rbi governor urjit patel
-
ఆర్బీఐ x కేంద్రం ..'రాజీ'నామా!
కేంద్ర ప్రభుత్వానికి – రిజర్వ్ బ్యాంకుకు మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి క్లైమాక్స్ లాంటి ఘటనలు బుధవారం వేగంగా జరిగిపోయాయి. ఏ క్షణంలోనైనా ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయొచ్చని రోజంతా ఊహగానాలు షికారు చేయగా... వాటికి తెరవేస్తూ ఆర్థిక శాఖ ఒక ప్రకటన చేసింది. ఆర్బీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉండాల్సిందేనని, దానిని తాము గౌరవిస్తామని కూడా అందులో స్పష్టం చేసింది. దీంతో ప్రచ్ఛన్న యుద్ధానికి తాత్కాలికంగా తెరపడినట్లు కనిపించినా... రాజకీయ పక్షాలు మాత్రం భగ్గుమన్నాయి. స్వతంత్ర వ్యవస్థలన్నిటినీ కేంద్రం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డాయి. మరోవంక లిక్విడిటీ సంక్షోభాన్ని కట్టడి చేయటంలో ఆర్బీఐ విఫలమైందని విమర్శించటం ద్వారా... ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు వివాదం సమసిపోలేదనే సంకేతాలిచ్చారు. విద్యుత్ రంగంలో మొండిబాకీలపై ఆర్బీఐ కఠినంగా వ్యవహరిస్తుండటం కేంద్రానికి సుతరామూ నచ్చటం లేదు. పైపెచ్చు లిక్విడిటీ పెంచటానికి తగ్గు చర్యలకూ ముందుకు రావటం లేదు. ఈ రెండంశాలకూ సంబంధించి ఆర్బీఐపై అసంతృప్తి ఉన్నప్పటికీ... ప్రస్తుతానికి కొంత రాజీ ధోరణితో వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించుకుంది. ‘‘ఆర్బీఐకి స్వయం ప్రతిపత్తి ఉండాల్సిందే. దాన్ని మేం గౌరవిస్తాం’’ అని స్పష్టం చేసింది. అయితే, ప్రజా ప్రయోజనాలు, ఆర్థిక వ్యవస్థ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ పనిచేయాల్సి ఉందని పేర్కొంటూ కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రజా ప్రయోజనాలు, ఆర్థిక వ్యవస్థ శ్రేయస్సు కోసమే అనేక అంశాలపై మిగతా నియంత్రణ సంస్థల మాదిరిగానే ఆర్బీఐతోనూ కేంద్రం విస్తృతంగా చర్చలు జరుపుతుంటుంది. కానీ ఈ చర్చల వివరాలను కేంద్రం ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. తుది నిర్ణయాలను మాత్రమే ప్రకటిస్తూ వస్తోంది. ఇకపై కూడా ఇది కొనసాగుతుంది‘ అని ఆర్థిక శాఖ ప్రకటనలో పేర్కొంది. సెక్షన్ 7ను ప్రయోగించిన కేంద్రం? పలు అంశాలపై విభేదిస్తున్న రిజర్వ్ బ్యాంక్‌ను తమ దారికి తెచ్చుకునేందుకు కేంద్రం ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7ని ప్రయోగించిందన్న వార్తలు ఆర్థిక వర్గాల్లో దుమారం రేపాయి. ఒకవేళ సెక్షన్ 7 కింద కేంద్రం గానీ ఆదేశాలు జారీ చేసిన పక్షంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయొచ్చంటూ కూడా బుధవారం వదంతులు ఊపందుకున్నాయి. నిజానికి ఆర్బీఐకి స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ నిర్దిష్ట సందర్భాల్లో ఈ సెక్షన్ కింద దానికి ఆదేశాలిచ్చే అధికారాలు కేంద్రానికి ఉన్నాయి. అయితే, ఈ సెక్షన్‌ను ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ ఉపయోగించలేదు. రెండు భాగాలుగా ఉండే ఈ సెక్షన్ కింద తొలుత చర్చలు, ఆ తర్వాత చర్యలు ఉంటాయి. ఈ సెక్షన్ పరిధిలో ప్రస్తుతం చర్చల ప్రక్రియ మాత్రమే జరుగుతోందని, ఇది చర్యల రూపం దాల్చే అవకాశం లేకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెక్షన్ 7 (1) కింద వివిధ అంశాలపై ఆర్బీఐకి కేంద్రం ఇప్పటిదాకా కనీసం మూడు లేఖలు పంపినట్లు వెల్లడించాయి. పలు బ్యాంకుల్ని కఠినతరమైన సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలోకి తీసుకొస్తున్న ఆర్బీఐని... విద్యుత్ రంగ మొండిబాకీలతో సతమతమవుతున్న బ్యాంకులకు కొంత మినహాయింపునివ్వాలని తొలి లేఖలో ఆర్బీఐకి సూచించినట్లు తెలిసింది. రెండో లేఖలో వ్యవస్థలో నగదు లభ్యతను మెరుగుపర్చేందుకు ఆర్బీఐ దగ్గరున్న నిల్వలను ఉపయోగించాలని సూచించింది. అటు మూడో లేఖలో చిన్న, మధ్య తరహా సంస్థలకు బ్యాంకు రుణాల నిబంధనలను సడలించాలని పేర్కొన్నట్లు సమాచారం. అయితే, సెక్షన్ 7ని ప్రయోగించటం గురించి గానీ, లేఖల గురించి గానీ ప్రస్తావన లేకుండానే ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. ఆర్బీఐ చట్టం ఏం చెబుతోందంటే... ‘ప్రజా ప్రయోజనాలను పరిరక్షించే క్రమంలో.. అవసరమైన సందర్భాల్లో బ్యాంక్ గవర్నర్‌తో సంప్రతింపుల అనంతరం కేంద్రం రిజర్వ్ బ్యాంక్‌కు తగు ఆదేశాలు ఇవ్వొచ్చు‘ అని 1934 నాటి ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 (1) చెబుతోంది. ఇక సెక్షన్ 7 (2) ప్రకారం.. అవసరమైతే ఆర్బీఐని నిర్వహించే బాధ్యతలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కి కూడా కట్టబెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆర్బీఐ గవర్నర్‌ను, నలుగురు డిప్యూటీ గవర్నర్లను, స్వతంత్ర డైరెక్టర్లను ప్రధాన మంత్రి సారథ్యంలోని నియామకాల కమిటీ (ఏసీసీ) ఎంపిక చేస్తుంది. ఆర్బీఐ చట్టం ప్రకారం వీరితో పాటు ఇతరత్రా డైరెక్టర్లను కూడా తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలున్నాయి. ఏసీసీ ఇటీవలే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తిని, సహకార ఉద్యమ నేత ఎస్కే మరాఠేలను ఆర్బీఐ సెంట్రల్ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించింది. అంతకుమించి చెప్పేదేమీ లేదు.. జైట్లీ ఆర్థిక శాఖ ప్రకటన జారీ చేశాక ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా మీడియాతో మాట్లాడారు. తమ శాఖ జారీ చేసిన ప్రకటనకు అదనంగా తాను చెప్పడానికి ఏమీ లేదన్నారు. ‘ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య జరిగే చర్చలు, అవి ఏ స్థాయిలో ఉన్నాయి, ఏమేం చర్చించారు మొదలైన విషయాలేవీ గతంలో ఎన్నడూ బయటపెట్టడం జరగలేదని ఆర్థిక శాఖ చెప్పింది కదా. తుది నిర్ణయం మాత్రమే వెల్లడిస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు. కాకపోతే, లిక్విడిటీ సంక్షోభాన్ని కట్టడి చేయడంలోను, రుణాల వృద్ధిని ప్రోత్సహించడంలోనూ ఆర్బీఐ విఫలమైందని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాలను కుదిపేసిన నిధుల కొరత సమస్య పరిష్కారానికి రిజర్వ్ బ్యాంక్ తగు చర్యలు తీసుకోలేకపోయిందన్నారు. తద్వారా ఆర్బీఐతో వివాదం సమసిపోలేదన్న సంకేతాలిచ్చారు. -
ఆర్బీఐ గవర్నర్‌కు పార్లమెంటరీ కమిటీ సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు కుంభకోణాలు, నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ)పై సందేహాలకు బదులిచ్చేందుకు మే 17న తమ ఎదుట హాజరు కావాలని ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్‌కు ఆర్థిక వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేసింది. ఇటీవల వెలుగు చూసిన పలు బ్యాంకు కుంభకోణాలు, వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు రుణాలు వంటి పలు అంశాలపై పార్లమెంటరీ కమిటీ పలు సందేహాలకు సమాధానాలు రాబట్టాలని యోచిస్తున్నట్టు తెలిసింది. బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు నకిలీ పత్రాలతో పీఎన్బీ నుంచి రూ 12,636 కోట్ల మేర రుణాలు రాబట్టి విదేశాలకు ఉడాయించిన ఉదంతం బ్యాంకింగ్ వ్యవస్థలో పెనుదుమారం రేపిన విషయం విదితమే. మరోవైపు వీడియోకాన్ గ్రూప్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ రుణాల మంజూరులో బ్యాంక్ చీఫ్ చందా కొచర్ పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి . ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద నిరర్థక ఆస్తులు భారీగా పేరుకుపోవడం ఆందోళనలు రేకెత్తిస్తోంది. రూ రెండు లక్షల కోట్లకు పైగా కార్పొరేట్ రుణాలను బ్యాంకులు రద్దు చేయడం రుణ వసూలు ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే కోణంలోనూ పార్లమెంటరీ కమిటీ ఆర్బీఐ గవర్నర్ వివరణ కోరుతుందని భావిస్తున్నారు. -
పీఎన్బీ స్కాంపై మౌనం వీడిన ఆర్బీఐ గవర్నర్
గాంధీనగర్ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగు చూసిన భారీ కుంభకోణంపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ మౌనం వీడారు. ఏ బ్యాంకింగ్ రెగ్యులేటరీ కూడా అన్ని మోసాలను గుర్తించలేదని, నిరోధించలేదని అన్నారు. గాంధీనగర్‌లో గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీలో పటేల్ మాట్లాడారు. ఈ సందర్భంగా పీఎన్బీలో చోటు చేసుకున్న భారీ స్కాంపై రెగ్యులేటరీ పాత్రపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకున్న మోసాలు, అక్రమాలపై ఆర్బీఐ కూడా చాలా కోపంగా, బాధంగా ఉందని తెలిపారు. ఇలాంటి మోసపూరిత కేసులను ఆర్బీఐ అసలు ఉపేక్షించదన్నారు. ప్రస్తుతమున్న న్యాయ అధికారాలతో కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఏ బ్యాంకింగ్ రెగ్యులేటరీ కూడా వీటిని ఆపలేదన్నారు. ప్రస్తుతం డ్యూయల్ రెగ్యులేషన్ సిస్టమ్ ఉందని, ఒకటి ఆర్థికమంత్రిత్వ శాఖ, రెండు ఆర్బీఐ అని, దీంతో నియంత్రణలో బీటలు వారి, ఈ భారీ కుంభకోణం సంభవించిందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వహించడంలో ఆర్బీఐ రెగ్యులేటరీకి చాలా పరిమిత స్థాయిలో అథారిటీ ఉందని తెలిపారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌లో సంబంధిత చట్టం ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డైరెక్టర్లను, మేనేజ్మెంట్ను తొలగించే అధికారం ఆర్బీఐకి లేదన్నారు. అన్ని బ్యాంకులను ఆర్బీఐ రెగ్యులేట్ చేసినప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంకులను ఎక్కువగా ప్రభుత్వం రెగ్యులేట్ చేస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎక్కువ అధికారాలు ఆర్బీఐకి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. రూ.12,700 కోట్ల పీఎన్బీ స్కాం విషయంలో ఆర్బీఐ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. -
బంతిలా పైకిలేస్తాం..!
నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ • అంతర్జాతీయ ప్రతికూలతలనూ దీటుగా తట్టుకుంటున్నామని వ్యాఖ్య • డీమోనిటైజేషన్‌కు 100 రోజులు న్యూఢిల్లీ: నోట్ల రద్దు అనంతరం భారత్ ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ తిరిగి వేగంగా పురోగమిస్తుందని (‘వీ’ షేప్) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ‘ప్రపంచీకరణ’ దిశ నుంచి ‘రక్షణాత్మక ధోరణి’ వైపునకు మారే పరిస్థితులు నెలకొన్నప్పటికీ, అంతర్జాతీయంగా భారత్ ప్రయోజనాలకు విఘాతం కలగని పరిస్థితి ఉందని అన్నారు. డీమోనిటైజేషన్ నిర్ణయం ప్రకటించి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్న అంశాల్లో కొన్ని.. ⇔ స్వల్పకాలం ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ, తిరిగి ‘వీ’ షేప్‌లో పుంజుకుంటుదన్న అభిప్రాయానికి దాదాపు ప్రతి ఒక్కరి అంగీకారం ఉంది. ⇔ పెద్ద నోట్ల రద్దు అనంతరం వ్యవస్థలో కొత్తనోట్ల భర్తీ (రీమోనిటైజేషన్) వేగవంతంగా, పక్కా ప్రణాళిక ప్రకారం జరిగింది. ⇔ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను 7.1 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించిన ఆర్బీఐ, వచ్చే ఆర్థిక సంవత్సరానికి మాత్రం ఈ రేటును 7.4 శాతంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ⇔ 86 శాతం కరెన్సీ నోట్ల రద్దు ప్రయోజనాలు కనబడ్డానికి మరికొంత సమయం పడుతుంది. ఇందుకు మరికొన్ని చర్యలూ జోడించాల్సిన అవసరం ఉంటుంది. ⇔ భారత్ 9 శాతం వృద్ధి సాధనకు కొన్ని రంగాల్లో సంస్కరణలు ఇందుకు దోహదపడతాయని చెప్పగలం. భూ, కార్మిక విభాగాల్లో సంస్కరణలు ఇందులో కీలకమైనవి. 7.5 శాతంపైన వృద్ధి సాధ్యమని చెప్పడం కష్టమైనా... అంత స్థాయి వృద్ధి రేటు సాధ్యమేనని నేను భావిస్తున్నాను. ⇔ ద్రవ్యోల్బణమే ఆర్బీఐ రేట్ల పాలసీకి ప్రాతిపదిక. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగానే రేట్ల పెంపు నిర్ణయాన్ని ఇటీవల ద్రవ్యపరపతి విధాన కమిటీ తీసుకోలేదు. ⇔ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రక్షణాత్మక వాణిజ్య విధానాలు ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించేవేనని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా వర్థమాన దేశాల పరిస్థితిని ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ఫైనాన్షియల్ ఒడిదుడుకులకు ఈ పరిస్థితి దారితీయవచ్చు. ఏదోఒకదేశం ఈ పరిస్థితి నుంచి తప్పించుకుంటుందని నేను భావించడం లేదు. దీనిని భారత్ కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. ⇔ తన పనిని సమర్థవంతంగా నిర్వర్తించే పటిష్ట స్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. (నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే). మేము మా విధులను సమర్థవంతంగా నిర్వహించాం. గడచిన కొన్ని నెలలుగా ప్రధాన సవాళ్లను ఎదుర్కొన్నాం. విమర్శలో నిజముంటే... దానిని సరిచేసుకునేందుకు కృషిచేశాం. సద్విమర్శ పరిష్కారంలో పట్టుదలతో వ్యవహరించాం. -
నగదు విత్ డ్రా పై ఆంక్షలు ఎత్తివేత!
ముంబై : పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత నేపథ్యంలో బ్యాంకుల్లో, ఏటీఎంలలో విధించిన ఆంక్షల నుంచి ఇక ప్రజలకు పూర్తి విముక్తి లభించనుంది. ఈ ఆంక్షలను సేవింగ్స్ అకౌంట్స్‌కు 2017 మార్చి 13 నుంచి పూర్తిగా ఎత్తివేయనున్నట్టు రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. రెండు విడతల్లో నగదు విత్ డ్రా పరిమితి పై ఆంక్షలు తొలగిస్తామన్నారు. తొలుత 2017 ఫిబ్రవరి 20న ప్రస్తుతం వారానికి రూ.24వేలుగా ఉన్న విత్ డ్రా పరిమితిని రూ.50వేలకు పెంచుతామని ఉర్జిత్ తెలిపారు. ఆరవ ద్వైపాక్షిక సమీక్షను బుధవారం ప్రకటించిన ఉర్జిత్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ నగదు విత్ డ్రాపై విధించిన ఆంక్షలపై కూడా గుడ్‌న్యూస్ ప్రకటించింది. కాగ, నేటి ప్రకటనలో ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు కీలక నిర్ణయం వెలువరించింది. దీంతో రెపో రేటు 6.25 శాతం, రివర్స్ రెపో రేటు 5.75 శాతంగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ నిర్వహించిన పాలసీలో ఇది రెండవది. బ్యాంకుల్లో వడ్డీరేట్లు కూడా కిందకి దిగిరానున్నట్టు ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. -
ఆర్బీఐ రూటు ఎటు..?
► రేట్ల కోతపై ఉత్కంఠ... ► యథాతథమేనని ఫిక్కీ అంచనా ► తగ్గించే చాన్స్ ఉందంటున్న బ్యాంకర్లు ► 8న పాలసీ సమీక్ష న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 8న (బు«ధ వారం) చేపట్టనున్న ఆర్బీఐ పాలసీ సమీక్షపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లోకి వెల్లువెత్తిన డిపాజిట్ నిధుల ప్రభావం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఎగబాకుతుండటంతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం పొంచిఉండటం వంటి అంశాలతో పాలసీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, సేవల రంగం వరుసగా మూడో నెలలోనూ(జనవరి) క్షీణించడం చూస్తే.. రేట్ల కోత ఉండొచ్చని కొందరు బ్యాంకర్లు, విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, నోట్ల రద్దుతో భారీగా నిధులు వచ్చిచేరడంతో బ్యాంకులు గత నెలలో రుణ రేట్లను ఒక శాతం వరకూ తగ్గించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పాలసీ సమీక్షలో ఉర్జిత్ పటేల్ రెపో రేటును పావు శాతం తగ్గించి 6.25 శాతానికి చేర్చారు. ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) తొలి భేటీలోనే ఈ నిర్ణయం వెలువడింది. అయితే, నవంబర్ 8న రూ.1,000; రూ.500 నోట్లను రద్దు చేస్తున్న ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో డిసెంబర్లో జరిగిన భేటీలో కచ్చితంగా పావు శాతం కోత ఉండొచ్చని ఎక్కువ మంది అంచనా వేశారు. దీనికి భిన్నంగా ఆర్బీఐ మాత్రం పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ జనవరిలో బ్యాంకులు వరుసగా రుణ రేట్లను భారీగా తగ్గించడంతో ఆర్బీఐపై ఒత్తిడి కాస్త తగ్గినట్లయింది. ప్రస్తుతం రెపో రేటు(ఆర్బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు) 6.25%, రివర్స్ రెపో(ఆర్బీఐ వద్ద ఉంచే నిధులపై బ్యాంకులకు లభించే వడ్డీ రేటు) 5.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్– బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం) 4 శాతంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం... ఆర్బీఐ రేట్ల కోత నిర్ణయానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలే అడ్డంకిగా భావిస్తున్నారు. ముడి చమురు ధర ఎగబాకుతుండటం.. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న పలు రక్షణాత్మక వాణిజ్య విధానాలు భారత్‌తోపాటు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పారిశ్రామిక మండలి ఫిక్కీ... ఆర్బీఐ రానున్న పాలసీ సమీక్షలో రేట్లను యథాతథంగా ఉంచుతుందని పేర్కొంది. అయితే, 2017–18 ప్రథమార్ధంతో రేట్లను తగ్గించే అవకాశం ఉందని అంటోంది. బ్యాంకర్లు అటూఇటూ... బ్యాంకుల వద్దకు భారీగా డిపాజిట్ నిధులు వచ్చి చేరిన నేపథ్యంలో ఆర్బీఐ రానున్న పాలసీలో రేట్లను తగ్గించకపోవచ్చని బంధన్ బ్యాంక్ ఎండీ చంద్ర శేఖర్ఘోష్ అభిప్రాయపడ్డారు. అయితే, మరికొందరు బ్యాంకర్లు మాత్రం కోతకు ఆస్కారం ఉందని భావిస్తున్నారు. ‘ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక అంశాలన్నీ రెపో తగ్గింపునకు అనుకూలంగానే ఉన్నాయి. వృద్ధికి చేయూతనిచ్చేవిధంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చర్యలు ప్రకటించింది. ఇక ఆర్బీఐ కూడా దీనికి అనుగుణంగానే పాలసీ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. 8న సమీక్షలో పావు శాతం రెపో కోతను అంచనా వేస్తున్నాం’ అని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈడీ ఆర్కే గుప్తా వ్యాఖ్యానించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో అధిక ద్రవ్య సరఫరా(లిక్విడిటీ) ఉండటంతో పావు శాతం రెపో కోతకు ఆస్కారం ఉందని యూకో బ్యాంక్ ఎండీ సీఈఓ ఆర్కే టక్కర్ పేర్కొన్నారు. ముప్పావు శాతం తగ్గించాలి: అసోచామ్ డీమోనిటైజేషన్‌తో చౌక డిపాజిట్ నిధుల రూపంలో బ్యాంకులకు భారీగా లాభం చేకూరిందని.. దీన్ని రుణగ్రహీతలకు పూర్తిస్థాయిలో బదలాయించాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక మండలి అసోచామ్ పేర్కొంది. ‘ఆర్బీఐ రెపో రేటును 0.5–0.75 శాతం మేర తగ్గించాల్సిందే. ఈ కోతను బ్యాంకులు కూడా రుణ గ్రహీతలకు బదలాయించేలా ఆర్బీఐ, ఆర్థిక శాఖ చర్యలు తీసుకోవాలి. రుణవృద్ధి మందగమనం.. వినియోగ డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో పెట్టుబడులకు పునరుత్తేజం కల్పించాలంటే వడ్డీ రేట్ల తగ్గింపు చాలా కీలకం’ అని ఆసోచామ్ ప్రెసిడెంట్ సునీల్ కనోరియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాదికి పావు శాతమే..: నోమురా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. ద్రవ్యోల్బణం విషయంలో మధ్యకాలానికి సానుకూలంగానే(ద్రవ్యలోటు లక్ష్యాలకు కట్టుబడి ఉండటం ఇతరత్రా ఆర్థిక క్రమశిక్షణ చర్యలు) ఉందని.. ఈ నేపథ్యంలో రానున్న సమీక్షలో ఆర్బీఐ పావు శాతం రెపో రేటును తగ్గించొచ్చని జపాన్ ఆర్థిక సేవల దిగ్గజం నోమురా పేర్కొంది. అధిక క్రూడ్ ధరలు ఇతరత్రా విదేశీ అంశాల ప్రభావం ఉన్నప్పటికీ.. ఆర్బీఐ కోతకే మొగ్గుచూపొచ్చని అభిప్రాయపడింది. అయితే, దీనితర్వాత ఈ ఏడాదిలో(2017) ఇక తగ్గింపులు ఉండకపోవచ్చనేది నోమురా అంచనా. -
ఉర్జిత్ షాక్.. ఎయిర్‌పోర్టులో ముచ్చెమటలు
-
ఉర్జిత్ షాక్.. ఎయిర్‌పోర్టులో ముచ్చెమటలు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాదాపు చేయి చేసుకుంటున్నంత పని చేశారు. నల్లజెండాలతో ఆయనపైకి దూసుకెళ్లారు. ఈ దృశ్యానికి కోల్‌కతా విమానాశ్రయం వేదికైంది. గురువారం కోల్‌కతాలో బ్యాంకర్ల సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం జరుగుతుండగానే అక్కడ కొంతమంది సీపీఎం కార్యకర్తలు ఆందోళనలు చేశారు. ఆ సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం కూడా దాదాపు ఇదే పరిస్థితి పునరావృతమైంది. అయితే, ఈసారి నిరసన తెలిపిన వారు మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. సమావేశం ముగిసిన అనంతరం ఉర్జిత్ తన కారులో విమానాశ్రయం వద్దకు రాగా, పెద్ద మొత్తంలో కాంగ్రెస్ కార్యకర్తలు నల్లజెండాలతో ఆయనపైకి దూసుకొచ్చారు. ఆయన కారులో నుంచి దిగుతుండగానే ఆయనపైకి ఓ కార్యకర్త గట్టిగా నినాదాలు చేస్తూ దూసుకెళ్లడం. అక్కడ ఆయనకు రక్షణ డొల్ల స్పష్టంగా కనిపించింది. ఒక దేశ ఆర్బీఐ గవర్నర్‌కు ఉండాల్సిన భద్రత కూడా అక్కడ కరువైంది. దీంతో దాదాపు తోపులాట పరిస్థితి ఏర్పడింది. ఆయన వద్ద ఉన్న కొద్దిపాటి సిబ్బందికి దూసుకొస్తున్న కార్యకర్తలను అడ్డుకునేందుకు చెమటలు పట్టాయి. మరోపక్క, ఈ దృశ్యాలను మీడియా సైతం వీడియోలు, ఫొటోలు తీసింది. ఉర్జిత్ పటేల్ డౌన్ డౌన్ అంటూ నిరసనకారులు ఆయనపైకి దూసుకెళ్లడంతో భద్రతాధికారులు మాత్రం ఒక్కసారిగా షాక్ గురయ్యారు. -
ఉర్జిత్‌పై బ్యాంక్ ఉద్యోగుల ఫైర్
-
నోట్ల రద్దు ఎఫెక్ట్: ఉర్జిత్‌పై బ్యాంక్ ఉద్యోగుల ఫైర్
ముంబై: నోట్ల రద్దుపై రాజకీయ పక్షాల్లోనేకాక బ్యాంకింగ్ రంగంలోనూ పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్లో ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుపడుతుండగా.. బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు ఒక అడుగుముందుకేసి ఏకంగా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నాయి. నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో నెలకొన్న గందరగోళానికి బాధ్యుడు ముమ్మాటికి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేలేనని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు విశ్వాస్ ఉటాగి అన్నారు. బుధవారం ముంబైలో మీడియాతో మాట్లాడుతూ ‘బ్యాంకు ముందు భారీ క్యూలైన్లలో నిల్చోలేక ఇప్పటి వరకు 50 మంది చనిపోయారు. ఒక్కసారిగా విపరీతమైన తాకిడి పెరగడంతో బ్యాంకు ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా 11 మంది బ్యాంక్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చావులన్నింటికీ ఆర్బీఐ గవర్నరే బాధ్యత వహించి రాజీనామా చెయ్యాలి. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి తెలియదా?’అని విశ్వాస్ మండిపడ్డారు. (నోట్ల రద్దు ఎఫెక్ట్: ఉర్జిత్ ఔట్?) మరోవైపు ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు థామస్ ఫ్రాంకో కూడా ఇటీవల ఢిల్లీలో జరిగిన సదస్సులో ఆర్బీఐ గవర్నర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బ్యాంక్ ఉద్యోగుల మరణాలకు ఉర్జిత్ పటేలే బాధ్యుడని, వెంటనే పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ‘పాత నోట్లు రద్దై రోజులు గడుస్తున్నా దేశంలోని చాలా ప్రాంతాలకు కొత్త కరెన్సీ అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రజలు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు, నిజానికి మొత్తం కరెన్సీలో నగదు రూపంలో ఉండే బ్లాక్ మనీ 6 శాతానికి మించి ఉండదు. దానిని నిర్మూలించడానికి ఏకంగా 14 లక్షల కోట్ల విలువైన కరెన్సీని రద్దుచేయడం తెలివైనపని కాదు. నోట్ల రద్దు అనంతరం తలెత్తిన పరిస్థితికి బాధ్యుడిగా ఆర్బీఐ గవర్నర్ రాజీనామాను కోరడంలో తప్పులేదు’ అని ఫ్రాంకో అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆర్బీఐ గవర్నర్ పై అసహనం వ్యక్తం చేసినట్లు ఇటీవల కొన్న వార్తా సంస్థలు పేర్కొనడం గమనార్హం. -
'నగదు రద్దు విధ్వంసకర చర్య'
-
'నగదు రద్దు విధ్వంసకర చర్య'
ముంబై : పెద్ద నోట్ల రద్దు విధ్వంసకర చర్య అని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోషియేషన్ మండిపడింది. ముంబైలో సోమవారం అసోషియేషన్ ఉపాధ్యక్షుడు డి.థామస్ ఫ్రాంకో మీడియాతో మాట్లాడుతూ...ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు కారణంగా గడిచిన 13 రోజుల్లో పని ఒత్తిడి కారణంగా 11 మంది బ్యాంక్ ఉద్యోగులు మరణించడంతో పాటు అనేక మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక వేత్తలు కాదన్నారు. నగదు రద్దు పర్యవసానాలకు ఉర్జిత్ పటేల్ బాధ్యత వహించాలని థామస్ ఫ్రాంకో అన్నారు. -
నోట్ల రద్దు ఎఫెక్ట్: ఉర్జిత్‌పై మోదీ అసహనం?
న్యూఢిల్లీ: నోట్ల రద్దు పాపాన్ని తుడుచుకునేందుకు మోదీ సర్కార్ కొత్త ఎత్తుగడలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా చెలామణిలో ఉన్న 80 శాతం కరెన్సీని ఒక్కసారిగా రద్దుచేయడంతో దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు తలెత్తడం, దాదాపు అన్ని రంగాలు కుదేలైపోవడం, 12 రోజులు గడుస్తున్నా కొత్త నోట్లు బ్యాంకులకు చేరకపోవడం, నోటు మరణాలు నానాటికీ పెరుడుతుండటం తదితర పరిణాల నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తద్వారా ప్రజల్లో నెలకొన్న ఆగ్రహావేశాలను కొద్దిగానైనా చల్లార్చవచ్చని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పై ప్రధాని మోదీ ఆగ్రహంగా ఉన్నారని అందుకు కారణం నోట్ల రద్దు అనంతరం తలెత్తే పరిస్థితులను సులువుగా నివారించవచ్చని ఉర్జిత్ సలహా ఇవ్వడమేనని, రెండు రోజుల వ్యవధిలో దేశంలోని 3 లక్షల ఏటీఎంలను రీక్యాలిబరేట్ చేయగలమని ఆర్బీఐ గవర్నర్ హామీ ఇచ్చిన తర్వాతే మోదీ నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారని.. శని, ఆదివరాల్లో కొన్ని జాతీయ వార్తా సంస్థలు కథనాలు రాశాయి. ఇటు ఢిల్లీ వేదికగా శనివారం జరిగిన బ్యాంక్ ఆఫీసర్ల సదస్సులోనూ ఉర్జిత్ రాజీనామాపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అలా చెబితే నమ్మేస్తారా? ఒక్క ఏటీఎంలో నగదు నింపడానికే అరగంట నుంచి ముప్పావు గంట సమయం పడుతుందని మనందరికీ తెలుసు. అలాంటిది కొత్త నోట్లు వచ్చేలా ఏటీఎంలను పునరుద్ధరించడం, అదికూడా 3లక్షల ఏటీఎంలను రెండు రోజుల్లో సిద్ధం చేయడం అసంభవం. మరి దేశీయ బ్యాంకింగ్ రంగానికి బాస్ అయిన ఆర్బీఐ గవర్నర్ ఇంత దారుణమైన సలహాను ప్రభుత్వానికి ఎలా ఇస్తారు? ఒకవేళ ఇచ్చినా అందుకు ప్రధాని ఎలా అంగీకరిస్తారు? అనే ప్రశ్నలు ఉత్పన్నం కావడం సహజం. సోషల్ మీడియాలో చెలరేగుతోన్న పుకార్లకు కూడా సమాధానం ఇస్తోన్న కేంద్ర ఆర్థిక శాఖ ఈ విషయంలో మాత్రం పెదవివిప్పడంలేదు. ’ఆర్బీఐ గవర్నర్ పై వేటు’ అంశంపై స్పందిస్తూ కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో ప్రధాని మొరార్జీ దేశాయ్ నోట్లు రద్దు చేయాలనుకున్నప్పుడు నాటి ఆర్బీఐ గవర్నర్ ఐజీ పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా నోట్లు రద్దుచేయడాన్ని గవర్నర్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారని అయ్యర్ గుర్తుచేశారు. ‘నాకు తెలిసి ఏ ఆర్బీఐ గవర్నర్ కూడా తక్షణం నోట్ల రద్దుకు అంగీకరించరు. బహుశా ఉర్జిత్ పటేల్ కూడా మోదీ నిర్ణయాన్ని సమర్థించి ఉండరు’అని అయ్యర్ అన్నారు. బ్యాంక్ ఆఫీసర్ల సదస్సు సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబులిటీ(సీఎఫ్ఏ), పబ్లిక్ ఫైనాన్స్ అకౌంటబులిటీ(పీఎఫ్ఏ) శనివారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సదస్సు లోనూ వక్తలు ఆర్బీఐ గవర్నర్ పై మండిపడ్డారు. ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు థామస్ ఫ్రాంకో మాట్లాడుతూ.. ‘పాత నోట్లు రద్దై 12 రోజులు గడుస్తున్నా దక్షిణ భారతదేశం ఇంకా కొత్త రూ.500 నోటును చూడలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించండి’అని అన్నారు. మొత్తం కరెన్సీలో నగదు రూపంలో ఉండే బ్లాక్ మనీ 6 శాతానికి మించి ఉండదని, దానిని నిర్మూలించడానికి ఏకంగా 14 లక్షల కోట్ల విలువైన కరెన్సీని రద్దుచేయడం తెలివైనపని కాదని, నోట్ల రద్దు అనంతరం తలెత్తిన పరిస్థితికి బాధ్యుడిగా ఆర్బీఐ గవర్నర్ రాజీనామాను కోరడంలో తప్పులేదని సదస్సులో మాట్లాడిన ఇతర వక్తలు అభిప్రాయపడ్డారు. ’విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తానన్న మోదీ.. ఆ పని చేతకాకే స్వదేశీ నల్లధనం పల్లవి ఎత్తుకున్నారని సీపీఎం ఎంపీ డి.రాజా అన్నారు. ఉర్జిత్ ఎక్కడ? నవంబర్ 8 పెద్దనోట్లు రద్దు నిర్ణయం తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. మోదీ ఆగ్రహించినందుకు అలిగారో లేక తప్పుచేశాననే పశ్చాత్తాపంలో ఉన్నారో తెలియదుకానీ నోటు కష్టాలపై కనీసం మాటమాత్రమైన స్పందిచడానికి ఉర్జిత్ పటేట్ ముందుకు రావడంలేదు. వారం రోజుల్లో పరిష్కారం అవుతాయనుకున్న సమస్యలు కాస్తా 12 రోజులు దాటుతున్నా పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదు. అటు ఆర్థిక శాఖ అధికారులు కూడా ఆర్బీఐ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఏటీఎంల రీక్యాలిబరేషన్ కోసం ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముద్రాను నియమించడం, పటేల్ ప్రభుత్వానికి సరైన సూచనలు చేయలేదని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ తుషార్‌ధారా చక్రవర్తి వ్యాఖ్యనించడాన్ని చూస్తే తప్పు జరిగిందనే సంగతి అర్థం అవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా ఒక అడుగు ముందుకువేసి.. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం పూర్తిగా రాజకీయ నిర్ణయమని, ఇందులో అధికారుల పాత్ర ఏమీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.