరికివాళ్లలా పారిపోతారు’ అంటూ కార్యకర్తలకు రాహుల్ పిలుపునిచ్చారు. ‘మోదీ అధికారంలో ఉండగా తమ పని తాము చేసుకోలేమంటూ నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు బహిరంగంగా చెప్పారు. సుప్రీంకోర్టు తన విధులను నిర్వర్తించకుండా చేసేది బీజేపీ చీఫ్ అమిత్ షా అని వారు పరోక్షంగా చెప్పారు’ అని గుర్తు చేశారు. ‘డోక్లాం వద్ద సరిహద్దుల్లోకి చైనా తన బలగాలను మోహరించిన సమయంలోనే ఎటువంటి ఎజెండా లేకుండానే చైనా అధ్యక్షుడితో భేటీకి వెళ్లి మోకరిల్లారు. ఇది చూసి మోదీకి 56 అంగుళాలు కాదు కదా కనీసం 4 అంగుళాల ఛాతీ కూడా లేదని చైనాకు తెలిసిపోయింది’ అని ఎద్దేవా చేశారు. ప్రధానకార్యదర్శిగా తొలిసారి ప్రియాంక రాహుల్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో గురువారం మొదటిసారిగా హాజరయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఏర్పాటైన ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జులు హాజరయ్యారు. భేటీలో ముందు వరుసలో రాహుల్, కేసీ వేణుగోపాల్, ఆజాద్, ఖర్గే ఆసీనులు కాగా రాహుల్‌కు దూరంగా కుడివైపు వరుస మధ్యలో జ్యోతిరాదిత్య సింధియా పక్కన ప్రియాంక కూర్చున్నారు. వీరిద్దరూ ఇటీవల ఉత్తరప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జులుగా నియమితులయిన విషయం తెలిసిందే. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ చాంబర్ పక్కనే ఉన్న గదిని ప్రియాంకకు, జ్యోతిరాదిత్యకు కలిపి కేటాయించారు. దీని ద్వారా ఎవరూ ఎక్కువ కాదనే సందేశం పంపించడమే ఉద్దేశమని భావిస్తున్నారు. కాగా, శనివారం పీసీసీల చీఫ్‌లు, సీఎల్పీ నేతలతో సమావేశమై వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై రాహుల్ సమీక్షించనున్నట్లు సమాచారం. ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు చేస్తాం మహిళా కాంగ్రెస్ చీఫ్ సుస్మితా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేస్తామని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ చీఫ్ సుస్మితా దేవ్ ప్రకటించారు. ఈ చట్టం ద్వారా ముస్లిం మహిళలు, పురుషుల మధ్య విద్వేష వాతావరణాన్ని ప్రధాని మోదీ సృష్టించారని విమర్శించారు. ‘ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందితే ముస్లిం మహిళలకు సాధికారత లభిస్తుందని చాలామంది చెప్పారు. కానీ ముస్లిం పురుషులను జైళ్లలో పెట్టేందుకు ప్రధాని దీన్ని ఓ ఆయుధంగా రూపొందించారు. కాగా, మహిళల సాధికారితకు ఏ ప్రభుత్వం చట్టాన్ని తెచ్చినా మేం సమర్థిస్తాం. ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించిన∙ముస్లిం మహిళలను అభినందిస్తున్నా’ అని అన్నారు. -
అది మహా కల్తీ కూటమి
ప్రధాని మోదీ ‘ఎలక్షన్ మోడ్’లోకి వెళ్లిపోయారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు లోక్‌సభలో సమాధానమిస్తూ.. దాదాపు ఎన్నికల ప్రచార ప్రసంగమే చేశారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తున్న విమర్శలకు.. అంశాలవారీగా ఘాటు సమాధానమిచ్చారు. దాదాపు గంటన్నరకు పైగా చేసిన ప్రసంగంలో.. తీవ్రమైన విమర్శలు, ఆరోపణలతో పాటు వ్యంగ్య వ్యాఖ్యలు, ఛలోక్తులతో కాంగ్రెస్‌ను చీల్చి చెండాడారు. వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాడంటూ తనపై చేస్తున్న ఆరోపణలకు బదులిస్తూ.. ‘ దేశంలో ఎమర్జెన్సీ విధించింది మీరే.. న్యాయవ్యవస్థను, సీబీఐని, ఈడీని అవమానించింది మీరే.. వైమానిక దళ అధిపతిని గూండాగా అభివర్ణించింది మీరే.. సైన్యం బలోపేతం కాకూడదని కోరుకునేదీ మీరే’ అంటూ తిప్పికొట్టారు. రఫేల్ డీల్‌ను తప్పుపట్టడంపై స్పందిస్తూ.. ఏ కంపెనీ తరఫున బిడ్డింగ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ను ఎద్దేవా చేశారు. విపక్ష మహా కూటమిని విలువల్లేని, అవసరార్ధం కలిసిన ‘కల్తీ’ కూటమి అని, అందులోని నేతలంతా బెయిల్‌పై బయట ఉన్నవారేనని, ప్రజలు వారిని తప్పక తిప్పికొడతారని చురకలంటించారు. పనిలో పనిగా, గతంలో కాంగ్రెస్ పార్టీపై మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలనూ ప్రస్తావించారు. కాంగ్రెస్‌తో కలవడం ఆత్మహత్య చేసుకోవడంతో సమానమని అంబేద్కర్ నాడే చెప్పారని, స్వాతంత్య్రం రాగానే కాంగ్రెస్‌ను రద్దు చేయాలని గాంధీ కోరుకున్నారని గుర్తు చేశారు. ఈ లోక్‌సభలో బహుశా చివరిదైన ప్రసంగాన్ని.. సభ సాక్షిగా దేశ ప్రజలకు తన వాదన వినిపించేందుకు ప్రధాని సమర్ధంగా ఉపయోగించుకున్నారు. న్యూఢిల్లీ: ‘కాంగ్రెస్ న్యాయ వ్యవస్థను బెదిరించింది. దేశంలో అత్యయిక పరిస్థితి విధించింది. రాజ్యాంగ నిబంధన పేరిట ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చింది. సైన్యాన్ని అవమానించింది. ఆర్మీ చీఫ్‌ను రౌడీగా చిత్రీకరించింది. కానీ అన్ని వ్యవస్థల్ని మోదీయే నాశనం చేస్తున్నారని రాద్ధాంతం చేస్తోంది’ అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఎన్నికల సీజన్లో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రధాని పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ సహా అన్ని విపక్షాలపై విరుచుకుపడ్డారు. మూకుమ్ముడిగా బెయిల్‌పై ఉన్న విపక్ష నాయకులు ప్రతిపాదిస్తున్న మహాకూటమి కల్తీమయమని, దాన్ని ఆరోగ్యవంతమైన మన ప్రజాస్వామ్యం తిరస్కరిస్తుందని అన్నారు. 55 నెలలుగా ఎన్డీయే పాలన సేవా దృక్పథంతో కొనసాగుతుండగా 55 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో మునిగితేలిందని చురకలంటించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం సహజమేనని, కానీ మోదీని, బీజేపీని విమర్శిస్తూ కొందరు దేశంపై దాడిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చకు మోదీ సమాధానమిచ్చారు. ఆ తరువాత తీర్మానాన్ని లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. నాలుగున్నరేళ్ల ఎన్డీయే పాలనలో జరిగిన అభివృద్ధిని నివేదించిన మోదీ..తమ ప్రభుత్వం అవినీతిని చాలా మటుకు తగ్గించిందని ఉద్ఘాటించారు. సుమారు గంటన్నర సేపు సాగిన మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. కాంగ్రెస్, ఇతర విపక్షాలపై.. ఎన్డీయే పనితనాన్ని ప్రజలు చూశారు. కాబట్టి కొన్ని పార్టీలు కలసి ఏర్పాటు చేయాలనుకుంటున్న అత్యంత కల్తీ అయిన కూటమిని దేశం కోరుకోవడం లేదు. ప్రభుత్వమనేది ప్రజల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. అవినీతికి స్థానం ఇవ్వొద్దు. దేశంలోనైనా, విదేశాల్లో అయినా, పార్లమెంట్ లోపల, వెలుపల అంతటా మేము సత్యమే మాట్లాడతాం. కానీ ఆ నిజాన్ని వినే సామర్థ్యం విపక్షాలకు తగ్గిపోయింది. ఎన్నికల సంఘం పనితీరును, ఈవీఎంలను కాంగ్రెస్ శంకించింది. దేశంలో ఎమర్జెన్సీని విధించింది. ఆర్మీని, ఆర్మీ చీఫ్‌ను అవమానించారు. ప్రణాళిక సంఘం జోకర్ల బృందమని ఎద్దేవా చేశారు. కానీ మోదీనే అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నారని తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు. ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసిన కాంగ్రెస్ చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాల్ని రద్దుచేసింది. ఒక్క ఇందిరా గాంధీ హయాంలోనే ఈ ఆర్టికల్‌ను 50 సార్లు ప్రయోగించారు. రక్షణ రంగంపై... యూపీయే హయాంలో రక్షణ రంగం ఎన్నో ప్రతిబంధకాలు ఎదుర్కొంది. ఆర్మీ సర్జికల్ దాడులు చేసే స్థాయిలో లేకపోయింది. మన ఆర్మీ, వైమానిక దళం బలోపేతం కావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. రఫేల్ రక్షణ కొనుగోళ్లకు సంబంధించి కాంగ్రెస్ ఏదైనా కంపెనీ తరఫున బిడ్డింగ్ వేస్తోందా? అని సూటిగా ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన జాప్యం కారణంగా సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, సరైన బూట్లు, కమ్యూనికేషన్ ఉపకరణాలు సకాలంలో అందలేదు. ఇదీ ఒక రకంగా దేశాన్ని మోసం చేయడమే అవుతుంది. పొరుగు దేశాలు అధునాతన∙ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్న సమయంలో 30 ఏళ్ల పాటు అడ్వాన్స్డ్ జెట్ విమానాల్ని ఎందుకు కొనుగోలు చేయలేదు? ఈ పాపానికి దేశం మిమ్మల్ని క్షమించదు. ముడుపులు లేకుండా రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడంపై కాంగ్రెస్ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వారి దృష్టిలో కమీషన్లు లేకుండా రక్షణ ఒప్పందం జరగడం అసాధ్యం. బీసీ అంటే బిఫోర్ కాంగ్రెస్.. ఏడీ అంటే ఆఫ్టర్ డైనాస్టీ కాలావధుల్ని సూచించే బీసీ(బిఫోర్ క్రైస్ట్), ఏడీ(ఆనో డొమిని)లకు మోదీ కొత్త అర్థాలు చెప్పారు. కాంగ్రెస్‌కు బీసీ అంటే బిఫోర్ కాంగ్రెస్ అని, ఏడీ అంటే ఆఫ్టర్ డైనాస్టీ అని ఎద్దేవా చేశారు. ‘ కాంగ్రెస్ దృష్టిలో బీసీ, ఏడీలకు వేరే అర్థాలున్నాయి. బీసీ(బిఫోర్ కాంగ్రెస్) అంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు అక్కడేం లేదని, ఏడీ(ఆఫ్టర్ డైనాస్టీ) అంటే తమ కుటుంబం అధికారంలోకి వచ్చాకే అంతా జరిగిందని వారు ప్రచారం చేసుకుంటున్నారు’ అని మోదీ అన్నారు. గడ్కరీకి సోనియా ప్రశంసలు రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి లోక్‌సభలో ఊహించని వ్యక్తి నుంచి ప్రశంసలు లభించాయి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు మీ శాఖ తరఫున చేస్తున్న కృషి ప్రశంసనీయమైనదని గడ్కరీని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ అభినందించారు. గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ మంత్రిత్వ శాఖకు సంబంధించి సభ్యులు రెండు ప్రశ్నలు సంధించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, తన శాఖ పరిధిలో చేసిన వివిధ పనుల వివరాలు, రహదారుల అనుసంధానికి చేసిన కృషిని సభకు వివరించారు. ‘పార్టీలతో సంబంధం లేకుండా అన్ని నియోజకవర్గాల్లో మా శాఖ తరఫున పనులు చేపట్టాం. దీనికి అన్ని రాజకీయ పక్షాలకు చెందిన సభ్యులు నన్ను అభినందించాలి’అని గడ్కరీ సమాధానమిచ్చారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ సభ్యుడు గణేశ్‌సింగ్ లేచి నిలబడి స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అద్భుత ఫలితాలు సాధించిన గడ్కరీ శాఖను సభ అభినందించాలని’ సూచించారు. మౌనంగా గమనిస్తున్న యూపీఏ చైర్పర్సన్ సోనియా నవ్వుతూ బల్లను చరుస్తూ గడ్కరీని అభినందించారు. ఉద్యోగ కల్పనపై.. రవాణా, ఆతిథ్యం, మౌలిక రంగాల్లో ఈ నాలుగున్నరేళ్లలో కోట్లాది కొత్త ఉద్యోగాలు కల్పించాం. వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లో ఉద్యోగాల సృష్టి జరిగినట్లు జాతీయ భవిష్య నిధి, నేషనల్ పెన్షన్ పథకం(ఎన్పీఎస్), పన్ను రిటర్నుల సమాచారం ధ్రువీకరిస్తోంది. 2018 నవంబర్ వరకు కేవలం 15 నెలల్లో 1.8 కోట్ల మంది తొలిసారిగా ఉద్యోగ భవిష్య నిధిలో చందాదారులుగా చేరారు. అందులో 64 శాతం మంది వయసు 28 ఏళ్ల కన్నా తక్కువే. 2014 సంవత్సరంలో ఎన్పీఎస్ పథకంలో ఉన్న వారి సంఖ్య 65 లక్షలు కాగా, 2018 అక్టోబర్ నాటికి ఆ సంఖ్య 1.2 కోట్లకు పెరిగింది. నాలుగేళ్లలో కొత్తగా 6.35 లక్షల మంది వృత్తి నిపుణులు ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. దేశంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా లాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల్ని మా ప్రభుత్వం ప్రారంభించింది. అవినీతిపై.. దేశాన్ని దోచుకున్న అవినీతిపరులు నన్ను చూసి భయపడుతూనే ఉన్నారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించేందుకు ఓ వైపు ఆటగాళ్లు కష్టపడుతోంటే, కాంగ్రెస్ పార్టీలోని కొందరు పెద్దలు తమ సంపదను పెంచుకునేందుకు దీన్ని ఒక అవకాశంగా మలుచుకున్నారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణ నిందితుల్ని దేశానికి తీసుకురావడం ద్వారా విపక్షాల్లో కొందరికి వణుకు పుడుతోంది. యూపీఏ హయాంలో ప్రభుత్వ పెద్దల నుంచి ఫోన్లు చేయించుకుని వ్యాపారవేత్తలు రుణాలు పొందిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ధరలు పెరిగాయి. ధరల్ని అదుపులో ఉంచేందుకు మా ప్రభుత్వం కృషిచేసింది. విధానపర నిర్ణయాలను ప్రభావితం చేసేలా నిధుల సేకరణలో పారదర్శకత పాటించని సుమారు 20 వేల స్వచ్ఛంద సంస్థల్ని మేం మూసివేశాం. -
అనిశ్చితి దాటి కొత్త ఆశల దిశగా..
న్యూఢిల్లీ: తీవ్ర అనిశ్చిత పరిస్థితులు రాజ్యమేలుతున్న సమయంలో 2014లో అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. ఆనాటి నుంచి నవభారత నిర్మాణానికి కృషిచేస్తూనే ఉందని తెలిపారు. రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్ని ప్రారంభిస్తూ కోవింద్ గురువారం ఉభయసభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. రఫేల్ ఒప్పందం, వెనకబడిన వర్గాలకు 10 శాతం కోటా, ట్రిపుల్ తలాక్ బిల్లు, పౌరసత్వ బిల్లు, నోట్లరద్దు తదితరాలను ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబిస్తూ సాగిన ఆయన ఉపన్యాసం సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రావడంతో ప్రాధాన్యత ఏర్పడింది. శుక్రవారం ప్రవేశపెట్టబోయే తాత్కాలిక బడ్జెట్లో రైతులకు పలు ఉపశమన చర్యలు ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యవసాయ సంక్షోభాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదులన్న కోవింద్..2022 నాటికి వారి ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకున్న నిర్ణయం చారిత్రకమని ప్రశంసించారు. 2016 నాటి సర్జికల్ దాడులను ప్రస్తావించగానే అధికార పార్టీ సభ్యులు బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో విజయాల్ని ప్రశంసించిన కోవింద్..తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పలు అంశాలపై సుమారు గంటసేపు కొనసాగిన కోవింద్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. నవభారత నిర్మాణంపై... 2014 ఎన్నికలకు ముందు దేశంలో అస్థిరత నెలకొంది. ఎన్నికల తరువాత ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నవభారత నిర్మాణానికి పూనుకుంది. అవినీతి, జడత్వ, లోపరహిత వ్యవస్థలతో కూడిన దేశ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం. నాలుగున్నరేళ్లుగా ప్రజల్లో కొత్త ఆశలు, విశ్వాసాన్ని పాదుకొల్పింది. దేశ ముఖచిత్రాన్నే మార్చివేసి సామాజిక, ఆర్థిక మార్పును తీసుకొచ్చింది. రైతు సమస్యలపై.. పవిత్ర పార్లమెంట్ తరఫున నేను మన అన్నదాతల్ని అభినందిస్తున్నా. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం రేయింబవళ్లు కష్టపడుతోంది. రైతుల సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. పౌరసత్వ బిల్లుపై.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో వేధింపులకు గురై భారత్‌కు వలసొచ్చే ముస్లిమేతరులకు ఈ బిల్లు న్యాయం చేస్తుంది. పౌరులకు సామాజిక, ఆర్థిక న్యాయం కల్పించడమే లక్ష్యంగా న్యాయ వ్యవస్థను సంస్కరించేందుకు పాటుపడుతోంది. ఆర్థిక వ్యవస్థపై.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 2014లో 2.6 శాతం ఉండగా, 2017 నాటికి 3.3 శాతానికి ఎగబాకింది. నాలుగున్నరేళ్లుగా నమోదవుతున్న వృద్ధిరేటే దీనికి కారణం. సగటున వార్షిక వృద్ధిరేటు 7.3 శాతంగా నమోదైంది. దీంతో భారత్..ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. నోట్లరద్దుపై.. అవినీతి, నల్లధన వ్యతిరేక పోరులో నోట్లరద్దు కీలక ఘట్టంగా నిలిచిపోయింది. ఈ నిర్ణయంతో సమాంతర ఆర్థిక వ్యవస్థ మూలాలు దెబ్బతిన్నాయి. సంక్షేమ పథకాలపై.. పీఎం జీవిత బీమా పథకంతో సుమారు 21 కోట్ల మంది, సౌభాగ్య పథకంతో 2 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయి. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా 9 కోట్ల టాయిలెట్లు నిర్మించాం. -
‘మోదీ వాయు దళాన్ని అమ్మేశారు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. భారతీయ వాయు దళాన్ని (ఐఏఎఫ్) ఆయన అమ్మేశారని, తన స్నేహితుడు, వ్యాపారవేత్త అనిల్ అంబానీకి రూ. 30 కోట్లను చౌర్యం చేసి కట్టబెట్టడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని ఆరోపించారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువక్రాంతి మేళా యాత్ర పేరిట తల్కతోర స్టేడియంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ప్రభుత్వంలోనే అసమ్మతి ఉందని, దీంతో ప్రధాని మోదీకి నిద్ర పట్టడం లేదని ఆరోపించారు. తాను ప్రధాని మోదీని మూడు, నాలుగు ప్రశ్నలు అడిగానని, ఆయన అటు, ఇటు, క్రింద, పైన చూశారని, అయితే తనవైపు, తన కళ్లలోకి కళ్లు పెట్టి మాత్రం చూడలేకపోయారని అన్నారు. ‘‘కాపలాదారు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోయారు’’ అని విమర్శించారు. మోదీ ప్రభుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా జరిగిన సంఘటనను రాహుల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై రాహుల్ గాంధీ ప్రసంగించినపుడు చెప్పిన మాటలను ప్రస్తావించారు. దొంగతనం చేసినవాళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరన్నారు. దేశాన్ని విభజించడమే లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈశాన్యంతోపాటు కశ్మీర్‌ను రావణకాష్టం చేసేశారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు కనీస ఆదాయ హక్కు కల్పిస్తామంటూ రాహుల్ హామీ ఇచ్చారు. ఆ ఆదాయాన్ని నేరుగా పేదల ఖాతాల్లో వేస్తామని, ఇందులో మధ్యవర్తులెవరూ ఉండబోరని ఆయన స్పష్టం చేశారు. -
గోవా సీఎం పారికర్‌తో రాహుల్ భేటీ
పనాజీ : గోవా సీఎం మనోహర్ పారికర్‌తో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మంగళవారం సమావేశమయ్యారు. వీరి మధ్య ఏయే అంశాలపై చర్చలు జరిగాయనే వివరాలు వెల్లడికాలేదు. పారికర్‌తో తాను కేవలం మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యానని, ఇది వ్యక్తిగత పర్యటనగా రాహుల్ వెల్లడించారు. నేటి ఉదయం గోవా సీఎం మనోహర్ పారికర్‌ను తాను కలిశానని, ఆయన సత్వరం కోలుకోవాలని ఆకాంక్షించానని రాహుల్ ట్వీట్ చేశారు. గోవా శాసన సభ ప్రాంగణంలోని సీఎం చాంబర్లో పారికర్‌తో రాహుల్ సమావేశమయ్యారు. పారికర్‌తో ముచ్చటించిన అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాహుల్ అసెంబ్లీలోని విపక్ష లాబీలో సమావేశమయ్యారు. కాగా రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన కీలక పత్రాలు గోవా సీఎం వద్ద ఉన్నాయని కాంగ్రెస్ చీఫ్ ఆరోపించిన మరుసటి రోజే పారికర్‌తో రాహుల్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు పారికర్‌తో రాఫెల్ ఒప్పందంపై రాహుల్ ఎలాంటి చర్చలూ జరపలేదని, కేవలం ఆయన ఆరోగ్య పరిస్ధితిని వాకబు చేసేందుకే కలిశారని గోవా విపక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్ వివరణ ఇచ్చారు. పారికర్‌ను రాహుల్ కేవలం మర్యాదపూర్వకంగానే కలిశారని చెప్పుకొచ్చారు. మనోహర్ పారికర్ పాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతూ 2018 ఫిబ్రవరి నుంచి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
‘పార్టీ మారితే చావుడప్పు కొడతాం’
సాక్షి, హైదరాబాద్: రాఫెల్ కుంభకోణంపై టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే విభజన హామీలపై పోరాడుతున్నట్లు టీఆర్ఎస్ ఎంపీలు నటిస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన కరీంనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాఫెల్ కుంభకోణంలో వాస్తవాలను ప్రజలకు వివరిస్తామన్నారు. రూ.526 కోట్లకు వచ్చే విమానాలను 1600 కోట్లకు ఎందుకు కొన్నారో తెలపాలని పొన్నం డిమాండ్ చేశారు. రాఫెల్ తయారికి హెచ్‌ఎఎల్‌లాంటి నవరత్న కంపెనీని కాదని ఎలాంటి అనుభవంలేని రిలయన్స్ కు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘రాఫెల్ విషయంలో కేంద్రం సుప్రీంకోర్టును తప్పదోవ పట్టించింది. రాఫెల్ ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ ఇక దుకాణం మూసుకోవాలి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించకుండా కేసీఆర్ ఫ్రెంట్ కోసం తిరుగుతున్నారు. మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస పార్టీ ఎమ్మెల్యేల కోసం చూస్తున్నారు. టీఆర్ఎస్లో సమర్థులు లేరా?. శాసనమండలి సభ్యులను టీఆర్ఎస్లో విలీనం చేయడం సరికాదు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన నేతల ఇంటి ముందు చావు డప్పుకొట్టి శవయాత్రలు చేయాలని పార్టీని కోరాను. ఓటమితో మేం కుంగిపోలేదు. ఓటమికి కారణలేంటో విశ్లేషిస్తున్నాం. రాష్ట్రపతి రాక కోసం ఖర్చుపెట్టిన ఆరు కోట్లతో ఆసుపత్రి నిర్మించి ఉంటే ప్రజలకు ఉపయోగపడేది. -
ఈవీఎంలపై మాకు అనుమానాలున్నాయ్: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: భారత్ అత్యాధునిక యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన వివాదం పై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రజలకు, సైన్యానికి క్షమాపణలు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలనను చూసి ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనపడుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతిసేవిధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వంద ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కనీసం విలువలు పాటించడం లేదని విమర్శించారు. సైనికులకు మనో నిబ్బరం ఇవ్వాల్సింది పోయి ఇలాంటి మాటలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. 2014 లో సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాఫెల్ డీల్ ఎందుకు ఫైనల్ చెయ్యలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయంలో బ్రోకర్లతో మాత్రమే కొనుగోలు ఉండేదని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు నాయుడు కుట్ర పూరిత పొత్తు పెట్టుకున్నారు వ్యాఖ్యానించారు. తెలంగాణలో జరిగిన ఎన్నికలు చంద్రబాబు వెర్సస్ కేసీఆర్ అన్నట్టుగా మారాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందన్నారు. ఒక్క క్షమాపణతో ఎన్నికల కమిషన్ తమ తప్పును తుడిచేసుకుందని విమర్శించారు. తాము ఓటమి మీద పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తామన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం పార్టీ సిద్ధం అవుతుందని లక్ష్మణ్ తెలిపారు. జనవరి 11, 12 ఢిల్లీలో జరిగే జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో వ్యూహం రూపొందిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు స్వయంగా సమీక్ష చేస్తారని చెప్పారు. 2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 17 కోట్ల ఓట్లు బీజేపీకి వచ్చాయని,ఈ సారి 30 కోట్ల ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఓటమితో కార్యకర్తలు అధైర్య పడవద్దని లోపాలు సరిదిద్దుకొని ముందుకు పోవాలి సూచించారు. 2019 వచ్చే ఎన్నికల్లో మరోసారి మోదీని ప్రభుత్వాన్ని తీసుకురావడామే తమ లక్ష్యమన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు చేసింది ఏమిటో ప్రజలకు ప్రజలకు తెలుసునన్నారు. కుమార పట్టాభిషేకం ..ఇప్పుడిప్పుడే కదా అయింది కొన్ని రోజుల తరువాత ప్రభుత్వం మీద స్పందిస్తాం. ఈవీఎంల సాంకేతిక మీద మా అభ్యర్థులు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. దానిపై ఒక కమిటీ వేస్తామని చెప్పారు. తెరాస సెంటిమెంట్‌తో గట్టెక్కిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన దాని కన్నా ఎక్కువ సెంటిమెంట్ ఈ ఎన్నికల్లో వచ్చింది. సెంటిమెంట్‌తో మాకు రావాల్సిన ఓట్లు కూడా తెరాసకు వెళ్లాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. -
సుప్రీం తీర్పుతో కొత్త అనుమానాలు
సాక్షి, న్యూఢిల్లీ : వేలాది కోట్ల రూపాయలను వెచ్చించి ఫ్రాన్స్ నుంచి ‘రఫేల్’ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం సమంజసమా, కాదా? అన్న విషయాన్ని తాము విచారించదల్చుకోలేదని, అది ప్రభుత్వానికి సంబంధించిన పాలనాపరమైన విషయమంటూ సుప్రీంకోర్టు శుక్రవారం 36 పిటిషన్లను కొట్టివేస్తూ కొత్త అనుమానాలను ముందుకు తెచ్చింది. ఒప్పందంలోని ‘అధిక ధర’ అంశాన్ని కాగ్ క్షుణ్నంగా పరిశీలించి నివేదికను రూపొందించడం, ఆ నివేదికను పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ ఆమోదించినందున దాన్నీ తాము పరిశీలించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును చూసి ముందుగా నోరెళ్లబెట్టిన పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ మల్లిఖార్జున ఖర్గే, వెంటనే తేరుకొని కాగ్‌కు ఫోన్ చేసి ‘మీరు రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై నివేదికను పంపించారా?’ అంటూ ప్రశ్నించారు. ఇంకా నివేదిక పూర్తి కాలేదని, పూర్తయ్యాక సమర్పిస్తామంటూ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటరల్ జనరల్) నుంచి సమాధానం వచ్చింది. ఇప్పవరకు ఉన్నతాధికారులు 60 సార్లు కాగ్‌ను కోరిన ఇప్పటికీ నివేదిక తయారు కాకపోవడం గమనార్హం. యాభై వేల కోట్ల రూపాయల లోపే 126 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు 2014లో దాదాపు ఒప్పందం కుదరగా అది 2016 నాటికి కేవలం 36 యుద్ధ విమానాల కొనుగోలుకే దాదాపు 59 వేల కోట్ల రూపాయలకు ఎలా పెరిగింది? ఈ యుద్ధ విమానాలను సరఫరా చేసే డసౌ సంస్థ, ఒప్పందానికి కొన్ని రోజుల ముందే ఆవిర్భవించిన తన భారత భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్ సంస్థను ఎలా ఎంపిక చేసుకొంది? యుద్ధ విమానాలను పక్కనపెట్టి మామూలు పౌర విమానాల తయారీలో కూడా ఎలాంటి అనుభవం లేని రిలయన్స్ అంబానీ కంపెనీకి ఏకంగా 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తరలించేందుకు ఎందుకు ముందుకు వచ్చింది? భారత ప్రభుత్వం ఒత్తిడి మేరకే రిలయన్స్ కంపెనీని చేర్చుకోక తప్పలేదని నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ మిలాండ్ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడంలో నిజం లేదా? అంటూ ఆ మంది 36 పిటిషనర్లు సుప్రీంకోర్టును ప్రశ్నించారు. వారిలో మాజీ బీజేపీ నాయకులు అరుణ్ శైరీ, యశ్వంత్ సిన్వాలతోపాటు సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఉన్నారు. ఈ సందేహాల్లో ఏ ఒక్కటి సుప్రీంకోర్టు తీర్చకపోగా కొత్త సందేహాలను లేవనెత్తింది. యుద్ధ విమానాల ధరల పట్ల కాగ్ సంతృప్తి పడిందని, ఆ నివేదికను పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ ఆమోదించినాక ఇంకా సందేహాలు ఎందుకని? సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తయారుకానీ నివేదిక పట్ల కాగ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు, అందని నివేదికను పార్లమెంట్ పద్దుల కమిటీ ఆమోదించినట్లు సుప్రీంకోర్టుకు ఎవరు చెప్పారు? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని సులభంగానే ఊహించవచ్చు. ఒప్పందం విషయంలో సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన రహస్య నివేదికలో ఈ విషయాలను కేంద్రమే పొందుపరిచి ఉంటుంది. ఆ విషయం తెలియక సుప్రీంకోర్టు తప్పులో కాలేసింది. రహస్య నివేదికలో కూడా కేంద్రం విమానాల బేసిక్ ధరనే పేర్కొందని, పూర్తి వివరాలు ఇవ్వడం దేశ సార్వభౌమాధికార భద్రతకు భంగం కలిగించడమే కాకుండా ఇలాంటి వివరాలను వెల్లడించకూడదంటూ ఫ్రాన్స్‌తో చేసుకున్న ఉప్పందాన్ని ఉల్లంఘించినట్లేనంటూ ప్రభుత్వం చేసిన వాదనతో ఏకభవించిన సుప్రీంకోర్టు రోడ్డు, వంతెన నిర్మాణానికి సంబంధించిన టెండర్ అంశాలు కావని వ్యాఖ్యానించింది. అంత చిన్న విషయం కాదు కనుకనే వివరాలు కావాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు. ‘మా దగ్గర ఇంతటి శక్తి సామర్థ్యాలు కలిగిన క్షిపణలు, ఉన్నాయి. అంతటి శక్తివంతమైన అణు క్షిపణులను ప్రయోగించే యుద్ధ విమానాలు ఎన్నో ఉన్నాయి’ అంటూ అమెరికా, చైనాలు బహిరంగంగా ప్రకటిస్తున్న నేటిరోజుల్లో, లేని ఆయుధాలు ఉన్నట్టు మన దాయాది దేశం పాకిస్థాన్ చెప్పుకుంటున్నప్పుడు, ఎలాంటి సామర్థ్యం, సాంకేతిక సౌకర్యాలు తమ రఫేల్ యుద్ధ విమానాల్లో ఉన్నాయో డసౌ సంస్థనే వాణిజ్య ప్రకటన చేసుకుంటున్నప్పుడు మన విమానాల గుట్టు విప్పితే తప్పేమిటీ? అసలు యుద్ధ విమానాల ఒప్పందమనేది రెండు దేశాల మధ్య జరిగిన డిఫెన్స్ ఒప్పందమని, అందులో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదని, మొదటినుంచి ఈ ఒప్పందాన్ని విచారించేందుకు విముఖత చూపుతున్న సుప్రీంకోర్టు శుక్రవారం పిటిషన్లు కొట్టి వేయగానే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పందిస్తూ ఒప్పందం విషయంలో కోర్టు ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇచ్చిందని, అనుమానించిన, ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలతోపాటు పిటిషనర్లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ఒప్పందంలోని అంశాలుగానీ, ధర విషయాలుగానీ విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించినప్పుడు క్లీన్చిట్ ఇవ్వడం ఎందుకు అవుతుంది ? ఒప్పందంలో రిలయన్స్ అంబానీ కంపెనీని చేర్చడంలో ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నట్లు ఆధారాలేవీ లేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలను ప్రాతిపదికగా తీసుకుంటే రిలయన్స్‌ను ఎంపిక చేయడంలో కేంద్రానికి దురుద్దేశం లేదని చెప్పుకోవచ్చు. కానీ మొత్తం ఒప్పందానికి క్లీన్చిట్ ఇచ్చినట్లు కాదు. అంబానీ డిఫెన్స్ విభాగంలోని ఎయిరోస్ట్రక్చర్ కొత్తగా ఏర్పడిన సంస్థే కావచ్చుగానీ, దాని మాతృసంస్థ 2012 నుంచే ఒప్పందం గురించి జరిగిన చర్చల్లో పాల్గొందికదా! అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఎయిరోస్ట్రక్చర్ నష్టాల్లో ఉన్న అనిల్ అంబానీ రిలయన్స్‌కు సంబంధించినది కాగా, 2012 నుంచి ప్రాథమిక చర్చల్లో పాల్గొని ఆ తర్వాత చర్చల నుంచే పూర్తిగా తప్పుకున్నది ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్, దీన్ని మాతృసంస్థగా పేర్కొనడమే ఇక్కడ గమనార్హం. పైగా ఒప్పందంపై ఫ్రాన్స్ అధ్యక్షుడుగా సంతకం చేసిన ఫ్రాంకోయీస్ మిలాండ్ ఇచ్చిన ఇంటర్వ్యూను పరిగణనలోకి తీసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పడం మరింత గమనార్హం. ఏదేమైనా పలు సందేహాలను తీర్చాల్సిన సుప్రీంకోర్టు కొత్త సందేహాలను ముందుకు తెచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రజలకు స్పష్టంగా అర్థం కావాలంటే కేంద్ర ప్రభుత్వం సమర్పించిన రహస్య నివేదికలోని అంశాలు బహిర్గతం కావాల్సిందే!