
న్యూఢిల్లీ: ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించటం ఆపలేదు. పెరుగుతున్న చమురు ధరలు, రాఫెల్ ఒప్పందం, పడిపోతున్న రూపాయి విలువ అంశాలుగా శనివారం ట్విట్టర్‌లో ఒక హిందీ కవితను పేరడీగా మలిచారు. ప్రధాని మోదీని సాహెబ్ అని సంబోధించారు. మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ ప్రకటనల్లో ఉన్న ఒక లైన్‌ను ఆధారంగా చేసుకుని సాహెబ్ కా కమాల్ దేఖో.. అంటూ ప్రారంభించి ముంబై, ఢిల్లీల్లో అత్యధిక పెట్రోల్ ధరలను, డాలర్‌పై రూపాయి విలువ పతనాన్ని ప్రస్తావించారు. రాఫెల్ ఒప్పందం ఒక కుంభకోణం అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఓ టీచర్‌ను బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం నేతలు వేధిస్తున్నట్లుగా ఉన్న ఓ వీడియోనూ షేర్ చేశారు.