ప్రధాని మోదీ ‘ఎలక్షన్ మోడ్’లోకి వెళ్లిపోయారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు లోక్‌సభలో సమాధానమిస్తూ.. దాదాపు ఎన్నికల ప్రచార ప్రసంగమే చేశారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తున్న విమర్శలకు.. అంశాలవారీగా ఘాటు సమాధానమిచ్చారు. దాదాపు గంటన్నరకు పైగా చేసిన ప్రసంగంలో.. తీవ్రమైన విమర్శలు, ఆరోపణలతో పాటు వ్యంగ్య వ్యాఖ్యలు, ఛలోక్తులతో కాంగ్రెస్‌ను చీల్చి చెండాడారు. వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాడంటూ తనపై చేస్తున్న ఆరోపణలకు బదులిస్తూ.. ‘ దేశంలో ఎమర్జెన్సీ విధించింది మీరే.. న్యాయవ్యవస్థను, సీబీఐని, ఈడీని అవమానించింది మీరే.. వైమానిక దళ అధిపతిని గూండాగా అభివర్ణించింది మీరే.. సైన్యం బలోపేతం కాకూడదని కోరుకునేదీ మీరే’ అంటూ తిప్పికొట్టారు.
రఫేల్ డీల్‌ను తప్పుపట్టడంపై స్పందిస్తూ.. ఏ కంపెనీ తరఫున బిడ్డింగ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ను ఎద్దేవా చేశారు. విపక్ష మహా కూటమిని విలువల్లేని, అవసరార్ధం కలిసిన ‘కల్తీ’ కూటమి అని, అందులోని నేతలంతా బెయిల్‌పై బయట ఉన్నవారేనని, ప్రజలు వారిని తప్పక తిప్పికొడతారని చురకలంటించారు. పనిలో పనిగా, గతంలో కాంగ్రెస్ పార్టీపై మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలనూ ప్రస్తావించారు. కాంగ్రెస్‌తో కలవడం ఆత్మహత్య చేసుకోవడంతో సమానమని అంబేద్కర్ నాడే చెప్పారని, స్వాతంత్య్రం రాగానే కాంగ్రెస్‌ను రద్దు చేయాలని గాంధీ కోరుకున్నారని గుర్తు చేశారు. ఈ లోక్‌సభలో బహుశా చివరిదైన ప్రసంగాన్ని.. సభ సాక్షిగా దేశ ప్రజలకు తన వాదన వినిపించేందుకు ప్రధాని సమర్ధంగా ఉపయోగించుకున్నారు.
న్యూఢిల్లీ: ‘కాంగ్రెస్ న్యాయ వ్యవస్థను బెదిరించింది. దేశంలో అత్యయిక పరిస్థితి విధించింది. రాజ్యాంగ నిబంధన పేరిట ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చింది. సైన్యాన్ని అవమానించింది. ఆర్మీ చీఫ్‌ను రౌడీగా చిత్రీకరించింది. కానీ అన్ని వ్యవస్థల్ని మోదీయే నాశనం చేస్తున్నారని రాద్ధాంతం చేస్తోంది’ అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఎన్నికల సీజన్‌లో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రధాని పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ సహా అన్ని విపక్షాలపై విరుచుకుపడ్డారు. మూకుమ్ముడిగా బెయిల్‌పై ఉన్న విపక్ష నాయకులు ప్రతిపాదిస్తున్న మహాకూటమి కల్తీమయమని, దాన్ని ఆరోగ్యవంతమైన మన ప్రజాస్వామ్యం తిరస్కరిస్తుందని అన్నారు. 55 నెలలుగా ఎన్డీయే పాలన సేవా దృక్పథంతో కొనసాగుతుండగా 55 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో మునిగితేలిందని చురకలంటించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం సహజమేనని, కానీ మోదీని, బీజేపీని విమర్శిస్తూ కొందరు దేశంపై దాడిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చకు మోదీ సమాధానమిచ్చారు. ఆ తరువాత తీర్మానాన్ని లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. నాలుగున్నరేళ్ల ఎన్డీయే పాలనలో జరిగిన అభివృద్ధిని నివేదించిన మోదీ..తమ ప్రభుత్వం అవినీతిని చాలా మటుకు తగ్గించిందని ఉద్ఘాటించారు. సుమారు గంటన్నర సేపు సాగిన మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
కాంగ్రెస్, ఇతర విపక్షాలపై..
ఎన్డీయే పనితనాన్ని ప్రజలు చూశారు. కాబట్టి కొన్ని పార్టీలు కలసి ఏర్పాటు చేయాలనుకుంటున్న అత్యంత కల్తీ అయిన కూటమిని దేశం కోరుకోవడం లేదు. ప్రభుత్వమనేది ప్రజల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. అవినీతికి స్థానం ఇవ్వొద్దు. దేశంలోనైనా, విదేశాల్లో అయినా, పార్లమెంట్ లోపల, వెలుపల అంతటా మేము సత్యమే మాట్లాడతాం. కానీ ఆ నిజాన్ని వినే సామర్థ్యం విపక్షాలకు తగ్గిపోయింది. ఎన్నికల సంఘం పనితీరును, ఈవీఎంలను కాంగ్రెస్ శంకించింది. దేశంలో ఎమర్జెన్సీని విధించింది. ఆర్మీని, ఆర్మీ చీఫ్‌ను అవమానించారు. ప్రణాళిక సంఘం జోకర్ల బృందమని ఎద్దేవా చేశారు. కానీ మోదీనే అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నారని తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు. ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసిన కాంగ్రెస్ చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాల్ని రద్దుచేసింది. ఒక్క ఇందిరా గాంధీ హయాంలోనే ఈ ఆర్టికల్‌ను 50 సార్లు ప్రయోగించారు.
రక్షణ రంగంపై...
యూపీయే హయాంలో రక్షణ రంగం ఎన్నో ప్రతిబంధకాలు ఎదుర్కొంది. ఆర్మీ సర్జికల్ దాడులు చేసే స్థాయిలో లేకపోయింది. మన ఆర్మీ, వైమానిక దళం బలోపేతం కావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. రఫేల్ రక్షణ కొనుగోళ్లకు సంబంధించి కాంగ్రెస్ ఏదైనా కంపెనీ తరఫున బిడ్డింగ్ వేస్తోందా? అని సూటిగా ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన జాప్యం కారణంగా సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, సరైన బూట్లు, కమ్యూనికేషన్ ఉపకరణాలు సకాలంలో అందలేదు. ఇదీ ఒక రకంగా దేశాన్ని మోసం చేయడమే అవుతుంది. పొరుగు దేశాలు అధునాతన∙ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్న సమయంలో 30 ఏళ్ల పాటు అడ్వాన్స్‌డ్ జెట్ విమానాల్ని ఎందుకు కొనుగోలు చేయలేదు? ఈ పాపానికి దేశం మిమ్మల్ని క్షమించదు. ముడుపులు లేకుండా రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడంపై కాంగ్రెస్ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వారి దృష్టిలో కమీషన్లు లేకుండా రక్షణ ఒప్పందం జరగడం అసాధ్యం.
బీసీ అంటే బిఫోర్ కాంగ్రెస్.. ఏడీ అంటే ఆఫ్టర్ డైనాస్టీ
కాలావధుల్ని సూచించే బీసీ(బిఫోర్ క్రైస్ట్), ఏడీ(ఆనో డొమిని)లకు మోదీ కొత్త అర్థాలు చెప్పారు. కాంగ్రెస్‌కు బీసీ అంటే బిఫోర్ కాంగ్రెస్ అని, ఏడీ అంటే ఆఫ్టర్ డైనాస్టీ అని ఎద్దేవా చేశారు. ‘ కాంగ్రెస్ దృష్టిలో బీసీ, ఏడీలకు వేరే అర్థాలున్నాయి. బీసీ(బిఫోర్ కాంగ్రెస్) అంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు అక్కడేం లేదని, ఏడీ(ఆఫ్టర్ డైనాస్టీ) అంటే తమ కుటుంబం అధికారంలోకి వచ్చాకే అంతా జరిగిందని వారు ప్రచారం చేసుకుంటున్నారు’ అని మోదీ అన్నారు.
గడ్కరీకి సోనియా ప్రశంసలు
రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి లోక్‌సభలో ఊహించని వ్యక్తి నుంచి ప్రశంసలు లభించాయి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు మీ శాఖ తరఫున చేస్తున్న కృషి ప్రశంసనీయమైనదని గడ్కరీని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అభినందించారు. గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ మంత్రిత్వ శాఖకు సంబంధించి సభ్యులు రెండు ప్రశ్నలు సంధించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, తన శాఖ పరిధిలో చేసిన వివిధ పనుల వివరాలు, రహదారుల అనుసంధానికి చేసిన కృషిని సభకు వివరించారు. ‘పార్టీలతో సంబంధం లేకుండా అన్ని నియోజకవర్గాల్లో మా శాఖ తరఫున పనులు చేపట్టాం. దీనికి అన్ని రాజకీయ పక్షాలకు చెందిన సభ్యులు నన్ను అభినందించాలి’అని గడ్కరీ సమాధానమిచ్చారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ సభ్యుడు గణేశ్‌సింగ్ లేచి నిలబడి స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అద్భుత ఫలితాలు సాధించిన గడ్కరీ శాఖను సభ అభినందించాలని’ సూచించారు. మౌనంగా గమనిస్తున్న యూపీఏ చైర్‌పర్సన్ సోనియా నవ్వుతూ బల్లను చరుస్తూ గడ్కరీని అభినందించారు.
ఉద్యోగ కల్పనపై..
రవాణా, ఆతిథ్యం, మౌలిక రంగాల్లో ఈ నాలుగున్నరేళ్లలో కోట్లాది కొత్త ఉద్యోగాలు కల్పించాం. వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లో ఉద్యోగాల సృష్టి జరిగినట్లు జాతీయ భవిష్య నిధి, నేషనల్ పెన్షన్ పథకం(ఎన్‌పీఎస్), పన్ను రిటర్నుల సమాచారం ధ్రువీకరిస్తోంది. 2018 నవంబర్ వరకు కేవలం 15 నెలల్లో 1.8 కోట్ల మంది తొలిసారిగా ఉద్యోగ భవిష్య నిధిలో చందాదారులుగా చేరారు. అందులో 64 శాతం మంది వయసు 28 ఏళ్ల కన్నా తక్కువే. 2014 సంవత్సరంలో ఎన్‌పీఎస్ పథకంలో ఉన్న వారి సంఖ్య 65 లక్షలు కాగా, 2018 అక్టోబర్ నాటికి ఆ సంఖ్య 1.2 కోట్లకు పెరిగింది. నాలుగేళ్లలో కొత్తగా 6.35 లక్షల మంది వృత్తి నిపుణులు ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. దేశంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి స్కిల్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా లాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల్ని మా ప్రభుత్వం ప్రారంభించింది.
అవినీతిపై..
దేశాన్ని దోచుకున్న అవినీతిపరులు నన్ను చూసి భయపడుతూనే ఉన్నారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించేందుకు ఓ వైపు ఆటగాళ్లు కష్టపడుతోంటే, కాంగ్రెస్ పార్టీలోని కొందరు పెద్దలు తమ సంపదను పెంచుకునేందుకు దీన్ని ఒక అవకాశంగా మలుచుకున్నారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణ నిందితుల్ని దేశానికి తీసుకురావడం ద్వారా విపక్షాల్లో కొందరికి వణుకు పుడుతోంది. యూపీఏ హయాంలో ప్రభుత్వ పెద్దల నుంచి ఫోన్లు చేయించుకుని వ్యాపారవేత్తలు రుణాలు పొందిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ధరలు పెరిగాయి. ధరల్ని అదుపులో ఉంచేందుకు మా ప్రభుత్వం కృషిచేసింది. విధానపర నిర్ణయాలను ప్రభావితం చేసేలా నిధుల సేకరణలో పారదర్శకత పాటించని సుమారు 20 వేల స్వచ్ఛంద సంస్థల్ని మేం మూసివేశాం.
అది మహా కల్తీ కూటమి
Published Fri, Feb 8 2019 4:26 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment