న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పిరికివాడని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ వ్యాఖ్యానించారు. రాఫెల్ అంశంతోపాటు జాతీయ భద్రతపై తనతో కనీసం 5 నిమిషాల ముఖాముఖి చర్చకు వచ్చేందుకు మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ మైనారిటీ విభాగం సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. ‘గత ఐదేళ్లుగా మోదీతో పోరాడుతున్న నాకు ఆయన అసలు రంగేమిటో తెలిసిపోయింది. ఆయన పిరికి వ్యక్తి. జాతీయ భద్రత, రాఫెల్ అంశాలపై నాతో 5 నిమిషాలు ముఖాముఖి చర్చకు రమ్మనండి’ అంటూ సవాల్ విసిరారు.
‘మీరంతా కలిసికట్టుగా ఉండి, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, మోదీని శాయశక్తులా ఎదుర్కోండి. వారు పిరికివాళ్లలా పారిపోతారు’ అంటూ కార్యకర్తలకు రాహుల్ పిలుపునిచ్చారు. ‘మోదీ అధికారంలో ఉండగా తమ పని తాము చేసుకోలేమంటూ నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు బహిరంగంగా చెప్పారు. సుప్రీంకోర్టు తన విధులను నిర్వర్తించకుండా చేసేది బీజేపీ చీఫ్ అమిత్ షా అని వారు పరోక్షంగా చెప్పారు’ అని గుర్తు చేశారు. ‘డోక్లాం వద్ద సరిహద్దుల్లోకి చైనా తన బలగాలను మోహరించిన సమయంలోనే ఎటువంటి ఎజెండా లేకుండానే చైనా అధ్యక్షుడితో భేటీకి వెళ్లి మోకరిల్లారు. ఇది చూసి మోదీకి 56 అంగుళాలు కాదు కదా కనీసం 4 అంగుళాల ఛాతీ కూడా లేదని చైనాకు తెలిసిపోయింది’ అని ఎద్దేవా చేశారు.
ప్రధానకార్యదర్శిగా తొలిసారి ప్రియాంక
రాహుల్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో గురువారం మొదటిసారిగా హాజరయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఏర్పాటైన ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జులు హాజరయ్యారు. భేటీలో ముందు వరుసలో రాహుల్, కేసీ వేణుగోపాల్, ఆజాద్, ఖర్గే ఆసీనులు కాగా రాహుల్‌కు దూరంగా కుడివైపు వరుస మధ్యలో జ్యోతిరాదిత్య సింధియా పక్కన ప్రియాంక కూర్చున్నారు.
వీరిద్దరూ ఇటీవల ఉత్తరప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జులుగా నియమితులయిన విషయం తెలిసిందే. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ చాంబర్ పక్కనే ఉన్న గదిని ప్రియాంకకు, జ్యోతిరాదిత్యకు కలిపి కేటాయించారు. దీని ద్వారా ఎవరూ ఎక్కువ కాదనే సందేశం పంపించడమే ఉద్దేశమని భావిస్తున్నారు. కాగా, శనివారం పీసీసీల చీఫ్‌లు, సీఎల్పీ నేతలతో సమావేశమై వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై రాహుల్ సమీక్షించనున్నట్లు సమాచారం.
ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు చేస్తాం మహిళా కాంగ్రెస్ చీఫ్ సుస్మితా
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేస్తామని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ చీఫ్ సుస్మితా దేవ్ ప్రకటించారు. ఈ చట్టం ద్వారా ముస్లిం మహిళలు, పురుషుల మధ్య విద్వేష వాతావరణాన్ని ప్రధాని మోదీ సృష్టించారని విమర్శించారు. ‘ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందితే ముస్లిం మహిళలకు సాధికారత లభిస్తుందని చాలామంది చెప్పారు. కానీ ముస్లిం పురుషులను జైళ్లలో పెట్టేందుకు ప్రధాని దీన్ని ఓ ఆయుధంగా రూపొందించారు. కాగా, మహిళల సాధికారితకు ఏ ప్రభుత్వం చట్టాన్ని తెచ్చినా మేం సమర్థిస్తాం. ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించిన∙ముస్లిం మహిళలను అభినందిస్తున్నా’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment