
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ తీర్పుపై కాపలాదారే దొంగ అంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్దానం మంగళవారం ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. రఫేల్ ఒప్పందానికి సంబంధించి వెలువడిన తీర్పుపై రాహుల్ వ్యాఖ్యలు తమ ఉత్తర్వులను వక్రీకరించేలా ఉన్నాయని ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
రఫేల్ కేసుపై తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లతో కలిపి ఈ అంశాన్ని ఈనెల 30న విచారణకు చేపడతామని కోర్టు పేర్కొంది. కాగా తనపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కొట్టివేయాలన్న రాహుల్ అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. రాఫెల్ తీర్పుపై రాహుల్ చేసిన ప్రకటనపై ఇప్పటికే క్షమాపణ తెలిపారని ఆయన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు తెలిపారు. ఇది చట్టం దృష్టిలో క్షమాపణ కిందకు రాదని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. రఫేల్ ఒప్పందంపై సుప్రీం తీర్పును పూర్తిగా పరిశీలించకుండానే ఎన్నికల ప్రచారంలో పొరపాటుగా సుప్రీం కోర్టు పేరును ప్రస్తావించానని రాహుల్ గాంధీ అంగీకరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment