
రఫేల్ యుద్ధ వివానాల కొనుగోలు ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీల అబద్ధాల రాజకీయాలకు చెంపపెట్టు లాంటిదనీ, ఇన్నాళ్లూ అసత్య ఆరోపణలు చేసి, దేశ భద్రతను ప్రమాదంలో పడవేసినందుకు ఆ పార్టీ ఇప్పుడు దేశ ప్రజలకు, సైనికులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు. కోర్టు తీర్పుతో రాహుల్ చెప్పిందంతా తప్పుడు సమాచారం, అబద్ధమని బట్టబయలైందని అమిత్ షా అన్నారు.
పార్లమెంటులో కాంగ్రెస్ ఈ అంశంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. మోదీని ‘కాపలాదారుడు’అని సంబోధిస్తూ.. నాడు కాపలాదారుడినని చెప్పుకున్న వ్యక్తి నేడు దొంగగా మారాడని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ గతంలో పలుమార్లు ఆరోపించడం తెలిసిందే. అయితే, నిజమైన దొంగలంతా చేరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దొంగ అన్నారన్న విషయం సుప్రీంకోర్టు తీర్పుతో తెలిసొచ్చింద’ ని అమిత్ షా అన్నారు. రాహుల్ మాటలపై మున్ముందు విశ్వాసం ఉండాలంటే ఆయనకు రఫేల్ గురించిన తప్పుడు సమాచారం అంతా ఎక్కడి నుంచి వచ్చిందో బయటపెట్టాలని కోరారు.