అవన్నీ అబద్ధాలే... అంతా చెప్పేశాం.. | Rafale Deal: Chowkidaar Is Chor, Hence Proved: Rahul Gandhi | Sakshi
Sakshi News home page

అవన్నీ అబద్ధాలే... అంతా చెప్పేశాం..

Published Fri, Feb 8 2019 1:03 PM | Last Updated on Fri, Feb 8 2019 3:44 PM

Congress has long raised allegations of crony capitalism in the deal - Sakshi

రఫెల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌, అనీల్‌ అంబానీలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

న్యూఢిల్లీ : రఫెల్‌ ఒప్పందంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌, అనీల్‌ అంబానీలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్‌ గాంధీ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  రఫెల్‌ కుంభకోణంలో మోదీ పాత్ర ఉందని నిరూపితం అయిందని ఆయన అన్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీతో పాటు నిర్మలా సీతారామన్‌ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనన్నారు. ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో పీఎంవో నేరుగా చర్చలు జరిపిందంటూ... 2017 నాటి రక్షణశాఖ నోట్‌ను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశానికి చౌకీదారే దొంగ అని రుజువైందంటూ రాహుల్‌ ఆరోపించారు. 

రాహుల్‌ మాట్లాడుతూ.. ‘అనిల్‌ అంబానీకి రూ.30వేల కోట్లు దోచిపెట్టారు. గత ఏడాది నుంచి మేం అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పడం లేదు. రఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలో అనిల్‌ అంబానీ పేరును ప్రధాని మోదీనే సూచించారంటూ ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడే స్వయంగా చెప్పారు. ఈ కుంభకోణంపై పార్లమెంట్‌ జేఏసీ విచారణ చేయాలి. ఉన్నతస్థాయి కమిటీ చర్చలు జరుపుతున్నప్పుడు మోదీ ప్రమేయం ఎందుకు?. రక్షణ శాఖ వ్యతిరేకించినా ఎందుకు ఒప్పందం చేసుకున్నారు. మోదీ సర్కార్‌ సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించింది. మనీ ల్యాండరింగ్‌ కేసులో రాబర్ట్ వాద్రా, ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని ప్రశ్నించుకోవచ్చు. అయితే రఫెల్‌ కుంభకోణంపై విచారణ జరపాల్సిందే’ అని డిమాండ్‌ చేశారు. 

చెప్పాల్సిందంతా చెప్పేశాం: నిర్మలా సీతారామన్‌
మరోవైపు రఫెల్‌ ఒప్పందంపై శుక్రవారం లోక్‌సభలో అధికార, విపక్ష సభ్యుల మధ‍్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ సభ్యుల నిరసలన మధ్యే ఇదే అంశంపై రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీకి దేశ రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండటం ఇష్టంలేదన‍్న ఆమె... రఫెల్‌ ఒప్పందంపై రాహుల్‌ గాంధీ ఆరోపణలు అవాస్తవమన్నారు. ఇందుకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజాలు లేవని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. మల్టీ నేషనల్‌ కంపెనీల కోసమే రఫెల్‌ ఒప్పందంపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందని ఆమె మండిపడ్డారు. దీనిపై ఇప్పటికే తాము చెప్పాల్సిందంతా చెప్పేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement