
ఆర్‌బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు కుంభకోణాలు, నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ)పై సందేహాలకు బదులిచ్చేందుకు మే 17న తమ ఎదుట హాజరు కావాలని ఆర్‌బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్‌కు ఆర్థిక వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేసింది. ఇటీవల వెలుగు చూసిన పలు బ్యాంకు కుంభకోణాలు, వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు రుణాలు వంటి పలు అంశాలపై పార్లమెంటరీ కమిటీ పలు సందేహాలకు సమాధానాలు రాబట్టాలని యోచిస్తున్నట్టు తెలిసింది. బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు నకిలీ పత్రాలతో పీఎన్‌బీ నుంచి రూ 12,636 కోట్ల మేర రుణాలు రాబట్టి విదేశాలకు ఉడాయించిన ఉదంతం బ్యాంకింగ్ వ్యవస్థలో పెనుదుమారం రేపిన విషయం విదితమే. మరోవైపు వీడియోకాన్ గ్రూప్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ రుణాల మంజూరులో బ్యాంక్ చీఫ్ చందా కొచర్ పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి
. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద నిరర్థక ఆస్తులు భారీగా పేరుకుపోవడం ఆందోళనలు రేకెత్తిస్తోంది. రూ రెండు లక్షల కోట్లకు పైగా కార్పొరేట్ రుణాలను బ్యాంకులు రద్దు చేయడం రుణ వసూలు ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే కోణంలోనూ పార్లమెంటరీ కమిటీ ఆర్‌బీఐ గవర్నర్ వివరణ కోరుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment