‘రాఫెల్‌’ ఒప్పందం రద్దు ప్రశ్నేలేదు | Arun Jaitley says Rafale deal will not be cancelled | Sakshi
Sakshi News home page

‘రాఫెల్‌’ ఒప్పందం రద్దు ప్రశ్నేలేదు

Published Mon, Sep 24 2018 5:02 AM | Last Updated on Mon, Sep 24 2018 8:34 AM

Arun Jaitley says Rafale deal will not be cancelled - Sakshi

న్యూఢిల్లీ/పారిస్‌: రాఫెల్‌ ఒప్పందంపై అధికార, ప్రతిపక్షం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. తాజాగా, ‘రాఫెల్‌’ ఒప్పందం రద్దు ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. రాఫెల్‌ యుద్ధ విమానాలు తయారు చేసే డసో ఏవియేషన్, రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ (ఆర్డీఎల్‌) ఒప్పందం విషయంలో భారత, ఫ్రెంచి ప్రభుత్వాలకు ఎటువంటి ప్రమేయం లేదని పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ స్పందిస్తూ.. ప్రధాని, జైట్లీ అబద్ధాలు మాని, నిజానిజాలు తేల్చేందుకు జేపీసీని నియమించాలని డిమాండ్‌ చేశారు.

ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఫెల్‌ ఒప్పందంపై అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ..ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలండ్‌ చేసిన పొంతనలేని ప్రకటనలే అనుమానాలకు తెరలేపాయన్నారు. ‘రిలయన్స్‌తో ఒప్పందం చేసుకోవాలని డసోను భారత ప్రభుత్వమే కోరిందని రెండ్రోజుల క్రితం హోలండ్‌ ప్రకటించారు. ఇప్పుడు భారత ప్రభుత్వం లాబీ చేసిందో లేదో తనకు తెలియదంటూ ఆయన మాటమార్చారు. హోలండ్‌ ప్రకటనలకు, రాహుల్‌ విమర్శలకు సంబంధం ఉంది. రాఫెల్‌ ఒప్పందంపై ఫ్రాన్స్‌లో బాంబులు పేలనున్నాయంటూ ఆగస్టు 30నే రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

వారి అనుబంధం విషయంలో నా వద్ద ఆధారాలు లేనప్పటికీ, ఏదో లంకె ఉందనే అనుమానం మాత్రం ఉంది. హోలండ్‌ ముందుగా ఒక ప్రకటన, దానికి విరుద్ధమైన మరో ప్రకటన చేశారు. ఈ విషయం రాహుల్‌కు 20 రోజులకు ముందుగానే ఎలా తెలిసింది?’ అని జైట్లీ ప్రశ్నించారు. 2019 ఎన్నికల నేపథ్యంలో రాఫెల్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటారా అని ప్రశ్నించగా..‘ఒప్పందం నుంచి వైదొలిగే ప్రశ్నేలేదు’ అని స్పష్టం చేశారు. హోలండ్‌ మొదటి ప్రకటనను ఫ్రెంచి ప్రభుత్వం, డసో ఏవియేషన్‌ సంస్థ ఇప్పటికే ఖండించాయని జైట్లీ తెలిపారు. కాగా డసోతో తమ కాంట్రాక్టు విషయంలో ప్రభుత్వ జోక్యం ఏమాత్రం లేదని రిలయన్స్‌ గ్రూప్‌ స్పష్టం చేసింది.  

అసత్యాలు మానండి: రాహుల్‌
రాఫెల్‌ ఒప్పందం విషయంలో ప్రధాని మోదీ, జైట్లీ అబద్ధాలు చెప్పడం మానాలని రాహుల్‌ అన్నారు. ఈ ఒప్పందం విషయంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని నియమించాలని డిమాండ్‌ చేశారు. ‘తాను చెప్పిందే నిజమని వాదించగల పటిమ, నిజాలను అబద్ధాలుగా నమ్మించగల సామర్థ్యం జైట్లీ ప్రత్యేకత. ప్రధాని, రక్షణ మంత్రి అబద్ధాలు ఆపాలి’ అని రాహుల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాఫెల్‌ వివరాల్ని అనిల్‌ అంబానీకి వెల్లడించి రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ప్రధాని ఉల్లంఘించారని కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ విమర్శించారు.

ఫ్రాన్స్‌ ఆందోళన
రాఫెల్‌ ఒప్పందంపై హోలండ్‌ వ్యాఖ్యలు భారత్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేపడంపై ఫ్రాన్స్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది భారత్‌తో సంబంధాలపై ప్రభావం చూపుతోందని భావిస్తోంది. ఫ్రాన్సు ఉప విదేశాంగ మంత్రి జీన్‌–బాప్టిస్ట్‌ లెమోయెన్‌ స్పందిస్తూ.. ‘హోలండ్‌ వ్యాఖ్యలు ఎవరికీ ఉపయోగకరం కాదు..ముఖ్యంగా ఫ్రాన్సుకు విదేశాలతో సంబంధాల విషయంలో ఇబ్బందికరంగా మారుతాయని అనుకుంటున్నా. పదవిలో లేని వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement