parlimentary committe
-
‘ఎఫ్బీ, వాట్సాప్‌లో అసత్య వార్తలకు అడ్డుకట్ట’
సాక్షి, న్యూఢిల్లీ : ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సహా సోషల్ మీడియా వేదికలన్నీ ఫేక్ న్యూస్‌ను కట్టడి చేసేందుకు దీటైన చర్యలు చేపట్టాలని ఐటీపై పార్లమెంటరీ కమిటీ కోరింది. ఎన్నికల కమిషన్‌తో సమన్వయంతో అసత్య వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని సూచించింది. వివిధ సామాజిక మాధ్యమాల వేదికలపై యూజర్ల డేటా పరిరక్షణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా ఈ కమిటీ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తదితర సంస్థలను కోరింది. ఎన్నికల సమయంలో అసత్య వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరిస్తూ నివేదికలు అందించాలని అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఆయా సంస్థలను బుధవారం ఆదేశించింది. అసత్య వార్తలు సహా తలెత్తే పలు అంశాలను రియల్ టైమ్‌లో పరిష్కరించేందుకు ఆయా సంస్థలు సన్నద్ధం కావాలని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈసీతో సమన్వయంతో వ్యవహరించాలని సూచించింది. రాజకీయాలకు సంబంధించిన ప్రకటనల వ్యవహారంలో పారదర్శకతతో కూడిన విధానాన్ని సోషల్ మీడియా వేదికలు ప్రవేశపెట్టాలని కోరింది. -
30వేల కోట్ల రుణాలను రద్దు చేసిన బ్యాంకు
సాక్షి,ముంబై : మొండిబకాయిలతో సతమతమవుతున్న ప్రభుత్వరంగ ఐడీబీఐ బ్యాంక్ గత మూడున్నర సంవత్సరాల్లో రూ 30,000 కోట్ల రుణాలను రద్దు చేసినట్టు వెల్లడించింది. నిరర్ధక ఆస్తులు పెరగడంతో రుణాల జారీపై ఐడీబీఐ బ్యాంకును ఆర్బీఐ నియంత్రించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ప్రధమార్ధంలో రూ 9052 కోట్ల రుణాలను రద్దు చేసినట్టు ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి బ్యాంకు నివేదించింది. రద్దు చేసిన రుణాల్లో అత్యధికం మౌలిక, మెటల్స్ రంగాలకు చెందినవేనని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. నిరర్ధక ఆస్తులపై ఆర్బీఐ ప్రవేశపెట్టిన అసెట్ క్వాలిటీ రివ్యూ (ఏక్యూఆర్) అనంతరం ఆయా రుణాలను రద్దు చేసినట్టు పార్లమెంటరీ కమిటీకి ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. 2015-16లో బ్యాంకు నిరర్ధక ఆస్తులు 7.79 శాతం నుంచి ఈ ఏడాది మార్చి నాటికి 11,8 శాతానికి పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసంలో బ్యాంకు జారీ చేసిన మొత్తం రుణాల్లో 31 శాతం మేర రూ 60,875 కోట్లకు నిరర్ధక రుణ బకాయిలు పేరుకుపోయాయని వెల్లడించింది. -
మీ కంటే స్కూల్ పిల్లలు నయం..
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యుల వ్యవహారాల శైలిపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. రఫేల్ ఒప్పందంపై మంగళవారం పాలక, విపక్ష సభ్యుల మధ్య గందరగోళం నెలకొనడంతో సభను సజావుగా నడిపేందుకు ఆమె విఫలయత్నం చేశారు. ఎంత వారించినా సభ్యులు వినకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ కంటే స్కూల్ పిల్లలు ఎంతో నయమని వ్యాఖ్యానించారు. రఫేల్ ఒప్పందంపై పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాలని సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై పాలక బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. సభ కొద్దిసేపు వాయిదా పడి తిరిగి సమావేశమైన తర్వాత ఇదే పరిస్థితి కొనసాగింది. సభా కార్యక్రమాలు కొనసాగించేందుకు స్పీకర్ ప్రయత్నించినా సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఈ దశలో ఎంపీల తీరుపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మీరు ప్రవర్తిస్తున్న తీరుతో సభ వెలుపల మంచి సంకేతాలు వెళ్లడం లేదని, భారత పార్లమెంట్లో ఏం జరుగుతోందని విదేశాల్లో ప్రజలు అడగటం తాను గమనించానని వ్యాఖ్యానించారు. పార్లమెంటేరియన్ల కంటే స్కూల్ చిన్నారులే మెరుగ్గా ప్రవర్తిస్తున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. కాగా రఫేల్ ఒప్పందంపై ప్రభుత్వం కోర్టుకు అసత్యాలు వెల్లడించిందని, దీనిపై పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టగా, కావేరి నదిపై ప్రాజెక్టు నిర్మించే ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం విరమించాలని ఏఐఏడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇక రఫేల్ ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేయగా, ఈ ఒప్పందంపై దేశాన్ని తప్పుదారిపట్టించిన రాహుల్ గాంధీయే క్షమాపణ చెప్పాలని పాలక బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. -
ఆ డీల్‌పై పార్లమెంటరీ కమిటీ విచారణ..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-ఫ్రాన్స్ మధ్య జరిగిన రాఫెల్ ఒప్పందం పరిశీలించి వాస్తవాలను వెల్లడించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భోఫోర్స్ తరహాలో రాఫెల్ డీల్పైనా పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని సీనియర్ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే కోరారు. ఈ ఒప్పందంపై పాలక బీజేపీ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. రాఫెల్ జెట్స్ చౌకవే అయితే పార్లమెంట్లో ప్రధాని ఆ వివరాలు వెల్లడించి ఉండాల్సిందని, ఇప్పుడు బీజేపీ నేతలు కప్పిపుచ్చుకునే వ్యాఖ్యలు చేయడం అర్థరహితమన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే ప్రధాని ఐదు రోజుల విదేశీ పర్యటన చేపట్టడం అభ్యంతరకరమన్నారు. మరోవైపు రాఫెల్ డీల్‌పై పార్లమెంట్‌ను ప్రధాని, రక్షణ మంత్రి తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయడంపై వారిపై కాంగ్రెస్ సభా హక్కుల ఉల్లంఘన తీర్మనాన్ని ప్రవేశపెట్టింది. కాగా, రాఫెల్ విమానాల ధరలను వెల్లడించడం కుదరదని, ఒప్పందంలో రహస్య క్లాజ్ ఉందని ప్రభుత్వం చెబుతుండటంపై సీనియర్ కాంగ్రెస్ నేతలు ఏకే ఆంటోనీ, ఆనందర్ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యుద్ధవిమానాల ధరలను వెల్లడించడంపై ఫ్రెంచ్ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్వయంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో స్పష్టం చేశారని ఆనంద్ శర్మ చెప్పారు. -
ఆర్బీఐ గవర్నర్‌కు పార్లమెంటరీ కమిటీ సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు కుంభకోణాలు, నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ)పై సందేహాలకు బదులిచ్చేందుకు మే 17న తమ ఎదుట హాజరు కావాలని ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్‌కు ఆర్థిక వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేసింది. ఇటీవల వెలుగు చూసిన పలు బ్యాంకు కుంభకోణాలు, వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు రుణాలు వంటి పలు అంశాలపై పార్లమెంటరీ కమిటీ పలు సందేహాలకు సమాధానాలు రాబట్టాలని యోచిస్తున్నట్టు తెలిసింది. బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు నకిలీ పత్రాలతో పీఎన్బీ నుంచి రూ 12,636 కోట్ల మేర రుణాలు రాబట్టి విదేశాలకు ఉడాయించిన ఉదంతం బ్యాంకింగ్ వ్యవస్థలో పెనుదుమారం రేపిన విషయం విదితమే. మరోవైపు వీడియోకాన్ గ్రూప్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ రుణాల మంజూరులో బ్యాంక్ చీఫ్ చందా కొచర్ పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి . ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద నిరర్థక ఆస్తులు భారీగా పేరుకుపోవడం ఆందోళనలు రేకెత్తిస్తోంది. రూ రెండు లక్షల కోట్లకు పైగా కార్పొరేట్ రుణాలను బ్యాంకులు రద్దు చేయడం రుణ వసూలు ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే కోణంలోనూ పార్లమెంటరీ కమిటీ ఆర్బీఐ గవర్నర్ వివరణ కోరుతుందని భావిస్తున్నారు. -
ఎయిర్ ఇండియా విక్రయానికి కమిటీ నో
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు ఇది సరైన సమయం కాదని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి నివేదించనుంది. ఎయిర్ ఇండియా రుణాలను రద్దు చేసి పునరుద్ధరణకు ప్రయత్నించాలని సూచించింది. ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియాలో మూలధన సమీకరణ దశలవారీగా చేపట్టడంతో సంస్థ ఆర్థిక, నిర్వహణా సామర్థ్యం దెబ్బతిని అధిక వడ్డీలకు రుణాలకు వెళ్లే పరిస్థితి నెలకొందని పేర్కొంది. ఎయిర్ ఇండియా విక్రయ ప్రతిపాదనను ప్రభుత్వం పునఃసమీక్షించాలని జాతికి గర్వకారణమైన ఎయిర్ ఇండియాను కాపాడేందుకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని రవాణా, పర్యాటక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది. ప్రకృతి వైపరీత్యాలు, భారత్‌లో..విదేశాల్లో సామాజిక, రాజకీయ అశాంతి తలెత్తిన సందర్భాల్లో ఎయిర్ ఇండియా తన వంతు సేవలు అందించిందని కొనియాడింది. ఎయిర్ ఇండియా పనితీరును నీతి ఆయోగ్ చేసిన మాదిరి కేవలం వాణిజ్య కోణంలోనే బేరీజు వేయడం సరికాదని అభిప్రాయపడింది. -
ప్రయాణీకులను ఇలా డీల్ చేస్తారా..
-
ప్రయాణీకులను ఇలా డీల్ చేస్తారా..
సాక్షి, న్యూఢిల్లీ : ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇటీవల ఓ ప్రయాణీకుడిపై దౌర్జన్యం చేసిన ఘటనకు సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఘాటుగా స్పందించింది. విమానయాన సంస్థల సిబ్బంది ప్రయాణీకులతో స్నేహపూర్వకంగా మెలగాలని, గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోవాలని హితవు పలికింది. విమానయాన సిబ్బంది ప్రయాణీకులపై దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం, దురుసుగా ప్రవర్తించడం వంటి ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయని కమిటీ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిర్‌లైన్స్ సిబ్బంది దురుసు ప్రవర్తన ఘటనలు కొన్ని మీడియాలో వస్తున్నా పలు సంఘటనలు వెలుగు చూడటం లేదని పేర్కొంది. ఇటీవల ఇండిగో సిబ్బంది ప్రయాణీకుడిపై దౌర్జన్యానికి పాల్పడిన తీరును తీవ్రంగా ఖండించింది.దురుసుగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నంత మాత్రాన విమానయాన సంస్థలు తమ తప్పిదాల నుంచి బయటపడలేవని 26 పేజీల నివేదికలో కమిటీ స్పష్టం చేసింది. ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకుంటున్న ఘటనలు వ్యక్తిగతమైనవి కావని..ఇవి సంస్ధాగతమైనవని పేర్కొంది. ఇండిగో వంటి సంస్థలు ప్రయాణీకులతో వ్యవహరించే పద్ధతిలో సానుకూల మార్పులు ప్రవేశపెట్టాల్సి ఉందని స్పష్టం చేసింది. తమ సిబ్బంది దురుసు ప్రవర్తనపై ఇండిగో కన్నేసి ఉంచాలని, వారి దుందుడుకు ప్రవర్తనను సరిచేయాలని సూచించింది. పలు విమానయాన సంస్థల సీఈఓలతో, సిబ్బంది, ప్రయాణీకులతో కమిటీ విస్తృతంగా చర్చలు జరిపిన మీదట ఈ నివేదికను రూపొందించింది. -
నోట్ల రద్దు ఎఫెక్ట్: పార్లమెంటరీ కమిటీ ఆరా
సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు లక్ష్యాలు,ఈ నిర్ణయం పర్యవసానాలపై పార్లమెంటరీ కమిటీ గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులను ప్రశ్నించింది. నోట్ల రద్దు ప్రభావాన్ని పూర్తిగా అంచనావేసేందుకు పలు మంత్రిత్వ శాఖల అధికారులను, రాష్ట్రాల ప్రతినిధులతో మాట్లాడాలని నిర్ణయించింది. గత ఏడాది నవంబర్ 8న ప్రకటించిన నోట్ల రద్దు వ్యవహారంపై మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ నేతృత్వంలో ఏర్పాటైన ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఇక నోట్ల రద్దు పర్యవసానాలపై ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్, సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్రలు పార్లమెంటరీ కమిటీకి వివరించారు. నల్లధనం నియంత్రణ, ఉగ్రకార్యకలాపాలు, డిజిటల్ లావాదేవీలపై నోట్ల రద్దు ప్రభావం గురించి పార్లమెంటరీ కమిటీ సభ్యులు అధికారులను ప్రశ్నించినట్టు సమాచారం. నోట్ల రద్దు బ్రాండ్ ఇండియా ప్రతిష్టను దెబ్బతీసిందని ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
‘ఆ నివేదికల్లో నల్లధనం గుట్టు’
సాక్షి,న్యూఢిల్లీః దేశవిదేశాల్లో భారతీయుల వద్ద పోగుపడ్డ నల్లధనం వివరాలపై యూపీఏ హయాంలో సమర్పించిన మూడు నివేదికలను పరిశీలిస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మూడు నివేదికల్లో బ్లాక్ మనీపై సమగ్ర వివరాలున్నట్టు సమాచారం. అయితే ఈ నివేదిక సారాంశం వివరాలు ఆర్టీఐ కింద వెల్లడించడం సాధ్యపడదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్టీఐ దరఖాస్తుదారుకు తెలిపింది.బ్లాక్‌మనీపై ఢిల్లీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్‌ఐపీఈపీ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షిల్ మేనజ్మెంట్ (ఎన్ఐఎఫ్ఎం)లు నిర్వహించిన మూడు అథ్యయన నివేదికలను 2013లో, ఆగస్ట్ 21, 2014లో ప్రభుత్వానికి సమర్పించాయి. 2014 మేలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఈ నివేదిక వివరాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. వీటిని ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ద్వారా ఇంకా పార్లమెంట్ ముందుకు తీసుకువెళ్లలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూడు నివేదికలు బహిర్గతమైతే దేశంలో, విదేశాల్లో నల్లధనం ఎంత మేర ఉందనే లెక్కలు అధికారికంగా తేలుతాయని భావిస్తున్నారు.