‘ఆ నివేదికల్లో నల్లధనం గుట్టు’
సాక్షి,న్యూఢిల్లీః దేశవిదేశాల్లో భారతీయుల వద్ద పోగుపడ్డ నల్లధనం వివరాలపై యూపీఏ హయాంలో సమర్పించిన మూడు నివేదికలను పరిశీలిస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మూడు నివేదికల్లో బ్లాక్ మనీపై సమగ్ర వివరాలున్నట్టు సమాచారం. అయితే ఈ నివేదిక సారాంశం వివరాలు ఆర్‌టీఐ కింద వెల్లడించడం సాధ్యపడదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్‌టీఐ దరఖాస్తుదారుకు తెలిపింది.బ్లాక్‌మనీపై ఢిల్లీకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్‌ఐపీఈపీ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షిల్ మేనజ్‌మెంట్ (ఎన్‌ఐఎఫ్‌ఎం)లు నిర్వహించిన మూడు అథ్యయన నివేదికలను 2013లో, ఆగస్ట్ 21, 2014లో ప్రభుత్వానికి సమర్పించాయి.
2014 మేలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఈ నివేదిక వివరాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. వీటిని ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ద్వారా ఇంకా పార్లమెంట్ ముందుకు తీసుకువెళ్లలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూడు నివేదికలు బహిర్గతమైతే దేశంలో, విదేశాల్లో నల్లధనం ఎంత మేర ఉందనే లెక్కలు అధికారికంగా తేలుతాయని భావిస్తున్నారు.