ఆర్‌బీఐ x కేంద్రం ..'రాజీ'నామా! | RBI governor Urjit Patel may resign, say reports | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ x కేంద్రం ..'రాజీ'నామా!?

Published Thu, Nov 1 2018 12:46 AM | Last Updated on Thu, Nov 1 2018 8:04 AM

 RBI governor Urjit Patel may resign, say reports - Sakshi

కేంద్ర ప్రభుత్వానికి – రిజర్వ్‌ బ్యాంకుకు మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి క్లైమాక్స్‌ లాంటి ఘటనలు బుధవారం వేగంగా జరిగిపోయాయి. ఏ క్షణంలోనైనా ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయొచ్చని రోజంతా ఊహగానాలు షికారు చేయగా... వాటికి తెరవేస్తూ ఆర్థిక శాఖ ఒక ప్రకటన చేసింది. ఆర్‌బీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉండాల్సిందేనని, దానిని తాము గౌరవిస్తామని కూడా అందులో స్పష్టం చేసింది. దీంతో ప్రచ్ఛన్న యుద్ధానికి తాత్కాలికంగా తెరపడినట్లు కనిపించినా... రాజకీయ పక్షాలు మాత్రం భగ్గుమన్నాయి. స్వతంత్ర వ్యవస్థలన్నిటినీ కేంద్రం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డాయి. మరోవంక లిక్విడిటీ సంక్షోభాన్ని కట్టడి చేయటంలో ఆర్‌బీఐ విఫలమైందని విమర్శించటం ద్వారా... ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి ఒకరు వివాదం సమసిపోలేదనే సంకేతాలిచ్చారు. 

విద్యుత్‌ రంగంలో మొండిబాకీలపై ఆర్‌బీఐ కఠినంగా వ్యవహరిస్తుండటం కేంద్రానికి సుతరామూ నచ్చటం లేదు. పైపెచ్చు లిక్విడిటీ పెంచటానికి తగ్గు చర్యలకూ ముందుకు రావటం లేదు. ఈ రెండంశాలకూ సంబంధించి ఆర్‌బీఐపై అసంతృప్తి ఉన్నప్పటికీ... ప్రస్తుతానికి కొంత రాజీ ధోరణితో వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించుకుంది. ‘‘ఆర్‌బీఐకి స్వయం ప్రతిపత్తి ఉండాల్సిందే. దాన్ని మేం గౌరవిస్తాం’’ అని స్పష్టం చేసింది. అయితే, ప్రజా ప్రయోజనాలు, ఆర్థిక వ్యవస్థ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆర్‌బీఐ పనిచేయాల్సి ఉందని పేర్కొంటూ కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రజా ప్రయోజనాలు, ఆర్థిక వ్యవస్థ శ్రేయస్సు కోసమే అనేక అంశాలపై మిగతా నియంత్రణ సంస్థల మాదిరిగానే ఆర్‌బీఐతోనూ కేంద్రం విస్తృతంగా చర్చలు జరుపుతుంటుంది. కానీ ఈ చర్చల వివరాలను కేంద్రం ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. తుది నిర్ణయాలను మాత్రమే ప్రకటిస్తూ వస్తోంది. ఇకపై కూడా ఇది కొనసాగుతుంది‘ అని ఆర్థిక శాఖ ప్రకటనలో పేర్కొంది.  

సెక్షన్‌ 7ను ప్రయోగించిన కేంద్రం? 
పలు అంశాలపై విభేదిస్తున్న రిజర్వ్‌ బ్యాంక్‌ను తమ దారికి తెచ్చుకునేందుకు కేంద్రం ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 7ని ప్రయోగించిందన్న వార్తలు ఆర్థిక వర్గాల్లో దుమారం రేపాయి. ఒకవేళ సెక్షన్‌ 7 కింద కేంద్రం గానీ ఆదేశాలు జారీ చేసిన పక్షంలో ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా  చేయొచ్చంటూ కూడా బుధవారం వదంతులు ఊపందుకున్నాయి. నిజానికి ఆర్‌బీఐకి స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ నిర్దిష్ట సందర్భాల్లో ఈ సెక్షన్‌ కింద దానికి ఆదేశాలిచ్చే అధికారాలు కేంద్రానికి ఉన్నాయి. అయితే, ఈ సెక్షన్‌ను ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ ఉపయోగించలేదు. రెండు భాగాలుగా ఉండే ఈ సెక్షన్‌ కింద తొలుత చర్చలు, ఆ తర్వాత చర్యలు ఉంటాయి. ఈ సెక్షన్‌ పరిధిలో ప్రస్తుతం చర్చల ప్రక్రియ మాత్రమే జరుగుతోందని, ఇది చర్యల రూపం దాల్చే అవకాశం లేకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సెక్షన్‌ 7 (1) కింద వివిధ అంశాలపై ఆర్‌బీఐకి కేంద్రం ఇప్పటిదాకా కనీసం మూడు లేఖలు పంపినట్లు వెల్లడించాయి. పలు బ్యాంకుల్ని కఠినతరమైన సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధిలోకి తీసుకొస్తున్న ఆర్‌బీఐని... విద్యుత్‌ రంగ మొండిబాకీలతో సతమతమవుతున్న బ్యాంకులకు కొంత మినహాయింపునివ్వాలని తొలి లేఖలో ఆర్‌బీఐకి సూచించినట్లు తెలిసింది. రెండో లేఖలో వ్యవస్థలో నగదు లభ్యతను మెరుగుపర్చేందుకు ఆర్‌బీఐ దగ్గరున్న నిల్వలను ఉపయోగించాలని సూచించింది. అటు మూడో లేఖలో చిన్న, మధ్య తరహా సంస్థలకు బ్యాంకు రుణాల నిబంధనలను సడలించాలని పేర్కొన్నట్లు సమాచారం. అయితే, సెక్షన్‌ 7ని ప్రయోగించటం గురించి గానీ, లేఖల గురించి గానీ ప్రస్తావన లేకుండానే ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది.

ఆర్‌బీఐ చట్టం ఏం చెబుతోందంటే... 
‘ప్రజా ప్రయోజనాలను పరిరక్షించే క్రమంలో.. అవసరమైన సందర్భాల్లో బ్యాంక్‌ గవర్నర్‌తో సంప్రతింపుల అనంతరం కేంద్రం రిజర్వ్‌ బ్యాంక్‌కు తగు ఆదేశాలు ఇవ్వొచ్చు‘ అని 1934 నాటి ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 7 (1) చెబుతోంది. ఇక సెక్షన్‌ 7 (2) ప్రకారం.. అవసరమైతే ఆర్‌బీఐని నిర్వహించే బాధ్యతలను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌కి కూడా కట్టబెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆర్‌బీఐ గవర్నర్‌ను, నలుగురు డిప్యూటీ గవర్నర్లను, స్వతంత్ర డైరెక్టర్లను ప్రధాన మంత్రి సారథ్యంలోని నియామకాల కమిటీ (ఏసీసీ) ఎంపిక చేస్తుంది. ఆర్‌బీఐ చట్టం ప్రకారం వీరితో పాటు ఇతరత్రా డైరెక్టర్లను కూడా తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలున్నాయి. ఏసీసీ ఇటీవలే ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త ఎస్‌ గురుమూర్తిని, సహకార ఉద్యమ నేత ఎస్‌కే మరాఠేలను ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించింది.

అంతకుమించి చెప్పేదేమీ లేదు.. జైట్లీ 
ఆర్థిక శాఖ ప్రకటన జారీ చేశాక ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా మీడియాతో మాట్లాడారు. తమ శాఖ జారీ చేసిన ప్రకటనకు అదనంగా తాను చెప్పడానికి ఏమీ లేదన్నారు. ‘ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య జరిగే చర్చలు, అవి ఏ స్థాయిలో ఉన్నాయి, ఏమేం చర్చించారు మొదలైన విషయాలేవీ గతంలో ఎన్నడూ బయటపెట్టడం జరగలేదని ఆర్థిక శాఖ చెప్పింది కదా. తుది నిర్ణయం మాత్రమే వెల్లడిస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు. కాకపోతే, లిక్విడిటీ సంక్షోభాన్ని కట్టడి చేయడంలోను, రుణాల వృద్ధిని ప్రోత్సహించడంలోనూ ఆర్‌బీఐ విఫలమైందని ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆటోమొబైల్, రియల్‌ ఎస్టేట్‌ రంగాలను కుదిపేసిన నిధుల కొరత సమస్య పరిష్కారానికి రిజర్వ్‌ బ్యాంక్‌ తగు చర్యలు తీసుకోలేకపోయిందన్నారు. తద్వారా ఆర్‌బీఐతో వివాదం సమసిపోలేదన్న సంకేతాలిచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement