
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-ఫ్రాన్స్ మధ్య జరిగిన రాఫెల్ ఒప్పందం పరిశీలించి వాస్తవాలను వెల్లడించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భోఫోర్స్ తరహాలో రాఫెల్ డీల్‌పైనా పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని సీనియర్ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే కోరారు. ఈ ఒప్పందంపై పాలక బీజేపీ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. రాఫెల్ జెట్స్ చౌకవే అయితే పార్లమెంట్‌లో ప్రధాని ఆ వివరాలు వెల్లడించి ఉండాల్సిందని, ఇప్పుడు బీజేపీ నేతలు కప్పిపుచ్చుకునే వ్యాఖ్యలు చేయడం అర్థరహితమన్నారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే ప్రధాని ఐదు రోజుల విదేశీ పర్యటన చేపట్టడం అభ్యంతరకరమన్నారు. మరోవైపు రాఫెల్ డీల్‌పై పార్లమెంట్‌ను ప్రధాని, రక్షణ మంత్రి తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయడంపై వారిపై కాంగ్రెస్ సభా హక్కుల ఉల్లంఘన తీర్మనాన్ని ప్రవేశపెట్టింది.
కాగా, రాఫెల్ విమానాల ధరలను వెల్లడించడం కుదరదని, ఒప్పందంలో రహస్య క్లాజ్ ఉందని ప్రభుత్వం చెబుతుండటంపై సీనియర్ కాంగ్రెస్ నేతలు ఏకే ఆంటోనీ, ఆనందర్ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యుద్ధవిమానాల ధరలను వెల్లడించడంపై ఫ్రెంచ్ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో స్పష్టం చేశారని ఆనంద్ శర్మ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment